రాష్ట్ర పోలీసులకు ఏడో తేదీ టెన్షన్ పట్టుకుంది! ఆరోజు ఎల్బీ స్డేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సును నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం పట్టుదలతో ఉండగా...
సేవ్ ఆంధ్రప్రదేశ్: ఖాకీలకు ఏడో తేదీ టెన్షన్
Sep 2 2013 3:51 AM | Updated on Sep 1 2017 10:21 PM
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పోలీసులకు ఏడో తేదీ టెన్షన్ పట్టుకుంది! ఆరోజు ఎల్బీ స్డేడియంలో ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ సదస్సును నిర్వహిస్తామని ఏపీ ఎన్జీవో సంఘం పట్టుదలతో ఉం డగా, మరోవైపు తెలంగాణ రాష్ట్ర బిల్లును వెంటనే పార్లమెంటులో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ చేపడతామని టీ జేఏసీ తెగేసి చెబుతుండటంతో పరిస్థితి ఎటు తిరిగి ఎటు వెళ్తుందోనన్న ఆందోళనలో పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. ఇప్పటికే రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాల్లో సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఇరుపక్షాలు ఒకేరోజు కార్యక్రమాలు చేపట్టడంతో టెన్షన్ నెలకొంది. సదస్సుకు పోలీసులు అనుమతినివ్వాలని, లేకపోతే కోర్టు ద్వారా అనుమతిని తెచ్చుకుంటామని ఇప్పటికే ఏపీఎన్జీవోలు స్పష్టంచేశారు.
అనుమతి రాకపోయినా సదస్సును నిర్వహించి తీరుతామంటున్నారు. తెలంగాణ జేఏసీ నాయకులు కూడా అదేరోజు ఎన్టీఆర్ స్టేడియం నుంచి నిజాం కాలేజీ వరకు వేలాది మంది తో శాంతి ర్యాలీని నిర్వహించడంపై పట్టుదలతో ఉంది. ఒకేరోజు ఇరుపక్షాలు సదస్సు, ర్యాలీలు నిర్వహించడంతో శాం తి భద్రతల సమస్య ఏర్పడుతుందని ఇంటెలిజెన్స్ విభాగం ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు తెలిపింది. దీంతో ఈ రెండు పక్షాలకు అనుమతి ఇవ్వరాదంటూ హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ కమలాసన్‌రెడ్డి పోలీసు ఉన్నతాధికారులకు నివేదికను పంపించినట్లు తెలిసింది. అయితే దీనిపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదని, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని తమ పరిశీలనలో తేలితే అనుమతి ఇవ్వబోమని పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చెప్పారు.
Advertisement
Advertisement