కన్నప్ప జన్మస్థలిపై కనికరమేదీ!

No Respect About Bhakta kannappa Birthplace - Sakshi

కన్నప్ప జన్మస్థలంగా ఊటుకూరు

పెరియ పురాణం ద్వారా వెలుగులోకి..

శ్రీకాళహస్తీశ్వరస్వామికి అపరభక్తుడుగా ప్రసిద్ధి

గ్రామస్తులచే భక్తకన్నప్ప విగ్రహం ఏర్పాటు..

సాక్షి, రాజంపేట : శ్రీకాళహస్తిలో దక్షిణకాశిగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయం. ఈ ఆలయంలోని శివలింగానికి పూజలు చేసి అపర శివభక్తునిగా నిలిచిన భక్తకన్నప్పది వైఎస్సార్‌ జిల్లా రాజంపేట మండలం ఊటుకూరు (ఊడుమూరు) గ్రామమని పెరియపురాణం ద్వారా వెలుగులోకి వచ్చింది. ఇక్కడున్న శివాలయంలో శివలింగానికి కన్నప్ప పూజించినట్లుగా చెబుతుంటారు. అపర శివభక్తుడు భక్తకన్నప్ప(తిన్నడు) జన్మస్థలంపై రాష్ట్ర ప్రభుత్వం అధికారముద్ర ఇంతవరకు పడలేదు.

ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. జన్మస్థలం అభివృద్ధి గురించి శ్రీకాళహస్తి దేవస్థానం శీతకన్ను వేసిందని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు పెరియపురాణం ద్వారా భక్తకన్నప్ప జన్మస్థలం రాజంపేట మండలంలోని ఊటుకూరు అని వెలుగులోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి గ్రామస్తులు  దాతల సహకారంతో ఆలయాభివృద్ధికి నడుం బిగించారు. భక్త కన్నప్ప విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.


భక్త కన్నప్ప జన్మ స్థలంలో ప్రతిష్టించిన కన్నప్ప విగ్రహం 

 
కన్నప్ప కాళహస్తికి ఎలావెళ్లాడు..
తిన్నడు(కన్నప్ప) ఒకనాడు అడవిలో పందిని వేటాడుతూ ఊటుకూరు నుంచి అటవీ ప్రాంతంలో స్వర్ణముఖి నది వరకు వెళ్లాడు. అక్కడ నేటి శ్రీకాళహస్తి దగ్గర శివలింగాన్ని దర్శించి, శివుని భక్తునిగా మారి పూజలు చేసేవాడు. తర్వాత పరమశివునికి తన రెండు కళ్లను సమర్పించి తన భక్తిని చాటుకున్నాడు. ఆయన భక్తికి మెచ్చి శివుడు కన్నప్పకి మోక్షమిచ్చాడు. మహాభక్తుడు కన్నప్ప ప్రతిష్టించిన శివలింగం జన్మ స్థలమైన ఊటుకూరు శివాలయంలో ఉంది.


కన్నప్ప ఊహాచిత్రం 

 
అన్నమయ్యతో భక్త కన్నప్ప జన్మస్థలానికి అనుబంధం..
తాళ్లపాక అన్నమాచార్యులు తాత నారాయణయ్య  చదువుకోవడానికి ఊటుకూరు(ఉడుమూరు)కు వచ్చారు. చదువు అబ్బక గురువు పెట్టే శిక్షలు భరించలేక చింతాలమ్మ గుడిలోని పుట్టలో చేయిపెట్టారు. పాము కరవలేదు కానీ, చింతాలమ్మ ప్రత్యక్షమైంది. శ్రీ వేంకటేశ్వరుని అనుగ్రహం వల్ల పరమభక్తుడు నీకు మనమడుగా పుడతాడని ఆశీర్వదించింది. ఆ నారాయణయ్య మనువడే అన్నమాచార్యులు. అన్నమయ్య తండ్రి నారాయణసూరి, తల్లి లక్కమాంబ. అన్నమయ్య కూడా ఊటుకూరులో చిన్నతనంలో విద్యాభ్యాసం చేశాడు. కలియుగ దైవం వేంకటేశ్వరునిపై 32వేల కీర్తనలు రచించి, పదకవితా పితామహడు పేరు తెచ్చుకొని ధన్యుడయ్యారు. చింతాలమ్మ అమ్మవారి విగ్రహం ఇప్పటికీ ఊటుకూరు శివాలయంలో ఉంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top