జన్‌ధన్ ఖాతాపై డిపాజిట్ గన్! | Sakshi
Sakshi News home page

జన్‌ధన్ ఖాతాపై డిపాజిట్ గన్!

Published Sat, Jan 17 2015 3:20 AM

జన్‌ధన్ ఖాతాపై డిపాజిట్ గన్!

 శ్రీకాకుళం పాత బస్టాండ్: పొదుపును ప్రోత్సహించడం, పేదలకు బీమా సౌకర్యం కల్పించడం, భవిష్యత్తులో అన్ని రకాల సంక్షేమ ఫలాలను బ్యాంకు ఖాతాలకే జమ చేయాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కొన్ని బ్యాంకుల నిర్వాకం కారణంగా ఖాతాదారులకు దూరమయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.పేదలను దృష్టిలో పెట్టుకొని కనీస డిపాజిట్ కూడా అవసరం లేకుండా జీరో బ్యాలెన్స్‌తో జన్‌ధన్ ఖాతాలు తెరవాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే కొన్ని బ్యాంకులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(ఏపీజీవీబి) రూ.500 డిపాజిట్‌ను డిమాండ్ చేస్తోంది. ముందు డిపాజిట్ లేకుండా ఖాతా తెరిచినా.. కనీస డిపాజిట్ కట్టనిదే పాస్‌పుస్తకం ఇచ్చేది లేదని పలు శాఖల అధికారులు స్పష్టం చేస్తుండటంతో కొత్త ఖాతాదారులు ఇబ్బంది పడుతున్నారు.
 
 లక్ష్యానికి దూరంగా..
 అన్ని కుటుంబాలకు జన్‌ధన్ ఖాతా ఉండాలన్న ప్రభుత్వ లక్ష్యాన్ని ఇటువంటి కొన్ని లోపాల కారణంగా చేరుకోలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో 27 ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులకు చెందిన 263 శాఖలు ఉన్నాయి.  వీటన్నింటిలోనూ జన్‌ధన్ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే ఏపీజీవీబీ శాఖల్లో మాత్రమే రూ.500 కనీస డిపాజిట్ వసూలు చేస్తున్నారని ఆ బ్యాంకులో ఖాతాలు తెరిచిన పలువురు ఆరోపిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా ఏపీజీవీబీ శాఖలే ఉన్నాయి. బిజినెస్ ప్రొవైడర్ల ద్వారా ఈ శాఖల పరిధిలోని గ్రామాల్లో వేల సంఖ్యలో కొత్త ఖాతాలు తెరిపించారు. ఖాతాలు తెరిచిన వారు ఆయా శాఖలకు వెళ్లి పాస్‌పుస్తకాలు అడిగితే కనీస డిపాజిట్ కట్టాలని, అప్పుడే పాస్ పుస్తకం ఇస్తామని బ్యాంకు ఆధికారులు స్పష్టం చేస్తున్నారని ఖాతాదారులు వాపోతున్నారు.
 
  2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 8.83 లక్షల కుటుంబాలు ఉన్నాయి. వీటన్నింటికీ ఖాతాలు తెరవాలన్నది లక్ష్యంగా ఇప్పటివరకు సుమారు 4 ల క్షల ఖాతాలు ఉన్నాయి. కాగా గత నవంబర్‌లో ప్రారంభమైన జన్‌ధన్ పథకం కింద 2.30 లక్షల ఖాతాలు తెరిచారు. కనీస బ్యాలెన్స్ పేరుతో ఏపీజీవీబీ ఒత్తిడి చేస్తుండటంతో కొత్తవారు ఖాతాలు తెరిచేందుకు ముందురాని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామిరెడ్డి వద్ద ప్రస్తావించగా జన్‌ధన్ ఖాతాలకు కనీస డిపాజిట్ అవసరం లేదని  స్పష్టం చేశారు. ఇలా వసూలు చేస్తున్న బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి ఈ సమస్య లేకుండా చేస్తానని చెప్పారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement