రెండో రోజు స్లిప్పులతో చిక్కిన ముగ్గురు

Nursing exam in Nursing exam

కాకినాడ వైద్యం: కాకినాడ రంగరాయ మెడికల్‌ కళాశాలలో జరుగుతున్న నర్సింగ్‌ రెండో సంవత్సరం పరీక్షల్లో శుక్రవారం స్లిప్పులతో కాపీ రాస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడ్డారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగుతోందని ఆరోపణలు రావడం, తొలిరోజు పదిమంది విద్యార్థులు స్లిప్పులతో రాస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రెండు ప్రైవేట్‌ కాలేజీలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు రాస్తూ పట్టుబడ్డారు. జీఎన్‌ఎం నర్సింగ్‌ రెండో ఏడాది పరీక్షలకు 1,143 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 125 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.

 ‘చూసుకో..రాసుకో’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎం.రాఘవేంద్రరావు పరీక్షా కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. చూసి రాతకు పాల్పడితే తర్వాత పరీక్షలు రాయకుండా డిబార్‌ చేస్తామని, మాస్‌ కాపీయింగ్‌కు సహకరించినట్టు తేలితే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఎన్‌ఎం నర్సింగ్‌ పరీక్ష ప్రారంభమైన తర్వాత సుమారు రెండు గంటల పాటు ఆయన పరీక్షా కేంద్రంలో తనిఖీలు చేశారు.  

ఇన్విజిలేటర్లపై ఒత్తిడి తెస్తున్న గుమస్తా
జీఎన్‌ఎం పరీక్షలు రాస్తున్న విద్యార్థులను చూసీచూడనట్లు వ్యవహరించాలని జీజీహెచ్‌లో నర్సింగ్‌ విభాగం చూస్తున్న గుమస్తా తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లిప్పులు రాస్తున్నా పట్టించుకోవద్దని, తాను పరిపాలనాధికారులతో చెప్పి మేనేజ్‌ చేస్తానంటూ చెబుతున్నాడన్నారు.  పరీక్షల్లో ఉదారంగా వ్యవహరిస్తే అధికారులు ఊరుకోనంటున్నారని వాపోయారు.

 ఏళ్లతరబడి ఒకే సీటులో నర్సింగ్‌ స్కూళ్లు చూసే సీటులో పాతుకుపోయి, నర్సింగ్‌ పాఠశాలల నిర్వాహకుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని తమను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. నర్సింగ్‌ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శంగా జరగాలంటే ఆ గుమస్తాని పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టర్‌ను ఇన్విజిలేటర్లు కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top