రాష్ట్రంలో ఉద్యాన శాఖ కార్యకలాపాలు పూర్తిగా పడకేశాయి. నిధుల లేమి, సిబ్బంది కొరత ఆ శాఖకు శాపాలుగా పరిణమించాయి.
పత్రంలోనే ‘హరితం’
Sep 15 2013 2:08 AM | Updated on Nov 9 2018 5:52 PM
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రంలో ఉద్యాన శాఖ కార్యకలాపాలు పూర్తిగా పడకేశాయి. నిధుల లేమి, సిబ్బంది కొరత ఆ శాఖకు శాపాలుగా పరిణమించాయి. ‘ఏపీ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు (ఏపీఎంఐపీ)’ కింద ఈ ఏడాది బడ్జెట్లో కేంద్రం రూ.295 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.276.84 కోట్లు కేటాయించాయి. ఇందులో కేంద్రం రూ.147.50 కోట్లు విడుదల చేసింది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో 5 నెలలు గడచినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. గత రెండేళ్లుగా ఈ పథకం కింద కేంద్ర నిధులకు మ్యాచింగ్‌గ్రాంట్‌గా రాష్ట్రం ఇవ్వాల్సిన రూ.402.23 కోట్ల బకాయిలూ ఇవ్వలేదు. స్టేట్ హార్టీకల్చర్ మిషన్‌కు కూడా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.1,595 కోట్లు కేటాయించినా, ఇంతవరకూ పైసా ఇవ్వలేదు. ఈ మిషన్‌కు కేంద్రం రూ.127.50 కేటాయించి, ఇప్పటికే రూ.29.01 కోట్లు విడుదల చేసింది. ఇక పూర్తిగా రాష్ట్ర నిధులతో అమలయ్యే పథకాలన్నీ అటకెక్కాయి. పూల తోటల ప్రోత్సాహానికి రూ.70 లక్షలు, తోటల చుట్టూ గోరింట మొక్కలతో కంచెలకు రూ.4 కోట్లు, ప్లాస్టిక్ క్రేట్స్‌కు రూ.1.31 కోట్లు, పాలిషీట్స్‌కు రూ.2.42 కోట్లు మొత్తం రూ.8.43 కోట్లు కేటాయించినా, విడుదల చేసింది రూ.2 లక్షలు మాత్రమే.
మూడింట రెండొంతుల పోస్టులు ఖాళీ
ఉద్యానశాఖకు మంజూరైన పోస్టుల్లో మూడింట రెండొంతులు ఖాళీగా ఉండిపోయాయి. మొత్తం 464మందని నియమించాల్సి ఉండగా, 165 మందే ఉన్నారు. 299 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. క్షేత్రస్థాయిలో పథకాలను అమలు చేయాల్సిన హార్టీకల్చర్ ఆఫీసర్ పోస్టులు 388 ఉంటే, అందులో 273 ఖాళీగా ఉన్నాయి. ఉద్యాన శాఖలో 192 పోస్టుల భర్తీకి 2012 డిసెంబర్‌లోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా ఉద్యోగాల భర్తీ జరగలేదు. పోస్టులు భర్తీ చేయకుండా నిర్దేశిత లక్ష్యాల సాధన అసాధ్యమని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
Advertisement
Advertisement