తల లేకున్నా గెల వేసింది. | Sakshi
Sakshi News home page

తల లేకున్నా గెల వేసింది.

Published Tue, Apr 24 2018 9:24 AM

Nature is strange - Sakshi

అమలాపురం : అరటి చెట్టు కొన్నాళ్లు ఎదిగాక, మొవ్వు నుంచి కోటాకు వేసి, ఆనక దాన్నుంచి పువ్వు వచ్చి, అది గెలగా అభివృద్ధి చెందుతుంది. ఇదీ ఏ అరటి చెట్టయినా ఫలసాయాన్నిచ్చే క్రమం. అయితే ఓ అరటిచెట్టును మొదలంటా నరికేసినా.. తల లేని మెండెం లాంటి మొదలు నుంచే గెల వేసి, కాయలు ఏపుగా ఎదుగుతున్నాయి.

కొత్తపేట మండలం అవిడిరేవు సమీపంలో కొబ్బరిరైతు, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ మాజీ ఆడిటర్‌ ఉద్దరాజు ప్రసాదరాజు సాగుచేస్తున్న తోటలో ఓ అరటిచెట్టును తెగులు కారణంగా నరికేశారు. అయితే ఆ చెట్టు మొదలు నుంచే గెల వచ్చి, ఎదుగుతూ..‘నన్ను నేలకూల్చినా.. చైతన్యబావుటానై నింగికెగుస్తా’ అన్న ఓ విప్లవకారుడి మాటలను గుర్తుకు తెస్తోంది.

అదే తోటలో ఆ చెట్టు పక్కనే నరికిన మరో చెట్టు మొదలు నుంచి కొత్త పిలక వచ్చి, అనతి కాలంలోనే గెల వేయడం మరో విశేషం. ఆ సమీపంలో ఉన్న ప్రసాదరాజుకే చెందిన మరో తోటలో ఒకే విత్తనం కొబ్బరికాయ నుంచి ఏకంగా మూడు మొక్కలు రావడం ఇంకో తమాషా. ఆ మూడు మొక్కలూ ప్రస్తుతానికి ఏపుగా పెరుగుతున్నాయని, కాపు ఎలా ఉంటుందో చూడాలని ప్రసాదరాజు ‘సాక్షి’తో అన్నారు.  

1/2

ఒకే విత్తనం నుంచి మొలిచి ఎదుగుతున్న మూడుచెట్ల వద్ద ప్రసాదరాజు

2/2

నరికిన చెట్టు నుంచి మొలిచి, గెల వేసిన అరటిమొక్క

Advertisement
Advertisement