ఇదేనా పోలవరం మోడల్‌!

Is This Polavaram Model ! - Sakshi

సాక్షి, వేలేరుపాడు: ‘దోచుకోవడం.. దాచుకోవడం’ అన్నట్టు తయారైంది పరిస్థితి. పోలవరం నిర్వాసిత కాలనీల్లో చేపట్టిన నిర్మాణాల విషయంలో నాణ్యతకు తిలోదకాలు వదిలేశారు. దీంతో పిల్లర్లు, స్లాబులు అష్టవంకర్లు పోతున్నాయి. ఎప్పుడు కూలతాయో తెలియని పరిస్థితి. పునాదుల దశలోనే నిర్మాణాలు నాసిరకంగా జరుగుతున్నాయి. కాలనీలు కూలిపోతే తమ ప్రాణాలకు బాధ్యులెవరని నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కాలనీలో నిర్మాణాలు పూర్తయినా నివసించేందుకు నిర్వాసితులు సాహసించడం లేదు. ఇంజినీరింగ్‌ అధికారుల అవినీతి, కాంట్రాక్టర్ల ధనకాంక్ష వెరసి కాలనీల పనులన్నీ నాణ్యతాలోపంగా జరుగుతున్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. కాలనీల పనులు త్వరితగతిన పూర్తిచేయాలనే ఉద్దేశంతో నాణ్యతను గాలికి వదిలేశారు. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు.

29,545 నిర్వాసిత కుటుంబాలు
పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణం వల్ల వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో 29,545 కుటుంబాలు ఇళ్లు కోల్పోతున్నాయి. ఇందులో 10,000 గిరిజన కుటుంబాలు ఉండగా, 19,545 గిరిజనేతర నిర్వాసిత కుటుంబాలు ఉన్నాయి. గిరిజనేతర నిర్వాసితులకు జంగారెడ్డిగూడెం మండలం తాడువాయిలో పునరావాసం కల్పించనున్నారు. 10 వేల గిరిజన కుటుంబాలకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు మండలాల్లో కాలనీలు నిర్మాణాలు జరుగుతున్నాయి. 

రూ.470 కోట్ల పనుల్లో ఏదీ నాణ్యత
పంచాయతీరాజ్, ఆర్‌అండ్‌బీ, ఐటీడీఏ ఇంజినీరింగ్, హౌసింగ్, ఏపీఎస్‌ఐడీసీ (ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఇండస్ట్రీయల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌) తదితర ఐదు శాఖల ఆధ్వర్యంలో సుమారు రూ.470 కోట్లతో నిర్మించే పునరావాస కాలనీ పనుల్లో కాంట్రాక్టర్‌లు నిబంధనలను తుంగలో తొక్కి నాణ్యతా ప్రమాణాలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. ఇందులో హౌసింగ్‌ శాఖకు రూ.222 కోట్లు, ఐటీడీఏ ఇంజినీరింగ్‌కు రూ.161 కోట్లు, పంచాయతీరాజ్‌కు రూ.41 కోట్లు మిగలినవి ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్‌ఐడీసీలకు కేటాయించారు. అయితే నిర్మాణ పనులను ఆయా శాఖలకు అప్పగించిన ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పనుల్లో నాణ్యత క్షీణించినా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కొన్నిచోట్ల కాంట్రాక్టర్‌లు పనులు వదిలేసి వెళ్లిపోయారు. జీలుగుమిల్లి  మండలం తప్సివారిగూడెంలో వేలేరుపాడు మండలం కొయిదా నిర్వాసితులకు కాలనీల నిర్మాణం చేపట్టే కాంట్రాక్టర్‌ రెండు నెలల క్రితమే పనులు నిలిపివేశారు. బుట్టాయగూడెం మండలంలో చేపట్టిన కాలనీల పనులు ముందుకు సాగడం లేదు.  

