వీడలేమంటూ.. వీడుకోలంటూ..

People with Tears because of their bond on Prajasankalpayatra  - Sakshi

పాద యాత్ర ఆఖరి ఘట్టంలో ఆత్మీయుల కన్నీరు

ఏడాది బంధం వీడిపోతున్న బాధ 

జ్ఞాపకాలు పదిలం చేసుకునే ప్రయత్నం

ప్రజా సంకల్పయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఇంటికొచ్చిన చుట్టాన్ని వీడ్కోలు పలికే సమయంలో హృదయం బరువెక్కుతుంది.. కళ్ల వెంట నీళ్లు వస్తాయి.. అలాంటిది పద్నాలుగు నెలల బంధం విడిపోతుంటే ఆ హృదయ వేదనకు కొలమానం ఉంటుందా..? ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో కచ్చితంగా ఇలాంటి సన్నివేశాలే బుధవారం ఆవిష్కృతమయ్యాయి. ఏడాదికిపైగా జననేత వెంట ఉండి.. ప్రతీరోజూ ఆయన అడుగులో అడుగులేస్తూ, ప్రజా సంకల్పయాత్రలో ఏదో ఒక బాధ్యతను భుజానికెత్తుకున్న వాళ్లు అనేకమంది ఉన్నారు.

ఏ బాధ్యత లేకపోయినా అభిమాన నేతకు మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురానికి పాదయాత్ర చేసిన వాళ్లూ అనేకులున్నారు. ఉదయం నిద్ర లేచింది మొదలు, రాత్రి విశ్రమించే వరకూ వాళ్లకు వాళ్లే ఆత్మీయ బంధువులు. ఈ మహాయజ్ఞంలో తాము భాగస్వాములు కావాలన్నదే వారందరి ఏకైక ఆశయం. 14 నెలలుగా వైఎస్‌ జగన్‌ బస వద్దే వీళ్లంతా ఉన్నారు. నిత్యం ఉత్సాహంగా, ఉల్లాసంగా కన్పించే వీరిలో పాదయాత్ర ముగింపుతో ఎంతో మార్పు కనిపించింది. హావభావాల్లో తేడా.. మాటల్లో భావోద్వేగం.. స్వరం జీరబోవడం.. ఏదో కోల్పోతున్నామనే భావన వీరిలో స్పష్టంగా ప్రతిబింబించింది.

మళ్లీ ఎప్పుడు కలుస్తామో!
వైఎస్‌ జగన్‌ బసచేసే శిబిరం వద్ద బుధవారం ఉదయం నుంచే వీడ్కోలు కార్యక్రమం మొదలైంది. ‘ఇవ్వాళే ఆఖరు.. మళ్లీ మనం ఎప్పుడు కలుస్తామో’.. అంటూ ఒకరికొకరు ఆత్మీయంగా హత్తుకుని వీడ్కోలు చెప్పుకున్నారు. ఆఖరిసారిగా కలిసి అల్పాహారం చేయాలని ఒకరినొకరు స్వాగతించుకోవడంతో శిబిరం వద్ద ఉద్విగ్న సన్నివేశాన్ని తలపించింది. టెంట్‌ వేసే వారు కొందరు.. వాహనాలు తిప్పేవారు మరికొందరు.. పాదయాత్ర ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించే బాధ్యత మరికొందరిది.. ఎవరే పనిలో ఉన్నా రాత్రి అన్నదమ్ముల్లా ఒకేచోట కలిసి భోజనం చేయడం అలవాటుగా మారింది. ఊరికి సమీపంలో ఉండే టెంట్‌ వద్దే ఉదయం స్నానాలు చేస్తూ సరదాగా కబుర్లు చెప్పుకునేవారు. ఒక్కోసారి చిన్నచిన్న అభిప్రాయభేదాలు వచ్చినా అంతలోనే సర్దుకుపోయే వాళ్లమని తెలిపారు.

బహుమతులు.. కలిసి ఫొటోలు
జననేత రోప్‌ పార్టీలో ఉన్నవాళ్లు రోజంతా బిజీగానే ఉంటారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నాయకుడిని అంటిపెట్టుకుని ఉండాల్సిందే. వీరిలో ఏడాదిగా ఊరెళ్లని వారూ ఉన్నారు. చాలామంది అక్కడి వాతావరణానికే అలవాటుపడ్డారు. ఈ నేపథ్యంలో పాదయాత్ర ముగియడంతో ఇప్పటివరకూ కలిసి మెలిసి ఉన్న వారు దూరమవడాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్నారు. ‘అన్నా.. ఒక్క ఫొటో దిగుదాం. చూసుకున్నప్పుడల్లా గుర్తుండిపోవాలి’.. రోప్‌ పార్టీలోని ఓ వ్యక్తి తన సహచరులతో కన్నీటిపర్యంతమవుతూ అన్న మాటలివి. 

