మంత్రా మజాకా!

Narayana engineering college builds without permits

అడ్డగోలుగా మంత్రి భవనాల అ‘క్రమబద్ధీకరణ’

పురపాలక శాఖకు రూ.7 కోట్లు మంత్రి పంగనామం

తీర్మానాన్ని రద్దు చేసి ఆర్థిక నష్టాన్ని నివారించండి

జిల్లా కలెక్టర్, ఆర్జేడీలకు ప్రతిపక్షం కౌన్సిలర్లు ఫిర్యాదు 

పురపాలక శాఖా మంత్రే అ‘క్రమబద్ధీకరణ’కు తెరలేపారు. మున్సిపాలిటీల్లో భవనాల క్రమబద్ధీకరణకు ఆ శాఖ మంత్రిగా ఇచ్చిన ఉత్తర్వులను ఆయనే ఉల్లంఘిస్తూ గూడూరు మున్సిపాలిటీకి సుమారు రూ.7 కోట్లకు శఠగోపం పెట్టారు.  అధికారాన్ని అడ్డం పెట్టుకుని పైసా చెల్లించకుండా తన భవనాలు క్రమబద్ధీకరణకు కౌన్సిల్‌ ద్వారా ఏక్షపక్షంగా తీర్మానాన్ని చేయించుకున్నారు.

నెల్లూరు , గూడూరు : గూడూరు మున్సిపాలిటీ పరిధిలో నారాయణ ఇంజినీరింగ్‌ కళాశాల చైర్మన్, రాష్ట్ర పురపాలక శాఖా మంత్రి నారాయణ తండ్రి సుబ్బ రామయ్య సర్వే నంబరు 954/ఏ, 955/ఈ, 954/1, 955/ఏ, 955/సీ, 955/డీల్లో కళాశాల విద్యార్థులు కోసం వసతిగృహాలను 2001లో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించారు. ఈ భవనాలు క్రమబద్ధీకరణ చేసుకోవాలని మున్సిపల్‌ అధికారులు గతంలో ఉత్తర్వులు జారీచేశారు. అయినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో 2014లో నారాయణ పురపాలక శాఖ మంత్రి అయ్యారు. మున్సిపల్‌శాఖ మంత్రిగా 2015లో జీఓ నంబరు 128 జారీ చేస్తూ.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమైన భవనాలను క్రమబద్ధీకరించుకునే అవకాశాలు కల్పించారు. మంత్రి నారాయణకు సంబంధించిన భవనాల క్రమబద్ధీకరణకు నిబంధనల ప్రకారం సుమారు రూ.7 కోట్లు చెల్లించాల్సి ఉంది. దీన్ని ఎగనామం పెట్టేందుకు రూపాయి చెల్లించకుండా క్రమబద్ధీకరణ చేపట్టేందుకు కౌన్సిల్‌ ఆమోదం కోసం ప్రతి కౌన్సిల్‌ అజెండాలో పెట్టడం, ఈ అంశాన్ని వైఎస్సార్‌సీపీ కౌన్సిల్‌ సభ్యులు తిరస్కరించడం జరుగుతూ వచ్చింది.

దీంతో నేరుగా క్రమబద్ధీకరణ చేసుకునేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌కు ప్రతిపాదనలు చేసుకున్నారు. సంబంధిత అధికారులు 21 షరతులు విధిస్తూ.. వాటిని పూర్తిచేసి కౌన్సిల్‌ ఆమోదం పొందాకే క్రమబద్ధీకరిస్తామని చెబుతూ సమాచారం ఇచ్చారు. ఆ 21 షరతుల్లో ముఖ్యంగా అక్రమంగా నిర్మించిన భవనాలను క్రమబద్ధీకరించుకోవాలంటే చెల్లిం చాల్సిన ఫీజుతో పాటు, 33 శాతం మొత్తాన్ని పెనాల్టీగా   చెల్లించాలి. వాస్తవంగా భవన నిర్మాణానికి 10 శాతం స్థలాన్ని వదిలి నిర్మాణం చేపట్టాలి. దీనికి విరుద్ధంగా భవనాలు నిర్మించడంతో అందుకు గాను 14 శాతం జరిమానా చెల్లించాలి. ఈ లెక్కన సుమారుగా రూ.7 కోట్ల మేర మున్సిపాలిటీకి చెల్లించాల్సి ఉంది.

దీన్ని ఎగ్గొట్టేందుకు డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ విధించిన షరతులను పూర్తి చేయకపోగా, ఆ విభాగం పన్ను మినహాయింపునకు అనుమతి ఇచ్చిందంటూ క్రమబద్ధీకరణకు అధికార పక్షం కౌన్సిల్‌ అజెండాలో గత ఏప్రిల్‌ పెట్టి ఏక్షపక్షంగా ఆమోదించుకున్నారు. ఈ అంశానికి  వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు, కౌన్సిలర్‌ ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు నాశిన నాగులు, మహేష్‌రెడ్డి, గిరిబాబు, రమీజా డీసెంట్‌ తెలిపారు. విపక్షం వ్యతిరేకించి, డీసెంట్‌ తెలిపిన ఈ అంశంపై చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలు ప్రశ్నార్థకమయ్యాయి. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి నాశిన నాగులు, పట్టణాధ్యక్షుడు బొమిడి శ్రీనివాసులులు, కౌన్సిలర్లు చోళవవరం గిరిబాబు, రమీజా జిల్లా కలెక్టర్, ఆర్జేడీలతో పాటు మున్సిపల్‌ కార్యాలయంలో కమిషనర్‌ చంద్రశేఖర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేయడంతో ఈ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top