
జీఎస్‌టీ శ్లాబ్‌ల మార్పుతో ఏపీకి రూ.8,000కోట్ల ఆదాయం తగ్గదు
రాష్ట్ర ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ఎస్‌బీఐ రీసెర్చ్
వినిమయ శక్తి పెరిగి రూ.16,759 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని స్పష్టికరణ
సాక్షి, అమరావతి: జీఎస్‌టీ సవరణ ఆమోదించదగ్గ పరిణామమేనని, దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందన్న వాదనలో వాస్తవం లేదని ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక స్పష్టం చేసింది. ఏటా రూ.8,000 కోట్ల ఆదాయం తగ్గుతుందన్న రాష్ట్ర ప్రభుత్వ అంచనాను తప్పుబట్టింది. వినిమయ శక్తి పెరిగి రూ.16,759 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని తేల్చి చెప్పింది.
సవరించిన జీఎస్‌టీ శ్లాబులు దేశవ్యాప్తంగా సోమవారం నుంచి అమల్లోకి రానున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు ఆదివారం వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే జీఎస్‌టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవోలను విడుదల చేసింది. సోమవారం నుంచి అన్ని వస్తువుల అమ్మకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయని వాణిజ్యపన్నుల శాఖ అధికారులు స్పష్టంచేశారు.
స్వల్పకాలిక హెచ్చుతగ్గులు సహజం
జీఎస్‌టీ సవరణ ప్రభావం రాష్ట్రంపై ఎలా ఉంటుందన్న అంశంపై ఎస్‌బీఐ రీసెర్చ్ నివేదిక విడుదల చేసింది. స్వల్పకాలికంగా ఒకటి, రెండు నెలలు ఆదాయంలో హెచ్చు తగ్గులున్నా... ధరలు తగ్గడం వల్ల ప్రజల కొనుగోలుశక్తి పెరిగి దీర్ఘకాలంలో ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది. రాష్ట్ర ఖజానాకు అదనంగా రూ.16,759 కోట్ల ఆదాయం సమకూరుతుందని వెల్లడించింది.
2017లో జీఎస్‌టీ అమలు చేసినప్పుడు కూడా ఆదాయం తగ్గుతుందని రాష్ట్రం అంచనా వేసినా, ఆ తర్వాత ఆదాయం భారీగా పెరగడమే దీనికి ఉదాహరణగా పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్ర జీఎస్‌టీ ఆదాయం 2024–25 సంవత్సరంలో రూ.33,677 కోట్లుగా ఉంది. ఇందులో అత్యధికంగా 28 శాతం శ్లాబు నుంచి 42.65శాతం ఆదాయం
అంటే రూ.14,366.61 కోట్లు సమకూరింది.