కరోనా: అప్రమత్తతతో తప్పిన ముప్పు

Pilgrims Moved To Quarantine And Tested Positive West Godavari - Sakshi

సాక్షి, ఏలూరు: నాలుగు రోజులుగా కోవిడ్‌–19 కొత్త కేసులు నమోదు కాని జిల్లాలో శుక్రవారం ఒకేసారి 9 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరంతా పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్లివచ్చినవారే. ఈ యాత్రికులు జిల్లాలో అడుగు పెట్టగానే క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. దీంతో ఆసుపత్రికి తరలించారు. వీరు జిల్లాలో ఎవరినీ కలవకపోవడంతో పెనుముప్పు తప్పింది. వారు నేరుగా ఇళ్లకు వెళ్లి ఉంటే పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగేవి. అధికారులు అప్రమత్తంగా ఉండి వీరు ఉంటున్న ప్రాంతాలు కంటైన్‌మెంట్‌ జోన్లు కాకుండా కాపాడగలిగారు. గోపాలపురం, ఉండ్రాజవరం, కె.సావరం, తిమ్మరాజుపాలెం, చివటం, ఎస్‌.ముప్పవరం ప్రాంతాలకు చెందిన 10 మంది, తూర్పుగోదావరి జిల్లా పలివెలకు చెందిన ఓ మహిళ కలిసి మార్చి 17న పుణ్యాక్షేత్రాల సందర్శనకు వెళ్లారు.  లాక్‌డౌన్‌తో కాశీలో ఉండిపోయారు. (కరోనా: బెంగాల్‌లో అందుకే అధిక మరణాలు)

ఈ నెల 2న కాశీలో ఒక వ్యాన్‌ మాట్లాడుకుని స్వస్థలాలకు బయలుదేరారు. 4న కృష్ణా జిల్లా సరిహద్దులో వీరిని అడ్డుకుని 10 మందిని తాడేపల్లిగూడెం క్వారంటైన్‌కు, ఒకరిని తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరు క్వారంటైన్‌కు తరలించారు. జిల్లాకు చెందిన 10 మందితోపాటు వ్యాన్‌ డ్రైవర్‌నూ అనుమానంతో భీమడోలు మండలం పోలసానిపల్లి క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన డ్రైవర్‌తో పాటు తొమ్మిది మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇద్దరికి నెగిటివ్‌ వచ్చింది. వీరిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. పాజిటివ్‌ వచ్చిన వారిలో నిడదవోలు మండలానికి చెందిన వారు ఇద్దరు, ఉండ్రాజవరానికి చెందిన వారు ఐదుగురు, గోపాలపురం, ఎస్‌.ముప్పవరానికి చెందిన  ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 68కి చేరింది. కరోనా పాజిటివ్‌ వచ్చి చికిత్స తరువాత 33 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. తాజాగా నమోదు అయిన 9 కేసులతో కలిపి 36 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top