బాక్సైట్ దోపిడీకే బాబు విదేశీ పర్యటనలు: రఘువీరా రెడ్డి | Raghuveera reddy slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాక్సైట్ దోపిడీకే బాబు విదేశీ పర్యటనలు: రఘువీరా రెడ్డి

Nov 25 2014 5:43 AM | Updated on Sep 2 2017 5:06 PM

బాక్సైట్ దోపిడీకే బాబు విదేశీ పర్యటనలు: రఘువీరా రెడ్డి

బాక్సైట్ దోపిడీకే బాబు విదేశీ పర్యటనలు: రఘువీరా రెడ్డి

విశాఖ ఏజెన్సీలో విలువైన బాక్సైట్ ఖనిజ సంపదను దోచుకునే ఎజెండాతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్, మలేషియా వంటి దేశాల పర్యటనకు వెళుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు.

పాడేరు: విశాఖ ఏజెన్సీలో విలువైన బాక్సైట్ ఖనిజ సంపదను దోచుకునే ఎజెండాతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్, జపాన్, మలేషియా వంటి దేశాల పర్యటనకు వెళుతున్నారని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. హుద్‌హుద్ తుపానుతో నష్టపోయిన గిరిజన ప్రజలను పరామర్శించి, మృతి చెందిన కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులు, రగ్గులు, చీరల పంపిణీ   చేసేందుకు సోమవారం పాడేరు ప్రాంతంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వనుగుపల్లి పంచాయతీ మారుమూల బంగారుమెట్ట గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో  ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం ఆరునెలల పరిపాలన అస్తవ్యస్తంగా ఉందని, గిరిజనులు, దళితుల సంక్షేమాన్ని కూడా విస్మరిస్తోందని దుయ్యబట్టారు.  గత ఎన్నికల్లో పెట్టుబడి పెట్టిన బడాబాబులందరికీ గిరిజన సంపదను దోచిపెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయని ఆరోపించారు.
 
 ఈ రెండు ప్రభుత్వాల కుట్రలను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ  గిరిజనుల పక్షాన పోరాడుతుందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీలో గిరిజనుల పక్షాన పోరాటం చేశారని, తమకు   అసెంబ్లీలో స్థానం లేనందున ప్రజాకోర్టుల ద్వారా బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.  గిరిజన శాసనసభ్యుడు ఉన్నప్పటికి మంత్రిని కూడా చేయకుండా గిరిజనులను టీడీపీ ప్రభుత్వం అవమాన పరుస్తోందని  విమర్శించారు.   ఏజెన్సీలో  బాధితులను ఆదుకోవడంలో తాము విఫలమయ్యామని సాక్షాత్తు మంత్రి రావెల కిశోర్ బాబే ప్రకటించడాన్ని బట్టి టీడీపీ ప్రభుత్వ నిరంకుశ పాలన అర్థమవుతుందన్నారు. కాఫీ తోటల ధ్వంసమైన బాధితులందరికి పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించాలని లేనిపక్షంలో రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని  చెప్పారు. అనంతరం బాధిత గిరిజనులకు రగ్గులు, చీరలను రఘువీరా రెడ్డి పంపిణీ చేశారు.
 
 కక్షతో టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు
 విశాఖపట్నం: చంద్రబాబు కక్షతో, ఉద్దేశపూర్వక ంగా శంషాబాద్ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు పెట్టారని పీసీసీ అధ్యక్షుడు పి. రఘువీరారెడ్డి ఆరోపించారు. సోమవారం విశాఖలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ పనితీరుపై ధ్వజమెత్తారు. చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల కంటే సింగపూర్‌పై దృష్టి సారించి ‘సింగపూర్ బాబు’లా మారాడని ఆయన చమత్కరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement