బక్షి సిఫారసుల అమలు ఆపండి: మంత్రి కాసు | Please stop implementation of bakshi proposals, kasu krishnareddy asks center | Sakshi
Sakshi News home page

బక్షి సిఫారసుల అమలు ఆపండి: మంత్రి కాసు

Sep 17 2013 1:41 AM | Updated on Sep 1 2017 10:46 PM

నాబార్డు చైర్మన్ బక్షి సిఫారసుల అమలును వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

నాబార్డు చైర్మన్ బక్షి సిఫారసులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (ప్యాక్స్) మనుగడను ప్రశ్నార్థకం చేస్తాయని.. ఆ సిఫారసుల మేరకు  జారీచేసిన ఉత్తర్వుల అమలును వెంటనే నిలిపివేయాలని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై సమగ్రమైన చర్చకు వీలుగా అన్ని రాష్ట్రాల సహకార శాఖల మంత్రులతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి చిదంబరానికి ఆయన సోమవారం లేఖ రాశారు. ప్యాక్స్ ప్రతిపత్తిని దెబ్బతీస్తూ, వాటిని కేవలం ‘బిజినెస్ కరస్పాండెంట్లు’గా పరిమితం చేయటం వల్ల సన్నకారు, కౌలు రైతుల రుణ పరపతి దెబ్బతింటుందని కాసు పేర్కొన్నారు. పైగా సహకార రంగం రాష్ట్ర అధికారాల పరిధిలోనిదని, రాష్ట్ర సహకార చట్టంలో మార్పులు చేయకుండా నాబార్డు ప్రస్తుత సిఫారసులను అమలు చేయటం కుదరదని పేర్కొన్నారు.

ప్యాక్స్ రికార్డుల స్వాధీనానికి సర్క్యులర్: ఇదిలావుంటే.. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఆస్తులు, అప్పులు, డిపాజిట్లు, ఖాతాలకు సంబంధించిన అన్ని రికార్డులను స్వాధీనం చేసుకోవాలని సంబంధిత కేంద్ర సహకార బ్యాంకులకు నాబార్డ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ వి.రామకృష్ణ సోమవారం సర్క్యులర్ జారీ చేశారు. ఇకపై ప్యాక్స్ సొంతంగా ఎలాంటి డిపాజిట్లూ తీసుకోరాదని, రుణాల లావాదేవీలు జరపరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇకపై ‘ప్యాక్స్’ కేంద్ర సహకార బ్యాంకులకు కేవలం బిజినెస్ కరస్పాండెంట్లుగానే వ్యవహరించాల్సి ఉంటుందని స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement