
రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు
అందుకే ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్పనంగా ప్రైవేట్‌కు ఇస్తున్నారా?
సుదీర్ఘకాలం సీఎంగా చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టలేదు
కానీ, గత ప్రభుత్వం పెట్టిన వాటిని మాత్రం ప్రైవేట్‌పరం చేస్తున్నారు
వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే ఐదు కాలేజీల్లో తరగతులు ప్రారంభం
పాడేరు, పులివెందుల కాలేజీల నిర్మాణాలు పూర్తి
వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే మిగతా కాలేజీలూ పూర్తయ్యేవి
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజాపోరాటంతోపాటు న్యాయపోరాటానికి రెడీ
రౌండ్ టేబుల్ సమావేశంలో నిప్పులు చెరిగిన ప్రజాసంఘాల నేతలు
ప్రభుత్వ రంగంలోనే వైద్యవిద్య, ప్రజారోగ్యం కొనసాగించాలని డిమాండ్
సాక్షి, అమరావతి : చంద్రబాబునాయుడు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా సంపద సృష్టిస్తానని గొప్పలు చెబుతారని, వాస్తవానికి సంపద సృష్టించడం అంటే కార్పొరేట్ల ఆస్తులను పెంచడమా?.. అందుకే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అప్పనంగా ప్రైవేట్‌కు అప్పగిస్తున్నారా? అంటూ పలువురు వక్తలు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగించాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ బాలోత్సవ భవనంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
సుదీర్ఘకాలం సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటుచేయలేదని.. కానీ, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపట్టిన మెడికల్ కాలేజీలను మాత్రం పీపీపీ పద్ధతిలో ప్రైవేట్‌పరం చేస్తున్నారని వక్తలు మండిపడ్డారు. అలాగే, గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మెడికల్ కాలేజీల్లో ప్రవేశపెట్టిన సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ కోర్సులను తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ప్రతిపక్ష టీడీపీ.. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆ జీఓలను రద్దుచేస్తామని ప్రగల్భాలు పలికిందని.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక వాటిని పూర్తిగా ప్రైవేట్‌పరం చేయడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. సమావేశంలో వక్తలు ఇంకా ఏం మాట్లాడారంటే..
సగం పూర్తయిన కాలేజీలూ పూర్తికాలేదని..
గత ప్రభుత్వం చేపట్టిన 17 వైద్య కళాశాలలకుగాను ఐదింటిలో తరగతులు ప్రారంభించింది. పాడేరు, పులివెందుల కాలేజీల నిర్మాణాలు కూడా పూర్తి చేసింది. గత ఏడాది పాడేరు కాలేజీలో తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే మిగతా కాలేజీలూ పూర్తయ్యేవి. పులివెందుల కాలేజీకి అనుమతులు వచ్చినా.. కూటమి ప్రభుత్వం అడ్డుకుంది. పది కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు కట్టబెడుతోంది.
ఇప్పటికే 50 శాతానికి పైగా పూర్తయిన కాలేజీల్లో సైతం పక్కనున్న పునాదులను చూపించి అసలు పూర్తికాలేదన్నట్లు ప్రజలను మభ్యపెడుతోంది. ఏడాదికి రూ.600 కోట్లు కేటాయించినా ఐదేళ్లల్లో అన్ని పూర్తయ్యి పేద విద్యార్థులకు వైద్య విద్య, వైద్యం అందుబాటులోకి వస్తాయనే విషయాన్ని కూటమి ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? ఉమ్మడి రాష్ట్రంలో నాటి సీఎం నేదురుమల్లి జనార్థన్‌రెడ్డి ప్రభుత్వం ప్రైవేట్ వైద్య, ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతివ్వడంతో పెద్దఎత్తున ఉద్యమాలు జరిగి ఆయన పదవి పోయింది.
భవిష్యత్తులో కూడా అలాంటి ఉద్యమాలే వస్తాయి. ఇప్పటికే రాష్ట్రంలో రూ.వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్‌లకు కట్టబెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గం.
ప్రజా ఉద్యమాలతోపాటు న్యాయపోరాటం..
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్‌పరం చేసే ప్రయత్నాలు విరమించుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఐక్య ప్రజా ఉద్యమాలు నిర్వహించడంతోపాటు న్యాయపోరాటం కూడా చేయాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. ప్రభుత్వ రంగంలోనే వైద్య విద్య, వైద్యాన్ని కొనసాగించాలనే తీర్మానాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై. వెంకటేశ్వరరావు ప్రవేశపెట్టారు. పీపీపీ ఆలోచనకు స్వస్తిచెప్పి 10 వైద్య కళాశాలలను ప్రభుత్వమే నడపాలని, ప్రభుత్వాస్పత్రులను బలోపేతం చేయాలని సమావేశం డిమాండ్ చేసింది.
అలాగే, ఎన్టీఆర్ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)ను ప్రభుత్వమే నిర్వహించాలనే తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఆరోగ్య బీమాను ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించేందుకు ప్రభుత్వం పూనుకోవడం సామాన్య ప్రజలకు వైద్యాన్ని దూరం చేయడమేనని సమావేశం అభిప్రాయపడింది. ఇక ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీమంత్రి, రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు అలా వెంకటేశ్వరరావు, జనచైతన్య వేదిక అధ్యక్షులు లక్ష్మణరెడ్డి, పీడీఎఫ్ మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ప్రజారోగ్య వేదిక అధ్యక్షులు ఎంవీ రమణయ్యతో పాటు జాస్తి కిషోర్‌బాబు (సీపీఐ ఎంఎల్), పి. జమలయ్య (సీపీఐ)తదితరులు మాట్లాడారు.
ప్రైవేటీకరణ సమస్య విద్యార్థులదే కాదు.. ప్రజలది కూడా..
ఇక 15 నెలల ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన గమనిస్తే భూ పందారాలు తప్ప ఏమీలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రైవేటీకరణ చేయనున్న వైద్య కళాశాలలు ఎక్కువగా వెనుకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ ఆస్పత్రుల నిర్మాణం పూర్తయితే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ప్రైవేటీకరణ సమస్య కేవలం విద్యార్థులదే కాదు.. ప్రజలది కూడా. వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలో ఉంటే సేవా దృక్పథం.. ప్రైవేట్ చేతుల్లో ఉంటే వ్యాపార దృక్పథం ఉంటుంది.