తలదాచుకునే తావేదీ!

People Suffering in Rehabilitation Centers East Godavari - Sakshi

కరెంటు, నీటి వసతి లేవు మరుగుదొడ్ల మాటే లేదు

పేరు రాయించుకున్న వారికే భోజనం

పాలు, రొట్టెలు లేక చంటిపిల్లల గగ్గోలు

ఇదేనా పునరావాసమని బాధితుల ఆవేదన

తూర్పుగోదావరి, పిఠాపురం/గొల్లప్రోలు: సుమారు 30 వేల మందికి పైగా తుపాను బాధితులు. అంతమందికి ఆరేసి తరగతి గదులున్న ఎనిమిది పాఠశాలలే పునరావాస కేంద్రాలు. పట్టుమని పదిమంది పడుకుందామన్నావీలు లేనంత ఇరుకుగా గదులు. కరెంటు లేదు. తాగునీరు లేదు. మరుగుదొడ్ల మాటే లేదు. గత్యంతరం లేక ఇటువంటి అవస్థల నడుమనే పెథాయ్‌ తుపాను బాధితులు ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని పునరావాస కేంద్రాల్లో తల దాచుకోవాల్సి వచ్చింది. తుపాను ముప్పు ముంచుకువస్తోందని, ఇళ్లు వదిలి పునరావాస కేంద్రాలకు తరలిరావాలని, అన్ని వసతులూ కల్పించామని అధికారులు హడావుడి చేశారే తప్ప.. వసతుల కల్పనలో పూర్తిగా విఫలమయ్యారని బాధితులు విమర్శిస్తున్నారు.

ఇవీ ఇబ్బందులు
తమ వద్ద పేర్లు నమోదు చేసుకున్న వారికే పునరావాస కేంద్రాల్లో అధికారులు భోజనం పెట్టారు. ఇది తమను అవమానించడమేనని పలువురు వాపోయారు.
పునరావాస కేంద్రాలు కేవలం భోజనాలు వండి పెట్టడానికే తప్ప వందల కుటుంబాలు తలదాచుకోడానికి, పిల్లాపాపలతో నిద్రించడానికి వీలు లేకుండా ఉన్నాయని పలువురు అన్నారు. భోజనం మాత్రమే పెడితే తమ సామగ్రిని ఇళ్ల వద్ద వదిలేసి పునరావాస కేంద్రాలకు ఎలా వస్తామని మత్స్యకారులు ప్రశ్నించారు.
ఆదివారం రాత్రే శిబిరానికి వచ్చినా పాలు, రొట్టెల వంటివి లేక చంటి పిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తల్లులు వాపోయారు. పునరావాస శిబిరాలను సందర్శించిన వైఎస్సార్‌ సీపీ పిఠాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ పెండెం దొరబాబు వద్ద పలువురు ఈ విషయమై ఆవేదన వ్యక్తం చేశారు.
అన్ని పునరావాస కేంద్రాల వద్ద భోజనాలు ఏర్పాటు చేయకుండా ఒకచోట వండించి బాధితులకు లెక్క ప్రకారం తెచ్చి పెడుతున్నారని, దీంతో గంటల తరబడి ఆకలితో అలమటించాల్సి వచ్చిందని బాధితులు వాపోతున్నారు.
మూలపేటలోని జిల్లా పరిషత్‌ పాఠశాలలో ఉదయం అల్పాహారం పూర్తిస్థాయిలో సరఫరా చేయలేదు. దీనిపై బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంటి పిల్లలకు పాలు లేవని మహిళలు మండిపడ్డారు. మధ్యాహ్నం రెండు గంటలయినా భోజనం పెట్టలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లు వదిలి కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వచ్చిన తమకు కనీసం దుప్పట్లు కూడా ఇవ్వలేదన్నారు. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా తెలపలేదని అధికారులపై గ్రామస్తులు మండిపడ్డారు.
వందల మందికి ఒకేచోట పునరావాసం ఏర్పాటు చేసినా మరుగుదొడ్లు, మంచినీరు, కరెంట్‌ వంటి వసతులు కల్పించలేదు. దీంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రెవెన్యూ అధికారులు అసలు పునరావాస కేంద్రాల వద్దకే రాలేదని మత్స్యకారులు ఆరోపించారు. కొత్తపల్లి జెడ్పీ హైస్కూలులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో కేవలం ఉపాధ్యాయులే పర్యవేక్షకులుగా ఉన్నారు. దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నామని బాధితులు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top