న్యాయమా.. నీవెక్కడా!

Pending Complaints Hikes In PSR Nellore - Sakshi

పేరుకుపోతున్న ఫిర్యాదులు

పట్టించుకోని కిందిస్థాయి  పోలీస్‌ సిబ్బంది

ఉన్నతాధికారులు మందలించినా మారని వైనం

నెల్లూరు మెక్లిన్స్‌రోడ్డుకు చెందిన సయ్యద్‌ జకావుల్లా 2016 సెప్టెంబర్‌లో దారుణ హత్యకు గురైయ్యాడు. ఆయన్ని అధికార పార్టీ నేతల అనుచరులు హత్యచేశారని, అలాగే నేతలు పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసును నీరుగారుస్తున్నారని హతుడి తండ్రి సయ్యద్‌ మహబూబ్‌బాషా పోలీసు ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. తన కుమారుడి హత్య కేసును నిస్పక్షపాతంగా విచారించి, నిందితులపై చర్యలు తీసుకోవాలని ఏడాదిన్నరగా గ్రీవెన్స్‌డేలో పోలీసు ఉన్నతాధికారులకు అర్జీలిచ్చారు.         అయినా ఇంతవరకూ న్యాయం జరగలేదు.

నెల్లూరు(క్రైమ్‌): ‘‘పోలీస్‌ స్టేషన్‌లలో న్యాయం జరగడం లేదు.. కాళ్లరిగేలా తిరుగుతున్నాం.. మీరైనా న్యాయం చేయండి సారూ’’ అంటూ ప్రతి సోమవారం పెద్ద సంఖ్యలో బాధితులు గ్రీవెన్స్‌డేలో పోలీసు ఉన్నతాధికారులను కలిసి తమగోడును వినిపిస్తున్నారు. వారి సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఉన్నతాధికారులు సంబం ధింత సిబ్బందిని ఆదేశించి ‘‘న్యాయం జరుగుతుంది, ఇక వెళ్లండి’’ అని పంపివేస్తున్నారు. అయితే క్షేత్రస్థాయిలో బాధితులకు న్యాయం మిధ్యగానే మారింది. ఉన్నతాధికారుల ఆదేశాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. జిల్లాలో గడచిన ఐదు నెలల్లో పోలీస్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 1461 ఫిర్యాదులు అందగా అందులో 1131 ఫిర్యాదులు పరిష్కారానికి నోచుకోలేదు.

కానరాని న్యాయం
జిల్లాలో సుమారు 35 లక్షల మంది జనాభా ఉండగా వారి రక్షణ కొరకు ఐదు సబ్‌డివిజన్‌ల పరిధిలో 22 సర్కిళ్లు, 64 పోలీస్‌ స్టేషన్లు ఉన్నాయి. దాదాపు 2500 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. కాగా పోలీస్‌ స్టేషన్లలో ప్రజలకు న్యాయం జరగడం లేదని గ్రహించి 2001లో అప్పటి ఎస్పీ కె.శ్రీనివాసులరెడ్డి పోలీస్‌ గ్రీవెన్స్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అప్పటి నుంచి ప్రతి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్‌డేకి పోలీస్‌ స్టేషన్లలో న్యాయం జరగని బాధితులు పెద్ద సంఖ్యలో వచ్చేవారు. వారి సమస్యలను విన్న పోలీసు ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారించి, సత్వరమే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని సిబ్బందిని ఆదేశించడం, వారు విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవడం జరిగేది.  అలాగే సమస్యల పరిష్కారంలో అలసత్వం వహించే సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేవి. దీంతో పెద్ద ఎత్తున బాధితులు గ్రీవెన్స్‌డేకి వచ్చేవారు. అయితే తర్వాత కొంతకాలం ఈ పక్రియకు బ్రేక్‌ పడింది. 2011 జూలైలో అప్పటి ఎస్పీ బి.వి.రమణకుమార్‌ గ్రీవెన్స్‌డేను కొనసాగించారు. అనంతరం సెంథిల్‌కుమార్‌ హయాంలోనూ గ్రీవెన్స్‌డేలో సమస్యలు చకచకా పరిష్కారమయ్యేవి. అయితే అనంతరం వచ్చిన ఎస్పీల ఉదాసీన వైఖరి కారణంగా సమస్యల పరిష్కారం ఆశించిన స్థాయిలో జరగలేదు. ఈ నేపథ్యంలో గతేడాది జూన్‌లో ఎస్పీగా పీహెచ్‌డీ రామకృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఆయన గ్రీవెన్స్‌డేని సోమవారమే కాకుండా గురువారం నిర్వహించడం ప్రారంభించారు. దీంతో బాధితుల తాకిడి పెరిగింది. జిల్లా నలుమూలల నుంచి దాదాపు 200 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని తమ సమస్యలను వినతుల రూపంలో సమర్పిస్తున్నారు. తొలిరోజుల్లో ఎస్పీపై ఉన్న భయంతో సిబ్బంది బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించేవారు. అయితే రానురాను పరిస్థితి అందుకు భిన్నంగా మారింది.

1131 ఫిర్యాదులు పెండింగ్‌
ఈ ఏడాది మే వరకు జిల్లా వ్యాప్తంగా 1461 ఫిర్యాదులు అందాయి. వాటిలో కేవలం 330 ఫిర్యాదులు మాత్రమే పరిష్కారమయ్యాయి. 1131 ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో   ప్రధానంగా భార్య, భర్తల గొడవలు, మహిళలు, చిన్నారులపై లైంగిక వేధింపులు, అదృశ్యం కేసులు, చీటింగ్‌ కేసులు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయి. వాటిని పరిశీలించిన ఎస్పీ రామకృష్ణ కేసును పూర్తిస్థాయిలో విచారించి న్యాయం చేయాలని కిందిస్థాయి సిబ్బందిని ఆదేశిస్తున్నారు. అయితే ఎస్పీ ఆదేశాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కిందిస్థాయి సిబ్బంది ఆ ఆదేశాలను లెక్కచేయకుండా బాధితులను స్టేషన్‌ల చుట్టూ తిప్పుకుంటున్నారు. కొందరు సిబ్బంది మరో అడుగు ముందుకేసి ఎస్పీ చెప్పినా ఏం చేసేది లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు స్టేషన్లలో రాజకీయ జోక్యం మితిమీరిపోయింది. అర్థ, అంగబలం ఉన్నవారికే న్యాయం జరుగుతోందన్న ఆరోపణలున్నాయి. 2018లో 1461 ఫిర్యాదులు అందగా 1131 ఫిర్యాదులు నేటికి పరిష్కారానికి నోచుకోలేదు.

కేసులన్నీ పరిష్కారమవుతున్నాయి
గ్రీవెన్స్‌డేకి వచ్చే ఫిర్యాదులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. అధికంగా సివిల్‌ వివాదాలు, దొంగతనం కేసుల్లో రికవరీకి సంబంధించిన ఫిర్యాదులు వస్తున్నాయి. దొంగతనాలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించి నేరస్థులను పట్టుకుని, సాధ్యమైనంత మేర సొత్తును రికవరీ చేస్తున్నాం. ఇక సివిల్‌ వివాదాల విషయంలో చట్టపరిధిలో ఉన్న అంశాలన్నింటినీ పరిశీలించి, అవసరమైన మేరకే చర్యలు తీసుకుంటున్నాం. – పీహెచ్‌డీ రామకృష్ణ, ఎస్పీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top