లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్) పేరుతో ట్రాన్స్‌కో మళ్లీ విద్యుత్ కోతలకు దిగుతోంది.
తాండూరు, న్యూస్‌లైన్ : లోడ్ రిలీఫ్ (ఎల్‌ఆర్) పేరుతో ట్రాన్స్‌కో మళ్లీ విద్యుత్ కోతలకు దిగుతోంది. రెండు వారాలుగా కొనసాగుతున్న అనధికారిక విద్యుత్ కోతలు ఆదివారం నుంచి అధికారికంగా అమలు కానున్నాయి. వేళలకు సంబంధించిన షెడ్యూల్‌ను వికారాబాద్ విద్యుత్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (డీఈఈ) సాంబశివరావు శనివారం ప్రకటించారు. పట్టణాల్లో(మున్సిపాలిటీలు) నాలుగు గంటలు, మండల కేంద్రాల్లో నాలుగు గంటలపాటు ఎల్‌ఆర్ కోతలు విధించనున్నారు. ఇందులో భాగంగా పట్టణాల్లో ఇప్పటివరకు అమల్లో ఉన్న మూడు గంటల కోతలకు అదనంగా మరో గంటసేపు సరఫరా నిలిపివేస్తుండటం గమనార్హం. ఇక మండల కేంద్రాల్లో కోతల్లో అధికారులు పెద్దగా మార్పు చేయలేదు. ఆదివారం నుంచి రెండు విడతలుగా లోడ్ రిలీఫ్ కోతలు అమలు చేయనున్నారు.
పట్టణాల్లో ఉదయం 8గంటల నుంచి 10గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు, మండల కేంద్రాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు, సాయంత్రం 4గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. అయితే ఈ ఎల్‌ఆర్ కోతలు ఎప్పటివరకు కొనసాగుతాయనేది అధికారులు స్పష్టం చేయటం లేదు. రెండు దఫాలుగా పట్టణ, మండల కేంద్రాల్లో నాలుగు గంటల పాటు కోతలు విధించాలని మాత్రమే ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారని స్థానిక విద్యుత్ సిబ్బంది ఒకరు పేర్కొన్నారు. ఎప్పుడు కోతలు ఎత్తివేసే విషయం తెలియదన్నారు. అధికారికంగా రెండు విడతలుగా విధించనున్న 8గంటల విద్యుత్ కోతలకు తోడు అనధికారిక కోతలతో తమకు కష్టాలు తప్పవనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.