ఉన్నత విద్య క్యాలెండర్‌ సిద్ధం | Prepared the Higher Education Calendar | Sakshi
Sakshi News home page

ఉన్నత విద్య క్యాలెండర్‌ సిద్ధం

Jun 10 2020 4:34 AM | Updated on Jun 10 2020 4:34 AM

Prepared the Higher Education Calendar - Sakshi

సాక్షి, అమరావతి: కరోనా ప్రభావంతో ఉన్నత విద్య అకడమిక్‌ క్యాలెండర్‌ అమలు తారుమారవుతోంది. కోవిడ్, లాక్‌డౌన్‌ కారణంగా సిలబస్‌ పూర్తికాకపోగా సెమిస్టర్‌ పరీక్షలు కూడా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దీన్ని పూర్తి చేయడంతోపాటు 2020–21 విద్యాసంవత్సరాన్ని ప్రారంభించడంపై యూజీసీ సూచనలతో 9 అంశాలతో ఉన్నత విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. అండర్‌ గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ ప్రొఫెషనల్, నాన్‌ ప్రొఫెషనల్‌ కాలేజీలు, వర్సిటీలు ఈ ప్రణాళిక ప్రకారం ప్రస్తుత విద్యాసంవత్సరం సిలబస్‌ పూర్తి, పరీక్షల నిర్వహణతోపాటు వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంపై సూచనలు పొందుపరిచింది. అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఈ ప్రణాళిక రూపొందించినా భవిష్యత్తు పరిణామాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు అవసరమవుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నెలాఖరు కల్లా సిలబస్‌ పూర్తి చేయాలి..
► 2019–20లో మిగిలిపోయిన సిలబస్‌ను విద్యాసంస్థలు జూన్‌ ఆఖరుకల్లా పూర్తిచేయాలి. కాలేజీల్లో భౌతిక దూరం పాటించేందుకు వీలుగా 50 శాతం మంది విద్యార్థులను మాత్రమే తరగతులకు అనుమతించాలి. మిగతావారికి ఆన్‌లైన్, లైవ్‌ తరగతుల ద్వారా సిలబస్‌ పూర్తి చేయాలి. లేదా విద్యార్థులకు తరగతి గదుల్లో రెండు సెక్షన్లలో కూడా బోధించవచ్చు.
► ప్రాక్టికల్‌ తరగతులను కూడా భౌతిక దూరం పాటిస్తూ జూన్‌ ఆఖరునాటికి పూర్తిచేయాలి. 
► 2019–20 ఫైనలియర్‌ థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షలు జూలై1నుంచి 15లోపు పూర్తిచేయాలి. చివరి పరీక్ష ముగిసిన 15 రోజుల్లోగా ఫలితాలను ప్రకటించాలి. ఇందుకు అనుగుణంగా మూల్యాంకన విధానాలు మార్పుచేసి త్వరితంగా ఫలితాలు ఇచ్చేలా చూడాలి. ఇతర సెమిస్టర్ల విద్యార్థులకు పరీక్షల షెడ్యూల్‌ను 2020–21 విద్యాసంవత్సరం ప్రారంభమయ్యాక ప్రకటిస్తారు. ఫైనలియర్‌ కాకుండా ఇతర సంవత్సరాలు చదువుతున్న ఈ విద్యార్థులను వారి అటెండెన్సును అనుసరించి పై సంవత్సరాలకు ప్రమోట్‌ చేస్తారు.
► పీహెచ్‌డీ స్కాలర్ల సెమిస్టర్, వైవా వాయిస్‌ల పరీక్షలను యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆన్‌లైన్లో పూర్తిచేయాలి. వైవా వాయిస్‌ను రికార్డుచేసి వర్సిటీలో భద్రపర్చాలి.

కోవిడ్‌ తీవ్రతను బట్టి ప్రత్యామ్నాయ ప్రణాళిక 
‘ఉన్నత విద్యామండలి రూపొందించిన ప్రణాళికకు ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే దీని ప్రకారం తరగతుల నిర్వహణకు వర్సిటీలు, కాలేజీలు చర్యలు చేపట్టాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రణాళిక రూపొందించాం. వైరస్‌ తీవ్రత పెరగకుంటే దీని ప్రకారమే విద్యా సంస్థలు ముందుకు వెళతాయి. లేదంటే అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళికలను రూపొందించుకోవాల్సి ఉంటుంది’ 
– ప్రొఫెసర్‌ కె.హేమచంద్రారెడ్డి (ఉన్నత విద్యామండలి చైర్మన్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement