నారికేళం.. ధరహాసం | Coconut Prices Rise in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నారికేళం.. ధరహాసం

Sep 22 2025 5:35 AM | Updated on Sep 22 2025 5:35 AM

Coconut Prices Rise in Andhra Pradesh

వరుస పండుగలతో పెరుగుతున్న కొబ్బరికాయ ధరలు 

రైతుల వద్ద వెయ్యి కాయలు రూ. 27 వేలు  

క్షేత్రాల్లో సైజును బట్టి రూ.30 నుంచి రూ.50కి విక్రయాలు 

ముందెన్నడూ ఇంత ధర లేకపోవడంతో రైతుల హర్షం 

కొనేందుకు వెనకాడుతున్న భక్తులు.. తగ్గిన విక్రయాలు

ద్వారకాతిరుమల: కొబ్బరికాయల ధర మరింత పెరిగింది. దీపావళి, ఆ తరువాత కార్తీకమాసం సీజన్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో కొబ్బరి కాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇప్పటికే కనీవినీ ఎరుగని రీతిలో ధరలు పెరగడంతో పలు క్షేత్రాలను సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనలేక గగ్గోలు పెడుతు­న్నారు. ప్రస్తుతం రైతులు వెయ్యి కొబ్బరి కాయలను రూ. 27 వేలకు విక్రయిస్తున్నారు. చిన్నా, పెద్దా, లేత, ముదురు, ఎండు, పచ్చి అనే తేడా లేకుండా అన్ని రకాల కాయలను ఇదే ధరకు అమ్ముతున్నారు.

ఇదిలా ఉంటే నెల రోజుల నుంచి రికార్డు స్థాయిలో ధరలు పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో కొబ్బరి కాయకు రూ.20 ధర రావడాన్ని రైతులు చూడలేదు. అలాంటిది ఊహించని విధంగా ఇప్పుడు ఇంత ధర పలుకుతుండటంతో రైతులు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుస పండుగలు, ఆ తరువాత కార్తీకమాసం కావడంతో ధర అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులను చూస్తే నారికేళం ధర ఇప్పట్లో దిగివచ్చేలా కనిపించడం లేదు. 

ఇతర రాష్ట్రాలకు ఎగుమతులు 
ప్రస్తుతం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి రోజుకు 70 లారీలకు పైగా కొబ్బరి కా­య­లు గుజరాత్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, మద్య­ప్రదేశ్, బీహార్, పశి్చమబెంగాల్‌కు ఎగు­మతి అవుతున్నాయి. స్థానికంగా ధరల పెరుగుదలకు ఈ ఎగుమతులు కూడా ఒక కారణమని వ్యాపారులు చెబుతున్నారు. మహారాష్ట్ర నుంచి డిమాండ్‌ ఉంటే నెల క్రితమే ఒక్కో కొబ్బరికాయ ధర రూ. 28కు చేరేదని అంటున్నారు.  

మొక్కుబడులు వాయిదా..  
కోరిన కోర్కెలు తీరడంతో శ్రీవారి క్షేత్రానికి మొక్కులు చెల్లించేందుకు వస్తున్న భక్తులు కొబ్బరి కాయల ధరలను చూసి హడలిపోతున్నారు. ఈ క్రమంలోనే 101, ఆపై కొబ్బరి కాయల మొక్కుబడి ఉన్న పలువురు భక్తులు తమ మొక్కులను వాయిదా వేసుకుంటున్నారు. సామాన్య భక్తులు సైతం అంత ధర పెట్టి కొబ్బరికాయను కొనేందుకు ఆలోచిస్తున్నారు. దాంతో కొందరు వ్యాపారులు కొబ్బరికాయ రేటు చెబితే భక్తులు కొనడం లేదని గ్రహించి, పూజా సామాగ్రితో కలిపి సెట్టు రూ.100కు విక్రయిస్తున్నారు. కొబ్బరికాయల ధరలు మరింతగా పెరిగితే వ్యాపారాలు సాగడం కష్టమేనని అంటున్నారు.

సైజును బట్టి ధర 
పుణ్యక్షేత్రాల్లో వ్యాపారులు ఒక్కో కొబ్బరి కాయను రూ.30 నుంచి రూ.45కు విక్రయిస్తున్నారు. రైతుల నుంచి అన్ని సైజుల కాయలను ఒకే ధరకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు, వాటి­ని గ్రేడింగ్‌ చేసి అతి చిన్న కాయను రూ.30కు, మీడియం సైజు కాయను రూ.35 నుంచి రూ. 40కు, పెద్ద కాయను రూ. 45 నుంచి రూ.50కు విక్రయిస్తున్నారు. దాంతో ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తులు కొబ్బరి కాయలు కొనేందుకు గగ్గోలు పెడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement