
సాక్షి, అమరావతి: విభజన తర్వాత ఏపీ ప్రభుత్వ తొలి మహిళా ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీ బాధ్యతలు చేపట్టారు. గురువారం సచివాలయంలోని మొదటి భవనంలో ఇన్‌చార్జి సీఎస్ నీరబ్‌కుమార్ ప్రసాద్ నుంచి ఆమె బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం, మార్గదర్శకత్వంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు.
విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలపై ప్రత్యేక దృష్టిపెట్టి అధికారబృందం సమష్టి కృషితో రాష్ట్రాన్ని ఆయా రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. అంతకుముందు విజయవాడ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానానికి చెందిన వేద పండితులు నూతన సీఎస్‌కు ఆశీర్వచనాలిచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు అందించారు. సీఎస్‌గా బాధ్యతలు చేపట్టాక తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.