పోలవరం ప్రాజెక్టుపై ఇదేనా మీ చిత్తశుద్ధి?: ఎన్‌హెచ్‌పీసీ

NHPC slams AP govt over Polavaram project works - Sakshi

ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎన్‌హెచ్‌పీసీ కమిటీ

తక్కువ ఖర్చుతో ప్రాజెక్టును పూర్తి చేసే అంశంపై కేంద్రానికి నివేదిక ఇస్తాం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో ఏపీ ప్రభుత్వ లోపాలను జాతీయ జలవిద్యుదుత్పత్తి సంస్థ (ఎన్‌హెచ్‌పీసీ) కమిటీ ఎత్తిచూపింది. ‘స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా కాఫర్‌ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించడం ఎలా సాధ్యం? గ్రావిటీ ద్వారా నీటిని ఎలా సరఫరా చేస్తారు?’ అని కమిటీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. శుక్రవారం ఎన్‌హెచ్‌పీసీ కమిటీ సభ్యులు వైకే చౌబే, ఆర్‌సీ శర్మ, శంక్‌దీప్‌ చౌదరిలు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించి.. రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

జూన్, 2018 నాటికి స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనులను పూర్తి చేసేందుకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను అందిస్తే.. దాన్ని అధ్యయనం చేసి కాఫర్‌ డ్యామ్‌పై నిర్ణయం తీసుకుంటామని కమిటీ స్పష్టీకరించింది. స్పిల్‌ వే, స్పిల్‌ ఛానల్‌ పనుల్లో ఇప్పటివరకూ 10 శాతం కాంక్రీట్‌ పనులను మాత్రమే చేశారని పేర్కొంది. మిగిలిన 30 లక్షల క్యూబిక్‌ మీటర్ల కాంక్రీట్‌ పనిని జూన్, 2018 నాటికి ఎలా పూర్తి చేస్తారని నిలదీసింది. కాంక్రీట్‌ పనులను పూర్తి చేయకుండానే.. కాఫర్‌ డ్యామ్‌ను 41 మీటర్ల ఎత్తుతో నిర్మించడానికి అనుమతి ఇవ్వాలని కోరడాన్ని తప్పుబట్టింది. జూన్, 2018 నాటికి కాంక్రీట్‌ పనులు పూర్తి చేసేందుకు రూపొందించిన కార్యాచరణ ప్రణాళికను ఇవ్వాలని జలవనరుల శాఖ అధికారులను కోరింది.  

కాఫర్‌ డ్యామ్‌తో సమాంతరంగా..
రుతుపవనాల ప్రభావం లేనప్పుడు గోదావరి నదికి ఎంత వరద వస్తుందని కమిటీ ఆరా తీసింది. వరద తక్కువగా ఉన్న భాగంలో కాఫర్‌ డ్యామ్‌తో సమాంతరంగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించడం వల్ల అతి తక్కువ వ్యయంతో ప్రాజెక్టును పూర్తి చేయొచ్చని కమిటీ అభిప్రాయపడింది. దీనితో రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఏకీభవించలేదు. దాంతో.. ముందు రుతుపవనాల ప్రభావం లేనప్పుడు గోదావరికి ఎంత వరద వస్తుంది.. రుతుపవనాల ప్రభావం ఉన్నప్పుడు ఎంత వరద వస్తుందన్న అంశాలపై 50 ఏళ్ల రికార్డులను ఇవ్వాలని కమిటీ సభ్యులు కోరారు. వరద తక్కువ ఉన్నప్పుడు కొంత భాగం చొప్పున దశల వారీగా దేశంలో ఎన్నో ప్రాజెక్టులను పూర్తి చేశారని.. పోలవరం ప్రాజెక్టును అతి తక్కువ ఖర్చుతో దశల వారీగా పూర్తి చేయొచ్చని కమిటీ వివరించింది. వరద రికార్డులను అందిస్తే అధ్యయనం చేసి.. కాఫర్‌ డ్యామ్‌ను 31 మీటర్ల ఎత్తుతో నిర్మించాలా? 41 మీటర్ల ఎత్తుతో నిర్మించాలా? కాఫర్‌ డ్యామ్‌తో సమాంతరంగా ఎర్త్‌ కమ్‌ రాక్‌ఫిల్‌ డ్యామ్‌ను నిర్మించాలా? అనే అంశాలపై కేంద్రానికి నివేదిక ఇస్తామని పేర్కొంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top