
కడుపు కోత
పాఠశాలకు సెలవైనా మాస్టారు పెట్టిన ట్యూషన్‌కు ఠంఛనుగా హాజరయ్యారు. అది పూర్తయ్యాక కాస్తంత ఆటవిడుపుగా ఉంటుందని బీచ్‌కు వెళ్లారు. మృత్యువు హస్తాలు చాచినట్టుగా
చింతలమోరి (మలికిపురం) :పాఠశాలకు సెలవైనా మాస్టారు పెట్టిన ట్యూషన్‌కు ఠంఛనుగా హాజరయ్యారు. అది పూర్తయ్యాక కాస్తంత ఆటవిడుపుగా ఉంటుందని బీచ్‌కు వెళ్లారు. మృత్యువు హస్తాలు చాచినట్టుగా ముందుకొస్తున్న సముద్రం కెరటాలను పట్టించుకోని ఆ చిన్నారులు స్నానానికి దిగి.. ప్రాణాపాయంలో చిక్కుకున్నారు. నలుగురు క్షేమంగా తిరిగిరాగా.. ముగ్గురు మాత్రం వారి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు.చింతలమోరి బీచ్ వద్ద శనివారం సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు విద్యార్థులు మరణించిన సంఘటన తీవ్ర విషాదం మిగిల్చింది. సముద్ర స్నానానికి మొత్తం ఏడుగురు విద్యార్థులు వెళ్లగా, వీరిలో ముగ్గురు మరణించారు. అందరూ చింతలమోరికి చెందిన వారే.
స్థానిక ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. పాఠశాలకు రెండో శనివారం సెలవు కావడంతో ఉదయం పది గంటలకు పాఠశాలలో ఉపాధ్యాయులు నిర్వహించిన ట్యూషన్‌కు వెళ్లారు. మధ్యాహ్నం 12 తర్వాత వీరంతా కలిసి బీచ్‌కు వెళ్లారు. సముద్రంలో స్నానానికి వెళ్లిన వీరు కత్తి రోడ్ల (కెరటాల ఉధృతికి ఏర్పడిన కోత ప్రదేశం)లో పడ్డారు. అక్కడే పార్టీ చేసుకుంటున్న కొందరు వ్యక్తులు వీరిని గమనించారు. ముగ్గురిని కాపడగా, మరో ముగ్గురు సముద్రంలో గల్లంతై చనిపోయారు. మరొకరు ఈదుకుంటూ తీరానికి చేరుకున్నాడు. మరణించిన వారిలో చెవ్వాకుల ప్రసన్న కుమార్(14), చెవ్వాకులు ప్రభునతానియేల్(14), రాపాక వంశీ (14) ఉన్నారు. తొమ్మిదో తగరతి విద్యార్థులు రాపాక అనిల్, రాపాక భాను, గోనమండ సురేంద్ర, ఏడో తరగతి విద్యార్థి రాపాక అనిల్ ప్రాణాలతో బయటపడ్డారు.
అన్నదమ్ముల బిడ్డలు
ప్రమాదంలో మరణించిన ప్రసన్నకుమార్, నతానియేల్ ఒకే అన్నదమ్ముల కుమారులు. ప్రసన్న కుమార్ తల్లిదండ్రులు ప్రసాద బాబు, మెర్సీ, నతానియేల్ తల్లిదండ్రులు ప్రభుకుమార్ సుజాత ఉపాధి కోసం ఇజ్రాయిల్ దేశంలో ఉంటున్నారు. గ్రామంలోని తాత ప్రభుదాసు వద్దే ఉంటూ పిల్లలు చదువుకుంటున్నారు. ప్రసాద్‌బాబుకు ఇద్దరు కుమారుల్లో పెద్దవాడు ప్రసన్న కుమార్ మరణించాడు. ప్రభుకుమార్ ఇద్దరు కుమారుల్లో చిన్నవాడు నతానియేల్ చనిపోయాడు.
మనవల మృతితో తల్లడిల్లిన తాతయ్య
తన మనవలు ప్రసన్నకుమార్, నతానియేల్ మరణించడంతో తాత ప్రభుదాసు విలవిల్లాడాడు. ఈ సంఘటనను జీర్ణించుకోలేక రోదిస్తున్న ప్రభుదాసును చూసి స్థానికులు కంటతడి పెట్టుకున్నారు. సముద్రం వద్ద మనవల మృతదేహాలను ఒళ్లో పెట్టుకుని ప్రభుదాసు రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.
తల్లిదండ్రులకు సమాచారం
ఇజ్రాయిల్‌లో ఉంటున్న ప్రసన్నకుమార్, నతానియేల్ తల్లిదండ్రులకు బంధువుల సమాచారం అందించారు. వారు స్వదేశానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా రు. మృతదేహాలను ఫ్రీజింగ్ బాక్సుల్లో ఉంచుతున్నారు.
ఒక్కగానొక్క కొడుకు
చింతమోరికి చెందిన రాపాక ఉత్తమ్‌కుమార్, కుమారి అందరితోమంచిగా ఉంటూ తమ కుమార్తెతో పాటు ఏకైక కుమారుడు వంశీని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తండ్రి దింపు తీస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మధ్యాహ్నం 12 గంటల తర్వాత భోజనం చేసి వెళ్లిన వంశీ.. శవమై రావడంతో తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. రాజోలు సీఐ మధుసూదనరావు ఆధ్వర్యంలో ఎస్సై సాదిక్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ప్రాణాపాయం నుంచి బయటపడిన విద్యార్థుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
ప్రముఖుల పరామర్శ
రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు, సర్పంచ్ కారుపల్లి విజయమోహన్, ఎంపీటీసీ రాపాక యోహాన్ లక్ష్మీ కుమారి, గెడ్డం తులసీ భాస్కరరావు తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు. వైఎస్సార్ సీపీ రాజోలు కోఆర్డినేటర్ బొంతు రాజేశ్వరరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.