టీటీడీ బంగారంపై ష్‌.. గప్‌చుప్‌

Punjab National Bank Silence on TTD Gold - Sakshi

సాక్షి ప్రతినిధి, చెన్నై:  తమిళనాడులో తనిఖీల్లో పట్టుబడ్డ 1,381 కిలోల బంగారంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నా సమాధానం చెప్పకుండా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు మౌనం పాటిస్తోంది. పీఎన్‌బీ చెన్నై మింట్‌స్ట్రీట్‌ శాఖలో డిపాజిట్‌ చేసినట్లుగా చెబుతున్న 1,381 కిలోల బంగారాన్ని ఏపీకి తరలిస్తుండగా తిరువళ్లూరు జిల్లా పూందమల్లి మండల పరిధిలో 17వ తేదీ రాత్రి ఎన్నికల సంఘం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీటీడీకి అప్పగించేందుకు తీసుకెళుతున్నట్లు వాహనంలోని సిబ్బంది చెప్పారు. అయితే, టీటీడీ కార్యనిర్వహణాధికారి(ఈవో) ఈ వ్యవహారంపై పూటకో సమాధానం చెబుతుండడంతో అనుమానాలు బలపడుతున్నాయి. అసలు ఈ బంగారం టీటీడీదేనా? అని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. బంగారం తరలింపుపై పీఎన్‌బీ చెన్నై మింట్‌స్ట్రీట్‌ శాఖ మేనేజర్‌ను సంప్రదించగా.. బ్యాంకు లావాదేవీల్లో తన పాత్ర కేవలం 5 శాతమేనని, బంగారం వ్యవహారాన్ని నడిపించిన చెన్నై రాయపేటలోని సర్కిల్‌ కార్యాలయానికి వెళ్లాలని సూచించారు. సర్కిల్‌ కార్యాలయంలో వాకబు చేయగా, తమకు తెలియదని, జోనల్‌ మేనేజరే సరైన అథారిటీ అని అక్కడి సిబ్బంది బదులిచ్చారు.

పీఎన్‌బీ జోనల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ను వివరణ కోరగా, బంగారం రవాణాపై తాను ఏమీ చెప్పకూడదని అన్నారు. బంగారం తరలింపు విషయంలో నియమ నిబంధనలు పాటించారా? ఎవరి పేరుతో ఇన్‌వాయిస్‌లు సిద్ధం చేశారు? ఇన్‌వాయిస్‌లో టీటీడీ పేరును ప్రస్తావించారా? ఏప్రిల్‌ 17వ తేదీన బ్యాంకు నుంచి తరలిస్తున్నట్లు టీటీడీకి లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చారా? ఒకవేళ ముందుగానే సమాచారం ఇచ్చి ఉన్న పక్షంలో టీటీడీ స్పందన ఏమిటి? తమకు ముందుగా సమాచారం లేదని పీఎన్‌బీపైనే టీటీడీ ఎందుకు ఆరోపణలు చేస్తోంది?.. ఇలా ఎన్ని ప్రశ్నలు అడిగినా జోనల్‌ మేనేజర్‌ వినోద్‌కుమార్‌ నోరు విప్పలేదు. బంగారం తరలింపు వెనుక భారీ కుంభకోణం ఉందని, ఇందుకు పీఎన్‌బీ కూడా సహకరించిందనే  ఆరోపణలు వినిపిస్తున్నపుడు మీ నిజాయతీని నిరూపించుకోవాల్సిన అవసరం లేదా? పీఎన్‌బీ వివరణ ఇవ్వనందున అవి ఆరోపణలు కావు, వాస్తవాలు అనుకునే అవకాశం ఉంది కదా? అని ప్రశ్నించగా.. అవన్నీ ఢిల్లీలోని ప్రధాన కార్యాలయం చూసుకుంటుందని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. మీ వైపు నుంచి సజావుగా, పారదర్శకంగానే లావాదేవీలు జరిగాయనే ఒక స్టేట్‌మెంట్‌ ఇస్తారా? గోప్యత పాటించాల్సిన అవసరమేంటని ప్రశ్నించగా, ఆయన నుంచి చిరునవ్వే సమాధానమైంది.  

గడువు తీరడం వల్లే తరలింపు  
బంగారం డిపాజిట్‌ గడువు 17వ తేదీన తీరిపోయిందని, అందుకే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నా తరలించాల్సి వచ్చిందని పీఎన్‌బీ వర్గాలు తెలిపాయి. గడువు దాటాక∙కూడా తమ వద్ద ఉంచుకుంటే ఖాతాదారుకు అదనంగా వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి.

