ఐటీడీఏ పరిధిలోని ఎయిడెడ్(ద్రవ్యసహాయక) పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది.
పార్వతీపురం, న్యూస్‌లైన్: ఐటీడీఏ పరిధిలోని ఎయిడెడ్(ద్రవ్యసహాయక) పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఐటీడీఏ పరిధిలోని అన్ని పాఠశాలలు, వసతిగృహ విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేస్తున్న ప్రభుత్వం ఎయిడెడ్ విద్యార్థులకు ఎందుకు పంపిణీ చేయడంలేదో అర్థం కావడంలేదు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు తరగతి గదుల్లో యూనిఫాం వేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం నిబంధన పెట్టింది. ఈ మేరకు ప్రభుత్వమే ఐటీడీఏ పరిధిలోగల అన్ని పాఠశాలలకు యూనిఫాంలు సరఫరా చేసింది. ఎయిడెడ్ పాఠశాలలకు మాత్రం సరఫరా చేయలేదు.
ఐటీడీఏ పరిధిలోని గుమ్మలక్ష్మీ పురం మండలంలో 11, కురుపాం మండలంలో 10, కొమరాడ మండలంలో 3 ఎయిడెడ్ పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్నవారంతా గిరిజన విద్యార్థులే. అయితే వీరికి మాత్రం యూనిఫాంలు పంపిణీ చేయకపోవడంతో..ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుకోవడమే తమ పిల్లల నేరమా? అంటూ ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలైన ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం వంటివి ఈ పాఠశాలల్లో అమలవుతున్నాయి కానీ యూనిఫాం లను పంపిణీ చేయకపోవడానికి కారణమేమిటో పాఠశాలల యాజమాన్యాలకు అర్థం కావడం లేదు. ఈ విషయంపై పలు గిరిజన సంఘాలు స్థానిక శాసనసభ్యులకు, ఐటీడీఏ పీఓకు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ ఫలితం కనిపించ లేదు. వందలాది మంది గిరిజన విద్యార్థులకు ఇలా అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండబోమని పలు గిరిజన ఉపాధ్యాయసంఘాలు, గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.