ఆధునిక టెక్నాలజీతో భూముల రీ సర్వే..!

Pilli Subhash Chandra Bose Speech At Kakinada - Sakshi

గ్రామపాలన రద్దుతో రెవెన్యూ రికార్డులకు చెదలు పట్టాయి

డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌

సాక్షి, కాకినాడ: వచ్చే ఉగాది నాటికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్దేశమని.. దీనిని అమలు చేయాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. గురువారం ‘నవరత్నాలు-పేదలందిరికీ ఇళ్లు’ సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూమి ఎంత ఉందో సేకరించి.. దాని కోసం అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎంటువంటి ఒత్తిళ్లకు లొంగవద్దని సూచించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంకు ముందు నుంచే రాష్ట్రంలో గ్రామపాలన ఉండేదని తెలిపారు. భూములు, చెరువులకు సంబంధించిన రెవెన్యూ రికార్డులు సక్రమంగా ఉండేవన్నారు. కానీ 1984లో గ్రామపాలన రద్దు చేయడంతో రెవెన్యూ రికార్డులకు చెదలు పట్టి క్షీణ దశకు చేరాయన్నారు. ప్రస్తుతం రెవెన్యూ రికార్డులను పూర్తిగా ప్రక్షాళన చేయాలన్నారు. కాగా రెవెన్యూ వ్యవస్థ మీద చాలా శాఖలు ఆధారపడి ఉన్నాయని తెలిపారు.

దీంతోపాటు ఆధునిక పరిజ్ఞానంతో భూముల రీ సర్వే చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారని వెల్లడించారు. దానికోసం 1,158 సర్వేయర్లను నియమించామన్నారు. మూడు గ్రామాలను ఒక యూనిట్‌గా ఏర్పాటు చేసి అధికారులు భూములు సర్వే చేయాలని ఆదేశించారు. రెవెన్యూ రికార్డులు సక్రమంగా లేకపోవడం వల్ల ఆ శాఖ అధికారులు చెడ్డపేరు తెచ్చుకున్నారని తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలోని ఆర్ఎస్ఆర్, అడంగళ్‌కు సుమారు 2,60,000 ఎకరాల వ్యత్యాసం ఉందని తెలిపారు. అందువల్ల భూములు రీ సర్వే చేసి రెవెన్యూ రికార్డులను సక్రమంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సూచించారు. గతంలో లాండ్ సీలింగ్ భూములను వెనక్కి తీసుకుని.. తిరిగి ఆ భూములనే దాని యాజమానికే మళ్ళీ లీజుకు ఇచ్చిన రిటైర్డు అధికారులు ఉన్నారని తెలిపారు. భూస్వాముల వద్ద ల్యాండ్ సీలింగ్, భూదానోద్యమ భూములు ఉండడానికి వీలులేదని పేర్కొన్నారు. అలాంటి భూములను వెనక్కి తీసుకుని పేదలకు ఉపయోగించాలని సుభాష్‌ చంద్రబోస్‌ అధికారులను ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top