ఆ ముగ్గురిలో ఎవరు ?

Officers Meeting With Channdrababu Naidu For CP Post - Sakshi

చివరి అంకానికి చేరిన సీపీ నియామక ప్రక్రియ

సీఎంతో భేటీ అయిన ద్వారాకా, నళినీప్రభాత్, అమిత్‌

ఉత్తరభారత అధికారికే అవకాశాలు మెండు

విజయవాడ నగర కొత్త పోలీస్‌ కమిషనర్‌ ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. రేసులో ఉన్న ముగ్గురు అధికారులను సీఎం చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. శాంతి భద్రతలు, రాజధాని ప్రాముఖ్యత, రాజకీయ పరిస్థితులు, ఎన్నికలు తదితర అంశాలపై సీఎం తన ఉద్దేశాన్ని వారికి పరోక్షంగా చెప్పినట్లు తెలిసింది. ఒకటి రెండు రోజుల్లోనే సీపీని నియమిస్తారని పోలీసువర్గాలు చెబుతున్నాయి.  

సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ (సీపీ) పోస్టు ఆశావాహుల్లో ముగ్గురు అధికారులను సీఎం చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయవర్గాల సమాచారంమేరకు....సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమల రావు, ఇంటిలిజెన్స్‌ అదనపు డీజీ నళినీప్రభాత్, అమిత్‌గార్గ్‌లు సీఎం చంద్రబాబుతో శనివారం విడివిడిగా భేటీ అయ్యారు. సీఎం పిలుపు మేరకే వీరు ఆయనతో సమావేశమయ్యారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పోలీసు అధికారుల నియామకంలో చంద్రబాబు  ఓ కొత్త విధానానికి తెరతీశారు. ఎస్పీ, కమిషనర్‌ స్థాయి అధికారులను నియమించే ముందు ఆయనే నేరుగా వారిని పిలిపించి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ఇంతకుముందు ఇలాంటి సంప్రదాయం లేదు. అదే రీతిలో ముగ్గురు అధికారులతో చంద్రబాబు మాట్లాడారు.

సీఎం అభీష్టం మేరకే...
డీజీపీ ఎస్పీ ఠాకూర్‌ కూడా సీఎం చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించకుంది. ద్వారకా తిరుమలరావు, నళినీప్రభాత్, అమిత్‌గార్గ్‌లతో మాట్లాడిన తరువాత డీజీపీ ఠాకూర్‌ను సీఎం పిలిపించి మాట్లాడారు. విజయవాడ సీపీ ఎంపిక మీద డీజీపీ అభిప్రాయం తెలుసుకునేందుకే ఆయన్ని పిలిపించారని సమాచారం. సీపీ నియామకం పూర్తిగా సీఎం అభీష్టం మేరకే జరుగుతుంది. డీజీపీ ఠాకూర్‌ అభిప్రాయాన్ని తెలుసుకోవడం కేవలం సంప్రదాయం మాత్రమే.

ఆసక్తికరంగా సీపీ ఎంపిక....
తాజా పరిణామాల నేపథ్యంలో ద్వారకా తిరుమల రావు, నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌లతో ఒకరిని సీపీగా ఎంపిక చేయడం ఖాయంగా కనిపిస్తోంది. అగ్రిగోల్డ్‌ కేసు దర్యాప్తు కొనసాగుతున్నందున సీఐడీ అదనపు డీజీ ద్వారకా తిరుమలరావును సీపీగా నియమిస్తారా అన్నది మీమాంశగా మారింది. మరో వైపు ఉత్తర భారతానికి చెందిన అధికారినే సీపీగా నియమించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వారు అయితేనే స్థానిక అంశాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తారన్నది ఆయన ఉద్దేశం.  అదే భావనతో మూడేళ్ల కిందట గౌతం సవాంగ్‌ను విజయవాడ సీపీగా నియమించారు. ప్రస్తుతం కూడా అదే విధానాన్ని అనుసరించాలని నిర్ణయించారని సమాచారం. అదే జరిగితే నళినీ ప్రభాత్, అమిత్‌గార్గ్‌లలో ఒకరికి అవకాశాలు మెరుగుపడతాయి. అమిత్‌గార్గ్‌ 2015 నుంచి 16 వరకు విశాఖపట్నం సీపీగా పని చేశారు. ఆయన పట్ల సీఎం చంద్రబాబు సానుకూలంగానే ఉన్నారు. మరోవైపు నళినీ ప్రభాత్‌ చాలా ఏళ్లుగా సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా ముద్ర పడ్డారు.  ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఒకటి రెండు రోజుల్లో సీపీ నియామకంపై అధికారిక ఉత్తర్వులు వెలువడతాయని తెలుస్తోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top