కరోనా ఎఫెక్ట్‌; అమ్మో చికెన్‌.. మాకొద్దు

Non Veg Sales Down In Srikakulam Due To Coronavirus - Sakshi

60 శాతానికి పైగా పడిపోయిన చికెన్‌ అమ్మకాలు

గుడ్డు తినేందుకు వెనుకంజ వేస్తున్న మాంసాహారులు

వేట మాంసానిదీ ఇదే పరిస్థితి

రూ.4కోట్లకు పైగా నష్టం

సాక్షి, శ్రీకాకుళం : జిల్లాలో చికెన్, వేట మాంసం అమ్మకాలపై కరోనా వైరస్‌(కోవిడ్‌–19) దెబ్బ పడింది. సోషల్‌ మీడియాలో మాంసాహారం వలనే చైనాలో కరోనా వైరస్‌ వ్యాప్తి చెందిందని ప్రచారం జరగడంతో మాంస ప్రియులు వెనుకంజ వేస్తున్నారు. ఈ కారణంగానే చికెన్‌ అమ్మకాలు 60 శాతానికి పైగా పడిపోయాయి. అదేవిధంగా ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. కోడి మాంసం అ మ్మకాల్లో రూ.3 కోట్లు, వేట మాంసం, చే పల అమ్మకాల్లో రూ.కోటి వరకు వ్యాపా రులు నష్టపోయివుంటారని అంచనా. సాధారణంగా ఆదివారం రెండు లక్షల కోళ్ల వరకు విక్రయిస్తుండేవారు. మిగిలిన నాలుగు రోజుల్లో మరో లక్ష కోళ్ల వరకు విక్రయించేవారు.

ఈ లెక్కన జిల్లాలో వారానికి మూడు లక్షల కిలోల వరకు కోడి మాంసం విక్రయాలు జరిగేవి. ఇప్పుడు 70 వేల కిలోలు మాత్రమే అమ్ముడవుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. అలాగే ధర కూడా స్కిన్‌తో ఉన్న చికెన్‌ కిలో రూ.95కు, స్కిన్‌లెస్‌ రూ.115 లకు పడిపోయింది. రెండు నెలల క్రితం ఇవే ధరలు రూ.230, రూ.250ల వరకు ఉండేవి. వేట మాంసం అమ్మకాలు కూడా పడిపోయాయి. ఆది, మంగళ వారాల్లో వేటమాంసం 30 వేల కిలోల వరకు అమ్మకాలు జరిగేవి. ఇప్పుడు 15 వేల కిలోలు కూడా అమ్ముడుపోవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. సముద్ర చేపలను కూడా తినేందుకు మాంసాహారులు సుముఖత చూపడం లేదు. ఈ కారణంగా వాటి విక్రయాలు కూడా పడిపోయాయి.

పాఠశాలలు, హాస్టళ్లలో మాంసం వడ్డిస్తున్నా విద్యార్థులు తినకపోవడంతో వార్డెన్లు, విద్యాశాఖ అధికారులు కూడా మాంసం కొనేందుకు సుముఖత చూపడం లేదు. వాటికి బదులుగా పౌష్టికాహారాన్ని వడ్డిస్తున్నారు. ఇటీవలి కాలంలో గుడ్డును తినేందుకు కూడా కొందరు విద్యార్థులు సుముఖత చూపడం లేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. అటువంటి వారిని వారించలేకపోతున్నామని చెబుతున్నారు. దీని వలన గుడ్డు ధర కూడా పడిపోయింది. 20 రోజుల క్రితం గుడ్డు ధర రూ.5.30 ల వరకు ఉండగా ఇప్పుడది రూ.4.30లకు దిగిపోయింది. ఇలా మాంసం, గుడ్డు ధరలు పడిపోవడంతో వ్యాపారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

మాంసం విక్రయాలు గణనీయంగా తగ్గాయి 
జిల్లాలో మాంసం విక్రయాలు బాగా తగ్గిపోయాయి. మాంసంతోపాటు గుడ్లు రేటు కూడా తగ్గిపోయాయి. మాంసం తింటే కరోనా వైరస్‌ సోకే ప్రమాదముందని ప్రచారం జరగడంతోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడింది. అలా అని కోళ్ల మేత ధరలు కూడా తగ్గలేదు. దీని వలన తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నాం.          
– పోలిశెట్టి వెంకటేష్, పౌల్ట్రీ అసోసియేషన్‌ సభ్యుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top