సడలని సంకల్పం | nellore district raiseing Telangana issue | Sakshi
Sakshi News home page

సడలని సంకల్పం

Aug 5 2013 4:54 AM | Updated on Oct 22 2018 9:20 PM

జిల్లా భగ్గుమంటోంది. రోజురోజుకూ సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సోనియాగాంధీపై ఆగ్రహంపై పెల్లుబుకుతోంది. అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి చేరి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు.

 సాక్షి, కడప : జిల్లా భగ్గుమంటోంది. రోజురోజుకూ సమైక్య ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. సోనియాగాంధీపై ఆగ్రహంపై పెల్లుబుకుతోంది.  అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా రోడ్లపైకి చేరి తమ నిరసన  గళాన్ని వినిపిస్తున్నారు. సోనియా దిష్టిబొమ్మలకు శాస్త్రోక్తంగా పిండ ప్రదానాలు చేసిన అనంతరం వాటిని దహనం చేసి  తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.  తెలుగు జాతిని విభజించే అధికారం ఎవరిచ్చారంటూ నిలదీస్తున్నారు.
 
 విభజనపై యూపీఏ ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు పోరాటం ఆగదని  ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు. కడపలో అఖిలపక్షం, సమైక్యాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో పొట్టిశ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేసి రోడ్డుపైనే బైఠాయించి తమ నిరసనను తెలియజేశారు.
 
 ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, జేఏసీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, హరిప్రసాద్, అంజాద్‌బాష, విష్ణుప్రీతమ్‌రెడ్డితోపాటు వందలాదిమంది విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు పాల్గొన్నారు. తాముసైతం అంటూ వికలాంగులు  సమైక్యాంధ్రకు మద్దతుగా కలెక్టరేట్ నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.  దేవునికడప నుంచి కలెక్టరేట్ వరకు అర్చకులు  బైక్ ర్యాలీ నిర్వహించి సమైక్యాంధ్రకు తమ మద్దతు తెలిపారు.  జిల్లా కోర్టు ఎదుట బార్‌అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్‌కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
 
  జమ్మలమడుగులో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘ నేతల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.రోడ్డుపైనే వంటా వార్పు చేపట్టారు.  నలుగురు ఉపాధ్యాయ సంఘ నేతలు గుండు గీయించుకుని తమ నిరసన తెలిపారు. జ్యోతీశ్వర్ అనే చిన్నారి  సమైక్యాంధ్ర ప్లకార్డు పట్టుకుని గుండు గీయించుకుంది.  బ్రాహ్మణ, ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, నిరసన దీక్షలు చేపట్టారు. ముద్దనూరులో విద్యార్థులు రిలే దీక్షలను చేపట్టారు. చిలంకూరులో లారీ ఓనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో సోనియాగాంధీ దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు.
  పులివెందులలో జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ కార్యాలయం, ఆర్టీసీ,పాత బస్టాండు, పొట్టి శ్రీరాములు విగ్రహం మీదుగా తహశీల్దార్ కార్యాలయం వరకు నోటికి నల్లగుడ్డలను కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించారు. జేఏసీ చైర్మన్ నరసింహారెడ్డి, వైఎస్సార్ సీపీ నేత దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, వరప్రసాద్‌తోపాటు నారాయణస్వామి, సునందరావు తదితరులు పాల్గొన్నారు. ఐదవ రోజు తహశీల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.  ప్రొద్దుటూరులో జిల్లా అర్చక సంఘం ఆధ్వర్యంలో తెలుగు తల్లి విగ్రహాన్ని ఊరేగించారు. పుట్టపర్తి సర్కిల్‌లో సోనియా, రాహుల్‌గాంధీ, కేసీఆర్ దిష్టిబొమ్మలకు వేద పండితులు శాస్త్రోక్తంగా పిండ ప్రదానం చేశారు. భవన నిర్మాణ కార్మికులు సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. న్యాయవాదులు, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రైవేటు పాఠశాలల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శివాలయం సర్కిల్‌లో వంటా వార్పు చేపట్టారు. ఆటో కార్మికుల, రీటైల్ క్లాత్ మర్చంట్స్ ఆధ్వర్యంలో ర్యాలీలు కొనసాగాయి.
 
  మైదుకూరులో ఆర్యవైశ్యులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. వీరికి మైదుకూరు ఎమ్మెల్యే డీఎల్ రవీంద్రారెడ్డి సంఘీభావం తెలిపారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. సీఎం, బొత్స సత్యనారాయణ రాజీనామాలు చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ముస్లిం మతపెద్ద ఫజుల్ రెహ్మాన్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని  దీక్ష విరమింపజేశారు. క్రైస్తవులు సమైక్యాంధ్రకు తమ మద్దతును తెలిపి సోనియా తీరుపై మండిపడ్డారు.
 
 ఖాజీపేట మండలం పత్తూరులో వంటా వార్పు కార్యక్రమాన్ని చేపట్టి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్దం చేశారు. రాయచోటిలో సమైక్య జేఏసీ నాయకులు డాక్టర్ బయారెడ్డి, నాగిరెడ్డి, శ్రీనివాసరాజు, వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జాతీయరహదారిలోని నేతాజీ సర్కిల్‌లో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేసి నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు.రోడ్డుపైనే కబడ్డీ ఆడారు.
 
  కమలాపురంలో అన్ని చర్చిల ఫాస్టర్లు, క్రైస్తవ సోదరులు ర్యాలీగా క్రాస్‌రోడ్డు వద్దకు చేరుకుని మోకాళ్లపై ప్రార్థనలు చేశారు. సి.గోపులాపురంలో స్థానిక సర్పంచ్ సుబ్బిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ఎత్తున రాస్తారోకో చేసి వంటా వార్పుచేపట్టారు.ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.  వైఎస్సార్ సీపీనేతలు ఉత్తమారెడ్డి,సంబటూరు ప్రసాద్‌రెడ్డి  మద్దతు తెలిపారు.
  రైల్వేకోడూరులో వైఎస్సార్ విగ్రహం వద్ద ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు. వాహనాలు రోడ్డుపై బారులు తీరాయి.  బద్వేలులో సమైక్యాంధ్రజేఏసీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం చేశారు. మానవహారంతోపాటు ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. సమైక్యాంధ్రను సాధించేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదని హెచ్చరించారు. వీరికి ఆర్యవైశ్య వర్తకసంఘం,మహిళా సంఘం,వాసవీ క్లబ్  మద్దతు తెలిపాయి. పోరుమామిళ్ల, గోపవరంలో రాస్తారోకోలు, ర్యాలీలు చేపట్టారు. రాజంపేటలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు.పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఎన్జీఓ సంఘం నాయకులు రమణ, రెవెన్యూ జేఏసీ నాయకులు సుబ్బన్న ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. సుండుపల్లెలో యువకులు సమైక్యాంధ్రకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తెలియజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement