మావోయిస్టు ప్రాంతాల్లో పీఓ సుడిగాలి పర్యటన


  • మారుమూల రోడ్లు పరిశీలన

  • ఇద్దరు వార్డెన్లకు షోకాజ్ నోటీసులు

  • గోమంగి వైద్యసిబ్బందిపై చర్యలకు ఆదేశాలు

  • పాడేరు: ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి.వినయ్‌చంద్ ఈ ఏడాది ఆఖరి రోజున సాహసోపేత పర్యటన చేపట్టారు. మావోయిస్టులు సంచరించే ప్రాంతంలో పర్యటనలు మానుకోవాలని ఓవైపు పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న తరుణంలో బుధవారం ఐటీడీఏ పీవో వినయ్‌చంద్ జి.మాడుగుల, పెదబయలు మండలాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మారుమూల గ్రామాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న కష్టాలను తెలుసుకోవడంతో పాటు  గిరిజన విద్యాలయాల్లో విద్యాభివృద్ధి, ఆస్పత్రుల్లో   వైద్య సేవలపై విస్తృత తనిఖీలు  చేపట్టారు.



    ముందుగా జి.మాడుగుల మండలంలోని నుర్మతి బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన ఐటీడీఏ పీఓ అన్ని రికార్డులను పరిశీలించారు. 317 మంది విద్యార్థినులకు గాను 164 మంది మాత్రమే హాజరుకావడంపై పీవో అసంతృప్తి వ్యక్తంచేశారు. ఉదయం 10 గంటల వరకు విద్యార్థుల హాజ రు నమోదు చేయకపోవడంపై హెచ్‌ఎం విధులను తప్పుపట్టారు.   



    వసతిగృహంలోని రికార్డుల్లో చూపిన సంఖ్య కంటే తక్కువ మంది పిల్లలు ఉండటంతోపాటు ఈ నెల 24 నుంచి మెనూలో చూపినట్లు గుడ్లు ఆహారంలో ఇవ్వకపోవడంపై  ఆగ్రహం వ్యక్తంచేసి డిప్యుటీ వార్డెన్‌కు షోకాజ్ నోటీసు  జారీ చేశారు. విద్యార్థులకు మరుగుదొడ్లు, విద్యుత్, నీటి సరఫరా సమస్యలపై దృష్టి సారించాలని హెచ్‌ఎంను ఆదేశించారు. అనంతరం మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంగా గుర్తింపు పొందిన మద్దిగరువు నుంచి గోమంగి రోడ్డులో పీవో ప్రయాణించారు. దారి వెంబడి గిరిజనుల సమస్యలను తెలుసుకున్నారు.   



    మావోయిస్టుల హెచ్చరికలతో నిలిచిపోయిన రోడ్ల పరిస్థితిపై ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షించారు.  గోమంగి ఆరోగ్య కేంద్రం సందర్శనకు వెళ్లినపుడు మూతపడి ఉండటంపై పీవో మండిపడ్డారు. గిరిజనులకు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడాన్ని తప్పుపడుతూ వైద్యురాలు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఏడీఎంహెచ్‌ఓను ఆదేశించారు. గోమంగి మినీ గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ అదనపు తరగతుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలకు వెంటనే ప్రతిపాదనలు సమర్పించాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.  



    బొండాపల్లి బాలుర ఆశ్రమ పాఠశాలను సందర్శించి  హాజరుపట్టికలో చూపిన సంఖ్య కంటే తక్కువగా విద్యార్థులు ఉండటాన్ని గ్రహించారు. వసతిగృహంలోని స్టాక్ రిజిస్టర్‌లో ఎంట్రీలు అప్ టు డేట్‌గా లేకపోవడంతో వార్డెన్‌కు  షోకాజ్ నోటీసు జారీచేశారు. ఇక్కడ  అదనపు తరగతుల భవన నిర్మాణాలు, ఇతర సౌకర్యాల పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మద్దిగరువు, బంగారుమెట్ట రోడ్డులో  చేపట్టిన హైలెవెల్‌వంతెన, అనేక రోడ్ల పనులను పరిశీలించి   ప్రగతిని తెలుసుకున్నారు. ఈ పర్యటనలో గిరిజన సంక్షేమ ఈఈ ఎంఆర్‌జీ నాయుడు, పెదబయలు, జి.మాడుగుల డీఈఈలు పాల్గొన్నారు.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top