గుండె పగిలే ఏడుపొస్తోందన్నా..
పాదయాత్రలో ఏడాదికి పైగా పనిచేశా. ఈ కాలంలో ఎంతోమంది పరిచయమయ్యారు. కష్టాలు పంచుకున్నాం. ఇష్టాలు చెప్పుకున్నాం. యాత్రలో కలిసి పనిచేసిన మేం ఓ పెద్ద కుటుంబంలా ఉన్నాం. ఇలా వీడ్కోలు చెప్పుకునే రోజు వచ్చిందని తెలిసి కన్నీరు పెట్టనివారు లేరు. ఉదయం నుంచి నాకు ఎన్నిసార్లు బాధేసిందో. నాలో నేనే కన్నీళ్లు పెట్టుకున్నా.
– వై. లక్ష్మారెడ్డి (ఓఎస్డీ డ్రైవర్‌)

ఇంటికెళ్లాలంటే బాధేస్తోంది
ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకూ అన్నతో కలిసి పాదయాత్ర చేశా. వందల మంది నాకు ఆత్మీయులయ్యారు. సెలవుకు ఇంటికెళ్లినా మళ్లీ ఎప్పుడు టెంట్‌ దగ్గరకొస్తాననే నా ప్రాణం లాగేది. ఎన్ని కష్టాలున్నా అందరం పంచుకునే వాళ్లం. ఒకేచోట తినడం, ఒకేచోట పడుకోవడం. ఇంతకన్నా సమైక్యత ఎక్కడుంటుంది?    
– ప్రశాంత్‌

నిద్రలోనూ పాదయాత్ర ఆలోచనే
ఆరంభం నుంచి చివరివరకూ పాదయాత్ర వాహనాల నిర్వహణ బాధ్యత నాదే. రోజంతా చాలా బిజీగా ఉండేవాడ్ని. అంతా నా వాళ్లే.. నా ఇల్లే అన్న ఫీలింగ్‌ ఉండేది. నిద్రపోతున్నా పాదయాత్రలో వాహనాలెక్కడున్నాయి? ఏ డ్రైవర్‌ ఏం చేస్తున్నాడనే కలవరింతే ఉండేది. జగన్‌ అధికారంలోకి వస్తాడని జనం చెప్పుకుంటుంటే చాలా ఆనందం అనిపించేది.   
 – జనార్థన్‌

బాసటగా బాటసారులు!
జగన్‌తో కలసి ఏడాదికిపైగా యాత్రలో పాల్గొంటున్న  సైనికులు’

వారంతా అలుపెరగని యాత్రికుడితో కలసి సాగుతున్న సైన్యం.. ప్రజల కష్టాలను కళ్లారా చూస్తూ.. వేల కిలోమీటర్లు అధిగమిస్తూ.. శారీరక బాధను దిగమింగుకుంటూ జనం మోములో చిరునవ్వు కోసం పరితపిస్తున్న ప్రజాసంకల్ప సారథి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన యజ్ఞంలో తోడుగా నిలిచారు. ఎండా వానలకు వెరవకుండా ప్రకృతి పెట్టిన పరీక్షలో నెగ్గారు. పట్టుసడలని ఉక్కు సంకల్పంతో ప్రజల వద్దకు వచ్చిన జగన్‌కు ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు అండగా ఉన్నారు. నూనూగు మీసాల యువకుల నుంచి ఏడు పదులు దాటిన పెద్దలు, దివ్యాంగుల నుంచి కళాకారుల వరకు ఎందరో ప్రతిపక్ష నేత అడుగుల్లో అడుగులు వేస్తూ చరిత్రలో భాగస్వాములయ్యారు.

వైఎస్‌ జగన్‌ తమను పేరుపేరునా ప్రేమగా పిలిచి పలకరిస్తుంటే అది చాలని తృప్తిగా చెబుతారు. జగన్‌ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను డైరీలో నోట్‌ చేశామని, దీన్ని ఆయనకు కానుకగా అందచేయనున్నట్లు శ్రీకాకుళానికి చెందిన ఎన్ని శంకరరావు చెప్పారు. జగన్‌ను సీఎం చేసిన తర్వాతే ఇంటికి రావాలని తన భార్య చెప్పి పంపినట్లు కాంట్రాక్టు ఉద్యోగాన్ని సైతం వదులుకుని పాదయాత్రలో పాల్గొంటున్న అనంతపురం జిల్లా పుట్టపర్తికి చెందిన వి.శంకర్‌ తెలిపారు. తన తల్లి చనిపోతే జగన్‌ స్వయంగా ఫోన్‌ చేసి పరామర్శించారని గుంటూరుకు చెందిన వైఎస్సార్‌ సీపీ కార్యకర్త పురుషోత్తమ్‌ గుర్తు చేసుకున్నారు.

దాహార్తిని తీర్చిన మంచినీటి వ్యాన్‌
ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నవారి దాహార్తిని తీర్చిన ఘనత ఈ వ్యాన్‌ది. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు నిరంతరాయంగా నీటిని సరఫరా చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన బుల్లెట్‌ కృష్ణారెడ్డి ఈ మినీవాటర్‌ ట్యాంకర్‌ ఉన్న వ్యాన్‌ను సమకూర్చి మండు వేసవిలో సైతం చల్లటి నీటిని అందించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top