‘అన్న’న్నా..!

Negligence in East Godavari Anna Canteen - Sakshi

అన్న క్యాంటీన్లలో నాసిరకం భోజనం

నాణ్యత లేని బియ్యంతోనే అన్నం

నీరులా ఉంటున్న సాంబారు రుచీపచీ లేని కూర తగ్గిపోతున్న పరిమాణం

ఒక్కొక్కరికి 70 నుంచి 80 గ్రాముల వరకూ కోత ప్రశ్నిస్తున్న జనం..

సమాధానం చెప్పలేని సిబ్బంది జీతాల్లేక ఇబ్బందులు

సాక్షి ప్రతినిధి, కాకినాడ: రూపాయికే కిలో బియ్యం పథకాన్ని అమలు చేసి, పేదల కడుపు నింపిన నాటి ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు పేరిట రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన అన్న క్యాంటీన్లు.. అన్నార్తుల ఆకలిని పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నాయి. నాణ్యత లోపం, నానాటికీ పడిపోతున్న పరిమాణం, రుచి లేమి తదితర లోపాలు కనిపిస్తుండడంతో అన్న క్యాంటీన్లపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలా క్యాంటీన్లలో తొలి రోజుల్లో ఉన్న నాణ్యత ఇప్పుడు ఉండటం లేదు. రుచికరమైన భోజనం పెట్టడం లేదు. పెట్టాల్సిన అన్నంలో ఒక్కొక్కరికి 70 నుంచి 80 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. దీంతో భోజనం కోసం వచ్చిన వారందరూ అసంతృప్తి, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తొలి రోజుల్లో సన్నబియ్యం.. ఇప్పుడు కోటా బియ్యం
‘‘అన్న క్యాంటీన్లు ఆరంభించిన తొలి రోజుల్లో సన్నబియ్యంతో అన్నం పెట్టేవారు. సాంబారు, కూర కూడా రుచిగా ఉండేవి. కానీ కొన్ని రోజులుగా పరిస్థితి మారింది. సన్నబియ్యం పెట్టడం లేదు. కోటా బియ్యం మాత్రమే వండి వార్చి పెడుతున్నారు. ఇక, సాంబారు నీళ్లను తలపిస్తోంది. కూర ఏమాత్రం రుచిగా ఉండటం లేదు’’ అని అన్న క్యాంటీన్లకు నిత్యం వస్తున్నవారు విమర్శిస్తున్నారు. గతంలో మెనూ చార్ట్‌ ఉండేదని, ఇప్పుడా చార్ట్‌ కూడా తీసేశారని అంటున్నారు. ఎందుకు తీసేశారని సిబ్బందిని అడిగితే పైవాళ్లు తీసేయమన్నారంటున్నారని చెబుతున్నారు.

లోపమెక్కడో!
గతంలో 6 బౌల్స్‌ అన్నం, రెండు బౌల్స్‌ సాంబారు, ఒక బౌల్‌ పూర్తిగా కూర ఇచ్చేవారు. క్యాంటీన్లలో తింటున్నవారి సంఖ్య పెరగడంతో అన్నాన్ని ఆరు నుంచి తొమ్మిది బౌల్స్‌కు పెంచారు. సాంబారు యథాతథంగానే రెండు బౌల్స్‌ ఇస్తున్నారు. కూర సగానికి పైబడి ఉన్న రెండు బౌల్స్‌తో అందిస్తున్నారు. ఇప్పుడిదే సమస్యగా మారిందని సిబ్బంది చెబుతున్నారు. గతంలో పెద్ద బౌల్స్‌లో వచ్చేవని, ఇప్పుడా బౌల్స్‌ సైజు కూడా తగ్గిపోయిందని, భోజనం రుచి కూడా తగ్గిపోయిందని సాక్షాత్తూ సిబ్బందే చెబుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. భోజనం సరఫరా చేస్తున్న ‘అక్షయపాత్ర’ సంస్థ నుంచే ఆవిధంగా వస్తోందని సిబ్బంది అంటున్నారు.

పట్టించుకోని ప్రభుత్వం
ప్రచారం కోసం అన్న క్యాంటీన్లను భారీగా ఏర్పాటు చేసినా ఆ తర్వాత ప్రభుత్వం వీటి నిర్వహణను సరిగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఒకప్పుడు సన్నబియ్యం పెడితే ఇప్పుడా బియ్యం నాసిరకంగా ఉండడానికి ప్రభుత్వమే కారణమని పలువురు చెబుతున్నారు. సాధారణంగా భోజనం పెట్టేటప్పుడు ముందుగా సంబంధిత పర్యవేక్షకులు రుచి చూసి గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలి. ఇక్కడా పరిస్థితి కనిపించడం లేదు. తమకొచ్చిన భోజనం రుచికరమైనదా, కాదా అనేది చూడకుండా ప్రజలకు నేరుగా పెట్టేస్తున్నారు. అది నాణ్యతగా లేకపోవడంతో తింటున్న వారందరూ గగ్గోలు పెడుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే ఒక్కో క్యాంటీన్‌లో ఎనిమిది మంది చొప్పున పని చేస్తున్నారు. వారికి నాలుగు నెలలుగా జీతాలు కూడా ఇవ్వడం లేదు. జీతాల్లేని వారు ఏ మేరకు బాధ్యతగా పని చేస్తారో అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఏం చేసినా సిబ్బందిని ప్రశ్నించే పరిస్థితి ఉండదని పలువురు అంటున్నారు.

మొదట్లో బావుండేది
అన్న క్యాంటీన్‌ పెట్టిన మొదట్లో భోజనం బావుండేది. అన్నం నిర్దేశిత పరిమాణంలో పెట్టేవారు. ఆకలి కూడా తీరేది. భోజనం రుచికరంగా ఉండటంతో తింటే సంతృప్తిగా ఉండేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ప్రత్యామ్నాయం లేక తప్పని పరిస్థితుల్లో వచ్చి భోజనం చేస్తున్నాం. లోపాలను అధికారులు చక్కదిద్దాలి– విజయ్, విద్యార్థి

అన్నం బాగోలేదు
గతంలో సన్నబియ్యం పెట్టేవారు. ఇప్పుడు స్టోర్‌ బియ్యం పెడుతున్నట్టుగా ఉంది. ఏమాత్రం బాగోవడం లేదు. సాంబారు, కూర కనీసంగా కూడా రుచిగా ఉండడం లేదు. పెట్టిన అన్నంలో కూడా 70 నుంచి 90 గ్రాముల వరకూ కోత పెడుతున్నారు. ఆకలి తీరడం లేదు. క్యాంటీన్‌లో కనీసం మెనూ చార్ట్‌ కూడా ఉంచడం లేదు. అంతా ప్రచారార్భాటంగానే ఉంది.– అల్లు సతీష్‌

రుచిగా లేదు
అన్నమే కాదు.. సాంబారు, కూర కూడా రుచిగా ఉండడం లేదు. వారేది పెడితే అది తింటున్నాం. లోపాలపై అడిగితే పట్టించుకోవడం లేదు. సాంబారైతే నీళ్ల మాదిరిగానే ఉంటోంది. మొదట్లో అన్నం బాగుండేది. ఇప్పుడది కూడా బాగుండటం లేదు.– వీరబాబు, కాకినాడ

నా దృష్టికి రాలేదు
ప్రతి రోజూ పర్యవేక్షణ చేస్తున్నాను. భోజనం రుచికరంగానే ఉంటోంది. పరిమాణం తక్కువ పెడుతున్నట్టు నా దృష్టికి రాలేదు. అయినప్పటికీ ‘అక్షయపాత్ర’ దృష్టికి తీసుకెళ్తున్నా. లోపాల్లేకుండా చూసుకుంటాను.
– ఉమామహేశ్వరి, నోడల్‌ ఆఫీసర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top