పౌర్ణమి రోజున...సాగర తీరాన.. | On the day of the full moon ... Sea coast .. | Sakshi
Sakshi News home page

పౌర్ణమి రోజున...సాగర తీరాన..

Feb 13 2014 1:21 AM | Updated on Oct 9 2018 7:52 PM

పౌర్ణమి రోజున...సాగర తీరాన.. - Sakshi

పౌర్ణమి రోజున...సాగర తీరాన..

పూడిమడక తీరంలో గురువారం రాత్రి జాతర, శుక్రవారం ఉదయాన్నే మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకు గ్రామకమిటీ ఏర్పాట్లు చేస్తోంది.

  • మాఘ పౌర్ణమి జాతర నేడు..
  •  విసృ్తత ఏర్పాట్లు..
  •  సాగర తీరానికి శోభ
  •  అచ్యుతాపురం,న్యూస్‌లైన్ : పూడిమడక తీరంలో గురువారం రాత్రి జాతర, శుక్రవారం ఉదయాన్నే మాఘపౌర్ణమి పుణ్యస్నానాలకు గ్రామకమిటీ ఏర్పాట్లు చేస్తోం ది. వేలల్లో వచ్చే భక్తుల కోసం తీరాన్ని ఖాళీచేశారు. పడవల్ని సముద్రంలో లంగరువేసారు.
     
    మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు
     తీరం వద్ద మహిళలు దుస్తులు మార్చుకోవడానికి తెరచాపలతో తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. భద్రత కోసం మహిళా పోలీసులను నియమిం చారు. దీంతోబాటు వైద్య సేవలూ అందుబాటులో ఉంచారు. పంచాయతీ కార్యాలయంలో పోలీసు కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు.
     
    గజ ఈతగాళ్లు సిద్ధం... గ్రామనాయకుడు మేరుగు బాపునాయుడు 30 మంది గజ ఈతగాళ్లను ఏర్పాటుచేశారు. వీరు స్నానాలు జరుగుతున్నంతసేపు ప్రత్యేక బ్యాడ్జిలను ధరించి పరిస్థితిని  గమనిస్తారు. అత్యవసర సమయంలో సేవలందిస్తారు.
     
    ప్రయాణంలో సూచనలు... దూరప్రాంతాల నుంచి వచ్చేవారు స్వంత వాహనాల్లోగానీ, ఆర్టీసీ బస్సుల్లోగానీ రావాలి.  ఆటోలను ప్రైవేటు వాహనాలను అచ్యుతాపురం వద్ద నిలిపివేస్తారు. పూడిమడక హైస్కూల్ వద్ద వాహనాలను పార్కింగ్‌చేసి తీరానికి నడిచి చేరుకోవాలి. స్నానానంతరం జగన్నాథస్వామి ఆలయంలో పూజలు చేయించుకోవచ్చు. లైట్‌హౌస్ ఎక్కి సముద్రాన్ని చూడడం ఎప్పటికీ మచ్చిపోలే నిది. ఆలస్యం ఎందుకు పూడిమడక పుణ్యస్నానాలకి పోదాం పదండి.  
     
    వాడపాలెంలో...
     
    రాంబిల్లి : మాఘ పౌర్ణమి జాతరకు రాంబిల్లి శివారు వాడపాలెం సముద్ర తీరం ముస్తాబైంది. గురువారం రాత్రి నుంచి ఇక్కడ జాతర ప్రారంభమవుతుంది. తీరంలో పుణ్య స్నానాలు అనంతరం గంగమ్మ తల్లికి పూజలు చేస్తారు. ఏట ఇక్కడ జరిగే మాఘ పౌర్ణమి జాతరకు వేలాది మంది ప్రజలు తరలివస్తారు. తీరానికి వెళ్లే రోడ్డు ఇరువైపులా పెరిగిన తుప్పలను మదర్ థెరిసా సేవా సంఘం సభ్యులు శ్రమదానంతో తొలగించారు. చెత్త చెదారాన్ని తీసేసి పరిశుభ్రంగా తీర్చిదిద్దారు. ఎస్‌ఐ  కృష్ణారావు ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తు నిర్వహించనున్నారు.
     
     రేవుపోలవరంలో ఏర్పాట్లు పరిశీలన


     ఎస్.రాయవరం : రేవుపోలవరం తీరంలో మాఘపౌర్ణమి జాతర ఏర్పాట్లను ఈవోపీఆర్‌డీ కె.చంద్రశేఖరరావు బుధవారం పరిశీలించారు. స్థానిక సర్పంచ్ చోడిపిల్లి బంగారి, పంచాయతీ కార్యదర్శి బీఏబీఎల్ మూర్తితో చర్చించారు. మహిళల స్నానాలకు ప్రత్యేకంగా గదులు, తాత్కాలిక మరుగు దొడ్లు నిర్మించాలని సూచించారు.


     చక్రతీర్థం ప్రాగంణం పరిసరాలు పరిశుభ్ర చేయించాలన్నారు. స్వచ్ఛందంగా సేవలందించేందుకు ముందుకొచ్చిన సాయి భక్తులకు సహకారం అందించి జాతర విజయవంతం చేయాలన్నారు. తీరంలోని ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్టు ఎస్‌ఐ జి. బాలకృష్ట తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ ఈవో బ్రహ్మ,సుబ్బారావు,ఆర్‌డబ్ల్యూ ఎస్ జేఈ రాజు,మండల ఇంజినీరు సుధాకర్ పాల్గొన్నారు.
     
     ముస్తాబవుతున్న ముత్యాలమ్మపాలెం


     ముత్యాలమ్మపాలెం(పరవాడ) : మాఘ పౌర్ణమి సందర్భంగా ముత్యాలమ్మపాలెం తీరంశోభాయమానంగా తయారైంది. గురువారం సాయంత్రం నుంచే భక్తులు సముద్ర తీరానికి చేరుకొని రాత్రంతా జాగరణ చేస్తారు. శుక్రవారం సూర్యోదయాన సముద్ర స్నానం చేసి మాధవ స్వామిని దర్శించుకుంటారు. జాగరణ చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టు ఆలయ నిర్వాహకులు వాసుపల్లి సోమశేఖర్ తెలిపారు. తీరంలో పుణ్య స్నానాలు ఆచరించే మహిళలు దుస్తులు మార్చుకునేందుకు వీలుగా తాత్కాలిక గదులను ఏర్పాటు చేస్తున్నారు.
     

    పోలీస్ గస్తీ... జాతరను పురస్కరించుకొని సముద్ర తీరంలో ప్రత్యేక పోలీస్ గస్తీ ఏర్పాటు చేస్తున్నామని పరవాడ సీఐ పి.రమణ తెలిపారు. భక్తులు పోలీసులకు సహకరించాలని కోరారు. తీరంలో ప్రమాద హెచ్చరికలు ఉన్న ప్రదేశాల్లో స్నానాలకు దిగవద్దని హెచ్చరించారు.  భారీ వాహనాలను ముత్యాలమ్మపాలెం కూడలిలో నిలిపివేస్తున్నట్టు చెప్పారు.
     
     మాఘపూర్ణిమకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు


     విశాఖపట్నం : మాఘపూర్ణిమ సందర్భంగా ఈనెల 14న జిల్లాలోని తీర ప్రాంతాల్లో  క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ఆర్టీసీ విశాఖ రీజనల్ మేనేజర్ వై. జగదీష్‌బాబు తెలిపారు. పూడిమడక, రేవుపోలవరం తీరాల్లో సముద్రతీర స్నానాలను ఆచరించడానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు  13 అర్థరాత్రి నుంచి 14 సాయంత్రం వరకు స్పెషల్ సర్వీసులు నడుస్తాయని తెలిపారు. పూడిమడక జాతరకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం అనకాపల్లి, కొండకర్ల, అచ్చుతాపురం నుండి  60 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రేవు పోలవరం జాతరకు వెళ్లే వారికి నర్సీపట్నం, అడ్డురోడ్, యలమంచిలి నుండి 60 ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement