సినీ నటి నీతూ అగర్వాల్‌కు మంగళవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కోవెలకుంట్ల (కర్నూలు జిల్లా): సినీ నటి నీతూ అగర్వాల్‌కు మంగళవారం కర్నూలు జిల్లా కోవెలకుంట్ల జూనియర్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం కర్నూలు జిల్లా రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో సంతకం చేయాలనే షరతుతో జడ్జి బెయిల్ మంజూరు చేశారు. రుద్రవరం మండలం నర్సాపురం సమీపంలోని వాగులో ఈ ఏడాది ఫిబ్రవరి 10న 46 టన్నుల ఎర్రచందనం దుంగలు తరలిస్తున్న టాటా ఏసీ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.
ఈ కేసులో బాలునాయక్, శంకర్‌నాయక్, తిరుపాల్‌నాయక్, నరసింహనాయక్ సహా మరి కొందరిపై రుద్రవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సినీ నటి నీతూ అగర్వాల్ బ్యాంకు ఖాతా నుంచి బాలునాయక్ బ్యాంకు ఖాతాకు రూ.1.05 లక్షలు జమ అయినట్లు తేలడంతో నీతూను ఈ కేసులో పదవ నిందితురాలిగా చేర్చారు. గత నెల 26న కర్నూలు శివారులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు.
బెయిల్ కోసం నీతూ అగర్వాల్ కోర్టును ఆశ్రయించడంతో జడ్జి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, నీతూ అగర్వాల్ ప్రస్తుతం నంద్యాల సబ్ జైలులో ఉంది. బెయిల్ మంజూరు ఉత్వర్వులను సాయంత్రం 5 గంటల్లోపు సబ్‌జైలులో అందజేయాల్సి ఉంది. అయితే, ఆ సమయం మించి పోవడంతో బుధవారం ఆమెను విడుదల చేయనున్నారు.