రైతుల కోసం జాతీయ స్థాయి ఉద్యమం | National level movement to be held for Farmers | Sakshi
Sakshi News home page

రైతుల కోసం జాతీయ స్థాయి ఉద్యమం

Feb 28 2015 2:36 AM | Updated on Sep 2 2017 10:01 PM

రైతుల కోసం జాతీయ స్థాయి ఉద్యమం

రైతుల కోసం జాతీయ స్థాయి ఉద్యమం

కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం రైతు శ్రేయస్సును కాలరాస్తూ, రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని లాక్కొనే చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలను..

మార్చిలో మేధాపాట్కర్, అన్నాహజారేలను తీసుకొస్తాం
 సామాజిక వేత్త అగ్నివేశ్
 ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటన

 
 సాక్షి, విజయవాడ బ్యూరో: కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం రైతు శ్రేయస్సును కాలరాస్తూ, రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని లాక్కొనే చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టేలా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ ప్రకటించారు. మార్చి రెండు లేదా మూడోవారంలో మేధాపాట్కర్‌ను, మార్చి చివరివారంలో అన్నా హజారేను రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి తీసుకొస్తామని రైతులకు ఆయన భరోసానిచ్చారు. గుంటూరు జిల్లా పెనుమాక, వెంకటపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన బృందానికి అగ్నివేశ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు ఎన్నికల్లో గెలుపుకోసం డబ్బులు ఖర్చుపెట్టిన కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.టీడీపీ ప్రభుత్వం కోసం కేంద్రం తెచ్చిన భూ ఆర్డినెన్సును పార్లమెంటులో అడ్డుకోవాలని అన్ని పార్టీలనూ కోరుతున్నట్టు చెప్పారు. పొలాలు లాక్కునేందుకు వచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.
 
 అధికారం ప్రయోగిస్తున్నారు: సంధ్య
 చంద్రబాబు చేసే కుట్రలను రైతులు, కూలీలు, ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య పిలుపునిచ్చారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడేలా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు చెప్పారు. బృందంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి రాష్ట్ర నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కన్వీనర్ పి.రామకృష్ణంరాజు ఉన్నారు.
 
 పెట్టుబడిదారుల సేవలో ప్రభుత్వం
 విజయవాడ: ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్న ప్రభుత్వాధినేతలు పెట్టుబడిదారుల సేవలో నిమగ్నమయ్యారని  స్వామి అగ్నివేశ్ నిప్పులు చెరిగారు.  ల్యాండ్ పూలింగ్, భూసేకరణపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన సదస్సులో అగ్నివేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని విపక్ష పార్టీ అయిన వైఎస్సార్ సీపీపైకి నెట్టేయడం బాబు ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని అన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement