పద్మావతి మహిళా వైద్య కళాశాలకు..డీమ్డ్ వర్సిటీ హోదా! | Padmavati Women's Medical University status kalasalakudimd! | Sakshi
Sakshi News home page

పద్మావతి మహిళా వైద్య కళాశాలకు..డీమ్డ్ వర్సిటీ హోదా!

Aug 18 2014 4:09 AM | Updated on Sep 2 2017 12:01 PM

శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్) నేతృత్వంలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు డీమ్డ్ వర్సిటీ హోదా సాధించేం దుకు ఆ సంస్థ యాజమాన్యం ప్రణాళిక రచించింది.

  •      ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారానే సీట్ల భర్తీ!
  •      వచ్చే ఏడాది ప్రత్యేక సెట్ నిర్వహణకు సన్నాహాలు
  • సాక్షి ప్రతినిధి, తిరుపతి: శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్(స్విమ్స్) నేతృత్వంలోని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు డీమ్డ్ వర్సిటీ హోదా సాధించేం దుకు ఆ సంస్థ యాజమాన్యం ప్రణాళిక రచించింది. అనుబంధంగా నర్సింగ్, డెం టల్, పారా మెడికల్ కాలేజీలతోపాటు పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కసరత్తు చేస్తోంది. తద్వారా డీమ్డ్ వర్సిటీ హోదా పొంది.. అత్యుత్తమ వైద్య నిపుణులను అందించడానికి వ్యూహం రచించింది. వివరాల్లోకి వెళితే..
     
    స్విమ్స్ నేతృత్వంలో ఏర్పాటుచేస్తున్న పద్మావతి మహిళా వైద్య కళాశాలను ఈ ఏడాది నుంచే ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోం ది. ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 150 సీట్లను భర్తీ చేయాల ని నిర్ణయించింది. వచ్చే ఏడాది నుంచి ప్రత్యేక సెట్ ద్వారా సీట్లను భర్తీ చేయాలని భావిస్తోంది. ఆ క్రమంలో డీమ్డ్ వర్సిటీ హోదా పొందడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించే దిశగా యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది.

    బోధనాసుపత్రి, వైద్య కళాశాల, నర్సింగ్, డెంటల్, పారామెడికల్ కాలేజీలతో పాటూ వైద్యరంగంలో పరిశోధన కేంద్రాన్ని కూడా నెలకొల్పితేనే డీమ్డ్ వర్సిటీ హోదా పొందవచ్చు. స్విమ్స్‌కు సమీపంలో బీవీబీ ప్రాంతంలో భవనాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. గతేడాది స్విమ్స్‌ను తనిఖీ చేసిన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వైద్య కళాశాలకు అనుమతి ఇచ్చింది. ఈలోగా మెటర్నిటీ ఆస్పత్రికి రూ.వంద కోట్ల వ్యయంతో మూడు వందల పడకలతో నిర్మించిన భవనాన్ని పద్మావతి మహిళా వైద్య కళాశాలకు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.

    ఇది వివాదాస్పదంగా మారిన విషయం విదితమే. కానీ.. పద్మావతి మెడికల్ కాలేజీకి ఎంసీఐ అనుమతించిన సమయంలో మెటర్నిటీ భవనాన్ని స్విమ్స్ యాజమాన్యం చూపించలేదు. ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీ ప్రారంభానికి ఎలాంటి అవాంతరాలు ఉండవు. మెటర్నిటీ భవన వివాదాన్ని పరిష్కరించుకుని.. నర్సింగ్, డెంటల్, పారామెడికల్ కాలేజీలు, పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన భవనాలను నిర్మించేం దుకు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. వీటికి భూమి కేటాయింపునకు అవసరమైన ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు.

    ప్రభుత్వం భూమిని కేటాయించిన తక్షణమే యుద్ధప్రాతిపదికన నర్సింగ్, డెంటల్, పారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు అవసరమైన భవనాలను నిర్మించి.. సంబంధిత విభాగాల నుంచి కాలేజీల ప్రారంభానికి అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. 2015 విద్యా సంవత్సరం ప్రారంభానికి ఈ ప్రక్రియను పూర్తిచేసి.. డీమ్డ్ వర్సిటీ హోదా సాధించాలని భావిస్తున్నారు. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీలో ఈ ఏడాది ఎంసెట్ కౌన్సెలింగ్ ద్వారా 150 సీట్లను భర్తీ చేయనున్నారు.

    ఇందులో 15 శాతం సీట్లు ఎన్‌ఆర్‌ఐలకు కేటాయించనున్నారు. ఒక్కో సీటుకు 20 వేల అమెరికన్ డాలర్లు ఫీజుగా నిర్ణయించారు. మరో 15 శాతం ఇతర రాష్ట్రాల విద్యార్థులకు.. తక్కిన 70 శాతం సీట్లను మన రాష్ట్ర విద్యార్థులకు కేటాయించారు. వీరికి ఫీజు రూ.60 వేలుగా నిర్ణయించారు. వచ్చే ఏడాది డీమ్డ్ వర్సిటీ హోదా పొందాక ప్రత్యేక సెట్ నిర్వహించి.. పద్మావతి మహిళా మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, డెంటల్, పారా మెడికల్ సీట్లను భర్తీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement