
అలా వచ్చి లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదు
అసలు..ఇంటెలిజెన్స్ అధికారులకు లా అండ్ ఆర్డర్‌తో పనేముంది?
వారు ఉన్నది కేవలం ప్రభుత్వానికి సమాచారం ఇవ్వడానికే.. బనియన్లు, డ్రాయర్లు, టీ షర్ట్‌లు వేసుకుని పోలీసులమంటే ఎలా?
సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడం ‘సుప్రీం’ తీర్పునకు విరుద్ధం.. నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డిపై అక్రమ కేసులో పోలీసుల తీరును ఆక్షేపించిన హైకోర్టు
కానిస్టేబుల్‌పై దాడి ఘటన వీడియో ఫుటేజీ, కేసు డైరీ సమర్పించాలని ఆదేశం
విచారణ సెప్టెంబర్ 8కి వాయిదా
సాక్షి, అమరావతి: పోలీసులు.. సివిల్ దుస్తుల్లో వచ్చి ఎలా విధులు నిర్వర్తిస్తారని హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అలా సివిల్ దుస్తుల్లో రావడానికి వీల్లేదని, అది నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పింది. పోలీసు యూనిఫాంలో కాకుండా సివిల్ దుస్తుల్లో వచ్చి అరెస్ట్ చేయడానికి వీల్లేదని, అది డీకే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని స్పష్టం చేసింది. సివిల్ దుస్తుల్లో వస్తే వారు పోలీసులని ఎలా తెలుస్తుందని ప్రశ్నించింది. సివిల్ దుస్తుల్లో వచ్చి తమ విధులను అడ్డుకున్నారంటే ఎలా కుదురుతుందని నిలదీసింది.
సివిల్ దుస్తుల్లో పోలీసులు లా అండ్ ఆర్డర్ విధులు నిర్వర్తిస్తామంటే కుదరదంది. ఇంటెలిజన్స్ అధికారులు సివిల్ దుస్తుల్లో ఉన్నప్పటికీ, వారి బాధ్యత శాంతి భద్రతల పరిరక్షణ కాదని, వారున్నది కేవలం ప్రభుత్వానికి సమాచారాన్ని చేరవేయడానికి మాత్రమేనని గుర్తు చేసింది. బనియన్‌లు, డ్రాయర్లు, టీ షర్టుల్లో వచ్చి తాము పోలీసులమంటే ప్రజలకు ఎలా తెలుస్తుందని వ్యాఖ్యానించింది. అసలు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించే ప్రివిలేజీలేవీ పోలీసులకు లేవంది. కనీసం సఫారీ దుస్తుల్లో ఉన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునంది.
ఎస్‌బీ (స్పెషల్ బ్రాంచ్) పోలీసులు కోవూరు మాజీ శాసనసభ్యుడు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వాహనం తనిఖీ సందర్భంగా జరిగిన తోపులాటకు సంబంధించిన వీడియో ఫుటేజీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశించింది. అంతేకాక ఈ కేసుకు సంబంధించి కేసు డైరీని కూడా తమ ముందుంచాలంది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
నాపై కేసు కొట్టేయండి...
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గత నెలలో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించిన సమయంలో వాహనాలను తనిఖీ చేస్తున్న తనపై కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ తదితరులు దాడి చేసి గాయపరిచారంటూ స్పెషల్ బ్రాంచ్ (ఎస్‌బీ) కానిస్టేబుల్ కరణం మాలకొండయ్య ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా దర్గామిట్ట పోలీసులు ప్రసన్నకుమార్‌రెడ్డి తదితరులపై అక్రమ కేసు నమోదు చేశారు. దాన్ని కొట్టేయాలని కోరుతూ ప్రసన్నకుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా విచారణ జరిపింది.
సివిల్ దుస్తుల్లో వచ్చి... ఏమైనా చేస్తామంటే ఎలా?
పిటిషనర్ తరఫున న్యాయవాది వి.రూపేష్ కుమార్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ప్రసన్నకుమార్‌రెడ్డి లేరని, ఆయన ఎవరినీ తోసివేయలేదని తెలిపారు. ఫోటోలను పరిశీలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ కోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన న్యాయమూర్తి.. సివిల్ దుస్తుల్లో విధుల్లో ఉన్న వారి గురించి ఆరా తీశారు. వారు పోలీసులని రూపేష్ చెప్పడంతో, న్యాయమూర్తి ఒకింత విస్మయం వ్యక్తం చేశారు. పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తించడం ఏమిటంటూ ప్రశ్నించారు. స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సివిల్ దుస్తుల్లో విధులు నిర్వర్తిస్తారన్న రాష్ట్ర పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) మెండ లక్ష్మీనారాయణ చెప్పారు.
అయితే న్యాయమూర్తి దీంతో విభేదించారు. పోలీసులు ఎప్పుడూ యూనిఫాంలోనే ఉండి విధులు నిర్వర్తించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. ఈ విషయంలో పోలీసు మాన్యువల్‌ను సైతం పరిశీలిస్తామని స్పష్టం చేశారు. సివిల్ దుస్తుల్లో వచ్చి ఏమైనా చేస్తామని అంటే ఎలా..? అని ప్రశ్నించారు. ఈ మొత్తం ఘటనలో ప్రసన్నకుమార్‌రెడ్డి పాత్ర కీలకమని, ఆయన ప్రోద్బలంతోనే కానిస్టేబుల్‌పై దాడి జరిగిందని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పేర్కొన్నారు. గాయపడిన కానిస్టేబుల్‌కి సర్జరీ కూడా జరిగిందన్నారు.

యూనిఫాంలో లేనప్పుడు పోలీసని గుర్తించడం ఎలా..?
అనంతరం న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... గాయపడ్డారని చెబుతున్న కానిస్టేబుల్ పోలీసు యూనిఫాంలో లేరని గుర్తు చేశారు. యూనిఫాంలో లేనప్పుడు పోలీసని గుర్తించడం ఎలా? అని ప్రశ్నించారు. యూనిఫాం ధరించి చట్ట ప్రకారం విధులు నిర్వర్తిస్తున్నప్పుడే ఆరోపణలకు బలం చేకూరుతుందన్నారు.
ఇంటెలిజన్స్, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు యూనిఫాం ఉండదని పీపీ చెప్పగా, అలా అయితే మరి వారు లా అండ్ ఆర్డర్ విధులు ఎలా నిర్వర్తిస్తారని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీ, కేసు డైరీని తమ ముందుంచాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను సెపె్టంబర్ 8కి వాయిదా వేశారు.