జాడలేని కొత్త నోటిఫికేషన్లు | No New Job notifications for Unemployed youth | Sakshi
Sakshi News home page

డాబులే.. జాబుల్లేవ్‌

Published Sun, Aug 26 2018 3:23 AM | Last Updated on Sun, Aug 26 2018 10:54 AM

No New Job notifications for Unemployed youth - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖపట్నంలో జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులకు అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూ) కుదిరాయని, వీటి ద్వారా 34 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల ప్రకటించారు. అయితే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భాగస్వామ్య సదస్సులు నిర్వహించిన ప్రతిసారి సీఎం చంద్రబాబు.. లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల్లో ఉద్యోగాలు అంటూ ప్రకటన చేస్తున్నారు. లక్షల ఉద్యోగాల మాట ఎలా ఉన్నా వేలల్లో కూడా ఉద్యోగాల కల్పన జరగలేదని, నాలుగేళ్లుగా ఇవే మాయ మాటలు చెబుతూ తమను మోసం చేస్తున్నారని నిరుద్యోగులు మండిప డుతున్నారు. ఒకపక్క ప్రైవేట్‌ ఉద్యోగాల పరిస్థితి ఇలా ఉంటే.. ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి చెప్పక్కర్లేదు.

ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత ఉద్యోగాల భర్తీ ఊసే మర్చిపోయారు. రాష్ట్ర విభజన సమయంలో 1.42 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కమలనాథన్‌ కమిషన్‌ నివేదిక ఇచ్చింది. ఆ పోస్టులు భర్తీ చేస్తారని నిరుద్యోగులు ఆశగా ఎదురు చూశారు. అయితే చంద్రబాబు సర్కార్‌ ఈ నాలుగున్నర ఏళ్లలో తూతూ మంత్రంగా కొన్ని నోటిఫికేషన్లు ఇచ్చి కేవలం నాలుగువేల పైచిలుకు పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతిచ్చింది. పరిస్థితి ఇలా ఉంటే ఎన్నికల ముందు మళ్లీ చంద్రబాబు వచ్చే నాలుగేళ్లలో 34 లక్షల ఉద్యోగాలు అంటూ ప్రకటన చేయడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.

ఎవరిని మోసం చేయడానికి ఈ మోసపూరిత ప్రకటనలు అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్లు ఇప్పట్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఇదిగో అదిగో అంటూ షెడ్యూళ్ల ప్రకటనతో ఊరిస్తూ వస్తున్న ప్రభుత్వం లక్షలాది మంది అభ్యర్థుల సహనానికి పరీక్ష పెడుతోంది. డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు జూలై 6న ప్రకటించారు. ఇప్పటివరకూ అతీగతీ లేకుండా పోయింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తామని ఏపీపీఎస్సీ చైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఏడాదిన్నరగా చెబుతున్నా ప్రభుత్వం మాత్రం స్పందించడంలేదు.  

నోటిఫికేషన్లు ఇచ్చినా.. నియామకాలు సున్నా  
ఏపీపీఎస్సీని ప్రక్షాళన చేసి, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను ఏటా క్యాలెండర్‌ విడుదల చేసి భర్తీ చేస్తామని, ప్రతి ఏటా డీఎస్సీని ప్రకటించి టీచర్‌ నియామకాలు చేపడతామని ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఈ నాలుగున్నరేళ్లలో ఒకే ఒక్కసారి డీఎస్సీ, పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 5,000 ఎస్‌ఐ, కానిస్టేబుళ్ల పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేశారు. ఏపీపీఎస్సీ ద్వారా 4,275 పోస్టుల భర్తీకి తూతూమంత్రంగా 32 నోటిఫికేషన్లు ఇచ్చినా ఆ నియామకాలు ఇప్పటికీ పూర్తికాలేదు. రాష్ట్ర విభజన సమయానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ శాఖల్లో మంజూరు పోస్టులు 6.97 లక్షలు కాగా, 1.42 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ నాలుగేళ్లలో పదవీ విరమణ చేసిన వారి సంఖ్యను కలిపితే ఖాళీల సంఖ్య 2 లక్షలకు చేరుతుంది. వాస్తవాలు ఇలా ఉండగా ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగులను మభ్యపెడుతూ లక్షల్లో ఉద్యోగాలు కల్పించినట్లు ప్రకటనలు చేస్తుండడం గమనార్హం.  

మించిపోతున్న వయోపరిమితి  
ఏళ్ల తరబడి ప్రభుత్వ పోస్టుల నోటిఫికేషన్లు రాకపోవడంతో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనే వయోపరిమితి మించిపోతోందని లక్షలాది మంది నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజనకు ముందు చాలాకాలం ప్రభుత్వ నోటిఫికేషన్లు వెలువడలేదు. విభజన అనంతరం ప్రభుత్వం 2014 సెప్టెంబర్‌ 23న ఉద్యోగాల వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచుతూ ఏడాది గడువుతో జీఓ 295ను విడుదల చేసింది. ఆ తరువాత మరో రెండుసార్లు గడువు పెంచారు. ఈ గడువు కూడా వచ్చేనెల 30వ తేదీతో ముగియనుంది. పోస్టుల భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు అడియాశలవుతున్నాయి. నోటిఫికేషన్లు వెలువడతాయని ఎదురుచూస్తూ నగరాల్లో హాస్టళ్లలో, అద్దె ఇళ్లల్లో ఉంటూ రూ.లక్షలు వెచ్చించి కోచింగ్‌ తీసుకుంటున్నామని వారు వాపోతున్నారు. ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేయకపోవడం దారుణమని మండిపడుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement