ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న పవర్ ఆఫీసులో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి.
	♦ అగ్నికి ఆహుతైన మరమ్మతులో ఉన్న టాన్స్‌ఫార్మర్స్
	♦ వాటితోపాటు ఆయిల్ డ్రమ్ములు
	♦ తృటిలో తప్పిన ప్రాణాపాయం
	♦ రూ.10 లక్షల మేర నష్టం
	♦ {పమాద స్థలానికి చేరుకున్న విద్యుత్ శాఖ ఎస్‌ఈ జయకుమార్
	 
	 ఒంగోలు క్రైం : ఒంగోలు నగరంలోని కర్నూలు రోడ్డులో ఉన్న పవర్ ఆఫీసులో బుధవారం రాత్రి మంటలు చెలరేగాయి. పనులు ముగించుకొని సిబ్బంది 6.30 గంటలకల్లా ఉద్యోగులు బయటకొచ్చిన కొంత సేపటికే ట్రాన్స్‌ఫార్మర్స్ మరమ్మతు విభాగంలో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడ్డాయి. ఆయిల్ ఫిల్టర్ నుంచి మంటలు చెలరేగాయి. ఇది గమనించిన వాచ్‌మెన్ వెంటనే అక్కడున్న విద్యుత్ అధికారులకు, ఒంగోలు అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. అప్పటికే మరమ్మతుకు సిద్ధంగా ఉన్న మూడు ట్రాన్స్‌ఫార్మర్లకు అంటుకున్నాయి.
	
	వాటితోపాటు ఐదు ఆయిల్ డ్రమ్ములకు కూడా మంటలు వ్యాపించాయి. ఈలోగా అగ్నిమాపక శాఖకు చెందిన రెండు ఫైర్ ఇంజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. లేకుంటే పెను ప్రమాదమే సంభవించేది. ఎందుకంటే చుట్టూ మరమ్మతు చేసిన ట్రాన్స్‌ఫార్మర్లు కూడా ఉన్నాయి. మరోవైపు ట్రాన్స్‌ఫార్మర్ల స్క్రాప్ కూడా ఉంది. ప్రస్తుతం జరిగిన అగ్ని ప్రమాదంతో రూ.10 లక్షల మేర నష్టం వాటిల్లింది. విద్యుత్ శాఖ ఎస్‌ఈ  ఎ.జయకుమార్ హుటాహుటిన ప్రమాద స్థలానికి చేరుకున్నారు. నష్టం ఏవిధంగా జరిగిందీ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