1,381 కిలోలా.. 1,750 కిలోలా?
తిరుపతి: తమిళనాడులో పట్టుబడ్డ బంగారం ఎట్టకేలకు టీటీడీ ట్రెజరీకి చేరింది. టీటీడీకి చేరకుండా ఉండుంటే ఓ ముఖ్య నాయకుడికి అప్పగించేవారని తిరుపతిలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ట్రెజరీకి చేరిన బంగారం 1,381 కిలోలు కాదని 1,750 కేజీలని కొందరు టీటీడీ అధికారులంటున్నారు. తమిళనాడు ఎన్నికల సందర్భంగా పట్టుబడ్డ  ఈ బంగారంపై ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. టీటీడీ డిపాజిట్‌ చేసిన బంగారానికి ఈనెల 18తో గడువు తీరుతుందని ఈఓ రాత పూర్వకంగా ఇచ్చిన విషయం తెలిసిందే. గడువు తీరిన రోజు లాంఛనాలన్నీ పూర్తి చేసి తగిన భద్రతా ఏర్పాట్ల మధ్య టీటీడీ ట్రెజరీకి తరలించాల్సి ఉంది. అయితే ఒక రోజు ముందే బంగారాన్ని తరలించడం అనుమానాలకు బలం చేకూర్చినట్లయింది.

ఈ ప్రశ్నలకు జవాబేదీ?
ఖజానాకు చేరిన బంగారు ఆభరణాలు, నాణేలు, నగదును క్షుణ్ణంగా పరిశీలించేందుకు 11 మంది అప్రైజర్స్‌ (మదింపు అధికారులు) ఉన్నారు. వీరు మూడు బ్యాచ్‌లుగా పని చేస్తున్నారు. ట్రెజరీకి చేరే ప్రతి వస్తువును వీరు తనిఖీ చేసి విలువ కడుతుంటారు. తమిళనాడు నుంచి బంగారం ఎన్ని గంటలకు వచ్చింది? వచ్చిన బంగారాన్ని తూకం వేశారా? ఆ సమయంలో అన్ని విభాగాల అధికారులు ఉన్నారా>? ఉంటే వాహనంలో ఎన్ని పెట్టెలు వచ్చాయి? ఒక్కో పెట్టెలో ఎన్ని బంగారం కడ్డీలు ఉన్నాయి. ఒక్కో కడ్డీ బరువు ఎంత? వాహనంలో నుంచి దించుకోవటానికి, తూకం వెయ్యటానికి ఎంత సమయం పట్టింది? తూకం వేసే సమయంలో బంగారం నాణ్యతను పరిశీలించారా? బంగారం ట్రెజరీకి చేరిన సమయంలో ఈఓ, సీవీఎస్‌ఓ, ట్రెజరీకి చెందిన డిప్యుటీ ఈఓ, బంగారాన్ని నిల్వ ఉంచే గది ఇన్‌చార్జ్, కూలీలు, కార్మికులు ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలు వెల్లడించకుండా గోప్యంగా ఉంచారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. తమిళనాడు నుంచి వచ్చిన వాహనంలోని బంగారాన్ని కేవలం ఇద్దరు మాత్రమే దించుకుని ట్రెజరీలో భద్రపరచినట్లు చెబుతున్నారు. ఈఓ, జేఈఓ, సీవీఎస్‌ఓ, అడిషనల్‌ సీవీఎస్‌ఓ ఎవరూ లేరని టీటీడీ పరిపాలన భవనంలో పనిచేసే కొందరు అధికారులు వెల్లడించారు. తర్వాత గోప్యంగా తూకం వేసినట్లు సమాచారం. కాగా, 1,750 కిలోల బంగారం ట్రెజరీకి చేరితే టీటీడీ ముఖ్య అధికారులు 1,381 కిలోలు అని చెబుతుండటం పట్ల టీటీడీ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సీబీఐ విచారణకు ఆదేశిస్తేగానీ ఈ బాగోతం బట్టబయలు కాదని భక్తులు అభిప్రాయపడుతున్నారు.    

టీటీడీ బంగారం తరలింపులో లోపాలు
అమరావతి: టీటీడీ బంగారం తరలింపు ప్రక్రియలో లోపాలు ఉన్నాయని, శ్రీవారి బంగారంతో భక్తుల మనోభావాలు ముడిపడి ఉన్నాయనే విషయాన్ని గుర్తించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్‌వి సుబ్రహ్మణ్యం అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. టీటీడీ బంగారం తరలింపు వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ నివేదికను ముఖ్యమంత్రి అమోదం కోసం పంపించామన్నారు. పెద్ద మొత్తంలో బంగారం తరలించే సమయంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందని నివేదికలో పేర్కొన్నట్లు చెప్పారు. బ్యాంకు అధికారులు, టీటీడీ అధికారులు ఇంత అజాగ్రత్తగా వ్యవహరించాల్సింది కాదన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాఖల వారీ సమీక్షలు నిర్వహించటంలో తప్పేముందని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక రాజకీయ నేతలు నిబంధనలకు అనుగుణంగానే నడుచుకోవాలన్నారు. ఈ విషయమై ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయని చెప్పారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top