ఊపిరి పీల్చుకున్న తాడిపత్రి

Prabodhananda Swami Devotees Are Leaving The Ashram - Sakshi

సాక్షి, అనంతపురం : తాడిపత్రిలో గత రెండు రోజులుగా కొనసాగుతున్న వివాదం చల్లారింది. వినాయక నిమజ్జనం సందర్భంగా తాడిపత్రిలో ప్రబోదానందస్వామి భక్తులు, జేసీ సోదరుల మధ్య చెలరేగిన ఘర్షణలకు తెరపడింది. ఆశ్రమ నిర్వాహకులతో కలెక్టర్ వీరపాండ్యన్ సోమవారం జరిపిన చర్చలు ఫలించాయి. ఆశ్రమం వదిలి స్వగ్రామాలకు వెళ్లేందుకు భక్తులు అంగీకరించారు. తాము ఏ ఒక్కరికీ అనుకూలం కాదని... ఆశ్రమానికి రక్షణ కల్పిస్తామని కలెక్టర్ భరోసా ఇవ్వడంతో భక్తులు శాంతించారు. ఆశ్రమం నుంచి ఆర్టీసీ బస్సుల్లో అధికారులు వారిని తరలించారు.

పోలీసుల తీరు వివాదాస్పదం
మరోవైపు ప్రబోదానందస్వామి ఆశ్రమంపై పోలీసులు వ్యవహరించిన తీరు వివాదస్పదమవుతోంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాల్సిన పోలీసుల్లో కొంతమంది బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. ప్రబోదానందస్వామి ఆశ్రమంలోని సీసీ కెమెరా ను సాక్షాత్తు పోలీసులే ధ్వంసం చేయటం దుమారం రేపుతోంది.

ఆదివారం రోజున ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. కొందరు పోలీసులు తమ వద్ద ఉన్న లాఠీలతో సీసీ కెమెరాలను పగులగొట్టారు. జేసీ వర్గీయులకు మేలు చేసేందుకు ఇలా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రబోదానందస్వామి ఆశ్రమంలో ఉన్న కొందరు భక్తులను లాఠీలతో కొడుతున్న దృశ్యాలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి. దీంతోపాటు జేసీ వర్గీయుల రాళ్ళ దాడి, వాహనాల ధ్వంసం చేసిన తీరు ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నాయి. తక్షణమే చంద్రబాబు సర్కారు జోక్యం చేసుకుని తాడిపత్రిలో శాంతిభద్రత పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top