అష్టవంకరులుగా.. 
కుక్కునూరు, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో చేపట్టిన కాలనీల నిర్మాణంలో పిల్లర్లు, పునాదులు, సన్‌సైడ్‌లు అష్టవంకర్లు తిరిగి ఉన్నాయి. కుక్కునూరు మండలం చెరువు కొమ్ముగూడెం గ్రామానికి చెందిన 270 మంది నిర్వాసితుల కోసం ఉప్పేరు సమీపంలోని చెరువు పుల్లప్పగూడెం గ్రామంలో నిర్మిస్తున్న ఇళ్ల కాలనీలు దారుణంగా ఉన్నాయి. ఇక్కడ పిల్లర్లు అష్టవంకర్లు తిరిగి ఉన్నాయి. బుట్టాయగూడెంలో సైట్‌–1లో నిర్మిస్తున్న వేలేరుపాడు మండలం చాగరపల్లి గ్రామస్తుల కాలనీలో స్లాబ్‌లు సైతం వంగిపోయి ఉన్నాయి. 

నిర్మాణ సామగ్రి.. నాసిరకం
ప్రభుత్వం చేపట్టే నిర్మాణ పనులకు టాటా, వైజాగ్‌ స్టీల్‌ ఐరన్‌ను వాడాల్సి ఉంది. అయితే తక్కువ రకం ఐరన్‌ను వాడుతున్నారు. అలాగే నిర్మాణాలకు వాగులు, వంకల్లోని నాసిరకం ఇసుకను వినియోగిస్తున్నారు. ఎస్టిమేట్‌లో లీడ్‌ ప్రకారం ఉన్న ఇసుకను కూడా వాడటం లేదు. సిమెంట్‌ ఇటుకలు కూడా నాసిరకంగా ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. కొన్నిచోట్ల వాటర్‌ క్యూరింగ్‌కే  ఇటుకలు కరిగిపోతున్నాయి. కొన్ని కాలనీల్లో వాటర్‌ క్యూరింగ్‌ నామమాత్రంగా చేస్తున్నారు. ఫలితంగా కట్టిన గోడలు, పిల్లర్లు,  బీమ్‌లు బీటలు వారుతున్నాయి. 

కనిపించని ఆర్‌అండ్‌ఆర్‌ కమిటీలు 
ఎప్పటికప్పుడు కాలనీల నిర్మాణాల  నాణ్యతను పరిశీలించడానికి  ఆర్‌అండ్‌ఆర్‌ క్వాలిటీ కమిటీలను ఐటీడీఏ పీఓ నియమించారు. ఆయా గ్రామాల వారీగా కమిటీలను నియమించారు. వీరికి నెల వేతనం కూడా చెల్లిస్తున్నారు. అయినా వీరెక్కడా పనులను పర్యవేక్షించడం లేదు.  టెక్నికల్‌గా ఈ కమిటీకి ఏ నాణ్యతా ప్రమాణాలు తెలియదనే చెప్పవచ్చు. ఏమీ తెలియని వారినే కమిటీ సభ్యులుగా నియమించారు. వీరు నిర్మాణాల నాణ్యత గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. నిర్మాణ సామగ్రిపై కూడా కనీస 
అవగాహన లేదు.  

 
కాంట్రాక్లర్ల ఇష్టారాజ్యం
పనులపై ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని నిర్వాసితులు ఆరోపిస్తున్నారు. కాంట్రాక్టర్‌లు ఇచ్చే పర్సంటేజీలకు తలొగ్గిన సంబంధిత అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వేలేరుపాడు మండలంలోని ఏడు గ్రామ పంచాయతీల్లో 48 గ్రామాల్లో 4,800 మంది గిరిజన నిర్వాసితులకు బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఏడు చోట్ల ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నారు. దర్బగుడెంలో 980, బుట్టాయగూడెంలో 1,100, రౌతుగూడెంలో 310, దొరమామిడిలో 700, స్వర్ణవారిగుడెంలో 450, ముల్కలంపల్లిలో 950, రాసన్నగూడెంలో 400 మొత్తం 4,800 ఇళ్ల కాలనీలు నిర్మిస్తున్నారు. కుక్కునూరు మండలంలో 15 గ్రామ పంచాయతీల్లోని 59 గ్రామాల్లో 3,048 మంది నిర్వాసితుల ఇళ్ల కాలనీలు ఇదే మండలంలోని పెదరావిగుడెం, ఉప్పేరు, కివ్వాక, దాచారం (రాయికుంట), చీరవల్లి తదితర గ్రామాల్లో కాలనీలు నిర్మిస్తున్నారు. పోలవరం మండలంలోని గిరిజనులకు జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లోని దర్బగూడెం, పి.నారాయణపురం, వెంకవారిగూడెం, రాచన్నగూడెం, జీలుగుమిల్లి కాలనీలు నిర్మిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top