breaking news
Nursing exam
-
రెండో రోజు స్లిప్పులతో చిక్కిన ముగ్గురు
కాకినాడ వైద్యం: కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో జరుగుతున్న నర్సింగ్ రెండో సంవత్సరం పరీక్షల్లో శుక్రవారం స్లిప్పులతో కాపీ రాస్తూ ముగ్గురు విద్యార్థులు పట్టుబడ్డారు. మాస్ కాపీయింగ్ జరుగుతోందని ఆరోపణలు రావడం, తొలిరోజు పదిమంది విద్యార్థులు స్లిప్పులతో రాస్తూ పట్టుబడిన సంగతి తెలిసిందే. రెండో రోజు కూడా రెండు ప్రైవేట్ కాలేజీలకు చెందిన ముగ్గురు విద్యార్థులు స్లిప్పులు రాస్తూ పట్టుబడ్డారు. జీఎన్ఎం నర్సింగ్ రెండో ఏడాది పరీక్షలకు 1,143 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 125 మంది గైర్హాజరయ్యారు. మిగిలిన అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ‘చూసుకో..రాసుకో’ అనే శీర్షికన సాక్షిలో ప్రచురితమైన కథనానికి స్పందించిన కాకినాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాఘవేంద్రరావు పరీక్షా కేంద్రాలను శుక్రవారం తనిఖీ చేశారు. చూసి రాతకు పాల్పడితే తర్వాత పరీక్షలు రాయకుండా డిబార్ చేస్తామని, మాస్ కాపీయింగ్‌కు సహకరించినట్టు తేలితే ఇన్విజిలేటర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఎన్ఎం నర్సింగ్ పరీక్ష ప్రారంభమైన తర్వాత సుమారు రెండు గంటల పాటు ఆయన పరీక్షా కేంద్రంలో తనిఖీలు చేశారు. ఇన్విజిలేటర్లపై ఒత్తిడి తెస్తున్న గుమస్తా జీఎన్ఎం పరీక్షలు రాస్తున్న విద్యార్థులను చూసీచూడనట్లు వ్యవహరించాలని జీజీహెచ్‌లో నర్సింగ్ విభాగం చూస్తున్న గుమస్తా తమపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్లిప్పులు రాస్తున్నా పట్టించుకోవద్దని, తాను పరిపాలనాధికారులతో చెప్పి మేనేజ్ చేస్తానంటూ చెబుతున్నాడన్నారు. పరీక్షల్లో ఉదారంగా వ్యవహరిస్తే అధికారులు ఊరుకోనంటున్నారని వాపోయారు. ఏళ్లతరబడి ఒకే సీటులో నర్సింగ్ స్కూళ్లు చూసే సీటులో పాతుకుపోయి, నర్సింగ్ పాఠశాలల నిర్వాహకుల నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని తమను ఇబ్బందులకు గురిచేయడం ఎంత వరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. నర్సింగ్ పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శంగా జరగాలంటే ఆ గుమస్తాని పరీక్షల నిర్వహణ బాధ్యతల నుంచి తప్పించాలని కలెక్టర్‌ను ఇన్విజిలేటర్లు కోరుతున్నారు. -
నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ ?
ఆరోపణలపై విచారణకు ఆదేశించిన డీఎంఈ ఒంగోలు సెంట్రల్: రిమ్స్‌లో నిర్వహిస్తున్న నర్సింగ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జిల్లాలోని అన్ని జీఎన్ఎం కళాశాలల్లో విద్యనభ్యసిస్తున్న నర్సింగ్ విద్యార్థులకు ఈ నెల 28 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకూ నర్సింగ్ పరీక్షలను రిమ్స్‌లోని వైద్య కళాశాలలో నిర్వహిస్తున్నారు. అయితే రిమ్స్‌లో నర్సింగ్ పరీక్షల కోసం ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి రూపాయల వరకూ వసూలు చేసిన నర్సింగ్ కళాశాలల యాజమాన్యాలు, వీటిని రిమ్స్ నర్సింగ్ పరీక్షలు నిర్వహించే అధికారులకు అందజేసిన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వైద్యకళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ పరీక్షల సూపరింటెండెంట్‌గా ఉండటంతో కాపీయింగ్‌కు పెద్దగా అవకాశం ఉండేది కాదు. ప్రస్తుతం ఆయన రాజీనామా చేయడంతో అధికారులు పని సులువైంది. మొదటి సంవత్సరం నర్సింగ్ విద్యార్థులు 600 మంది, రెండో సంవత్సరం 383 మంది, మూడో సంవత్సరం విద్యార్థులు 370 మంది ప్రస్తుతం పరీక్షలకు హాజరవుతున్నారు. మొత్తం 1353 మంది రిమ్స్‌లో శుక్రవారం నుంచి పరీక్షలు రాస్తున్నారు. వీరి నుంచి పెద్ద మొత్తంలో కళాశాలల యాజమాన్యాలు వసూలు చేసి రిమ్స్ పరీక్షల అధికారులకు అందించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం నర్సింగ్ రెండో సంవత్సరం విద్యార్థులు పరీక్షలు రాస్తున్న సమయంలో రిమ్స్ డైరక్టర్ డాక్టర్ అంజయ్య తనిఖీలకు రావడంతో విద్యార్థులు పెద్ద ఎత్తున తమ వద్ద ఉన్న కాపీలను చెత్త బుట్టలు, పక్కన ఉన్న బ్లాకుల్లో పడేశారు. తనిఖీ అనంతరం విద్యార్థులు యథావిధిగా కాపీలు కొట్టినట్లు సమాచారం. అయితే నర్సింగ్ పరీక్షల అధికారిగా ఉన్న కేసీటీ నాయక్ ఈ ఆరోపణలపై స్పందిస్తూ బుట్టల్లో ఉన్న కాపీలో ప్రస్తుతం జరుగుతున్న నర్సింగ్ పరీక్షలవి కావని, గత వారం పరీక్షలు జరిగిన ఏఎన్ఎం విద్యార్థులవని తెలిపారు. ప్రస్తుత విద్యార్థులు కాపీయింగ్‌కు పాల్పడటం లేదని, విద్యార్థుల వద్ద నుంచి ఎటువంటి నగదు వసూలు చేయలేదని చెప్పారు. ఇప్పటికే ఈ వివాదం హైదరాబాద్ వరకూ వెళ్లింది. దీనిపై మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ డాక్టర్ శాంతారావు, రిమ్స్ డైరక్టర్ అంజయ్యను ప్రశ్నించినట్లు సమాచారం. విజయవాడ సిద్దార్ధ వైద్య కళాశాల సూపరింటెండెంట్ డాక్టర్ సూర్యకుమారిని విచారణాధికారిగా నియమించారు. ఆమె శనివారం ఒంగోలు వచ్చి ఈ మాస్ కాపీయింగ్‌పై విచారణ జరిపారు.