పీఎంఏవై.. పత్తా లేదోయ్‌!

PMAY Scheme Homes Delayed in Srikakulam - Sakshi

ఐటీడీఏ పరిధిలో పీఎంఏవై గృహాలకు మంగళం?

రెండేళ్లుగాసాగనిపనులు  పల్స్‌ సర్వేలో గుర్తించినా ఇళ్లు కేటాయించని వైనం

గిరిజన గూడలకు గుడిసెలే గతి!   

హోరున గాలి వీస్తుంటే మట్టి గోడల పక్కన భయంభయంగా బతకాల్సిందే. జోరున వాన కురుస్తుంటే చిల్లులు పడిన రేకుల కింద బకెట్లు మారుస్తూ రోజులు గడపాల్సిందే. ఏనుగుల ఘీంకరింపులు వినిపించిన వేళ తంతే విరిగిపోయే తలుపుల వెనుక నోరు కట్టుకుని మౌనంగా ఉండాల్సిందే. గిరిజన గూడేల్లోని గుడిసెల బతుకుల్లో మార్పు రావడం లేదు. పక్కా ఇంటికి మారాలన్న వారి కల నెరవేరడం లేదు. రెండేళ్లుగా ఊరించిన ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన ఆఖరుకు ఉసూరుమనిపించింది. అర్హులను గుర్తించి ఆ తర్వాతి పనులు ఆపేసింది. ఫలితంగా ఐటీడీఏ పరిధిలోని గిరిజనులు పూరి గుడిసెల్లోనే ఉండిపోవాల్సి వస్తోంది.

శ్రీకాకుళం, సీతంపేట: ఐటీడీఏ పరిధిలో పీఎంఏవై పథకం దాదాపు ఆగిపోయినట్టే కనిపిస్తోంది. రెండేళ్లుగా ఈ పథకం ద్వారా ఒక్క ఇంటిని కూడా మం జూరు చేయలేదు. దీంతో గిరిజనులు మళ్లీ ఆ పాత ఇళ్లలోనే కాలం నెట్టుకురావాల్సి వస్తోంది. కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పథకం వీరి బతుకులను మార్చలేకపోతోంది. 2017లో ఈ పథకం ద్వారా ఆగమేగాలపై పల్స్‌ సర్వే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడంతో ఇంటింటా సర్వే చేశారు. మండలానికి 3 నుంచి 4 వేల వరకు గృహాలు అవసరమని గుర్తించారు.

ఈ మేరకు వినతులు కూడా అదే స్థాయిలో వచ్చాయి. అయితే ఈ పథకానికి సంబంధించిఇప్పటి వరకు అతీగతీ లేకుండా పోయింది. ఐటీడీఏ పరిధిలోని 20 మండలాల్లో సుమారు 60 వేల కుటుంబాలకు పక్కా ఇళ్లు లేవని సర్వేలో గుర్తించారు. కానీ అలా గుర్తించిన వారికి ఇప్పటివరకు ఇళ్లు ఇవ్వలేదు. కొద్ది నెలల కిందట వచ్చి తిత్లీ తుఫాన్‌కు ఉన్న రేకులు, పూరిళ్లు ఎగిరిపోవడంతో గిరిజనులు పడుతున్న బాధలు రెట్టింపయ్యాయి. 2016లో కేవలం సీతంపేట మండలానికి సంబంధించి పీఎంఏవైలో మాత్రమే 33 గృహాలు మంజూరయ్యాయి. అప్పటి నుంచి మరెవరికీ గృహాలు మంజూరు కాని పరిస్థితి ఉంది. ఈ పథకంలో ఒక్కో గృహానికి రూ.2లక్షల ఆర్థిక సాయం అందివ్వాలని గతంలో నిర్ణయించారు. ఇప్పటికీ ఈ పథకానికి సంబంధించి అతీగతి లేకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.

ఎన్టీఆర్‌ గృహ నిర్మాణానిదీ అదే దారి
ఎన్టీఆర్‌ గృహనిర్మాణానిది కూడా దాదాపు ఇదే దారి. శ్రీకాకుళం డివిజన్‌ పరిధిలో ఈ పథకం కింద 148 గృహాలు మాత్రమే మంజూరయ్యాయి. పాలకొండ డివిజన్‌లో 770, టెక్కలి డివిజన్‌ పరిధిలో 158 మాత్రమే మంజూరయ్యాయి. మొత్తం 1076 మంజూరు కాగా వీటిలో 500ల వరకు ఇంతవరకు ప్రారంభం కాలేదు. ప్రారంభమైన వాటికి ఎన్నికల హామీల్లో భాగంగా.. గిరిజన ప్రాంతాల్లో గృహాల నిర్మాణానికి రూ.2లక్షల 75 వేలు ఇస్తామని ఇందులో రూ. 1.75 వేలు సబ్సిడీ ఇస్తామని ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చ లేదు. కేవలం రూ.లక్షా 50 వేలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికితోడు గత కొద్ది రోజులుగా నూతనంగా నిర్మించిన ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదు. దీనికి ప్రధాన కారణం ఆన్‌లైన్‌లో ఏఈల ఆధార్‌ అథంటికేషన్‌ నిలిచిపోవడమేనని చెబుతున్నారు.

హౌసింగ్‌ ఏఈ ఏమన్నారంటే...
ఈ విషయమై హౌసింగ్‌ ఏఈ సంగమేశ్వరరావు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా పీఎంఏవై గృహాలకు సంబంధించి గతంలో పల్స్‌ సర్వే చేశామని ఇంకా ఇళ్లు మంజూరు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం బిల్లులు చెల్లింపులకు సర్వర్‌ నిలిచినట్లు తెలిపారు.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు
గిరిజనులకు పూర్తిస్థాయిలో గృహాలు మంజూరు చేయాలని పలుమార్లు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం. అలాగే ఉన్న హౌసింగ్‌ పథకాలకు సైతం దిశానిర్దేశం లేదు. పీఎంఏవై గృహాల మంజూరు లేదు. ఎన్టీఆర్‌ గృహాలు కూడా ఒక్కో మండలానికి వంద లోపే తూతూ మంత్రంగా మంజూరు చేసి చేతులు దులుపుకున్నారు.– విశ్వాసరాయి కళావతి,పాలకొండ ఎమ్మెల్యే

ఇల్లు ఇవ్వడం లేదు
గృహం మంజూరు కాక అవస్థలు పడుతున్నాం. పూరిళ్లలో నివసిస్తున్నాం. ఇబ్బందులు తప్పడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు గృహాలు మంజూరు చేయాలి.
– అమావాస్య, అచ్చిభ  

బిల్లులు రాలేదు
కొన్నేళ్లుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికీ బిల్లులు కావడం లేదు. దీంతో పునాదులు నిర్మించినా బిల్లులు ఇవ్వకపోడంతో కష్టాలు తప్పడం లేదు. అప్పులు చేసి కట్టడం జరిగింది. ప్రభుత్వ కరుణ లేదు.– ఎస్‌.పట్టాభి, అంటికొండ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top