కొత్తగా 40 వేల ఉద్యోగాలు

Municipal Department To Establish Grama Sachivalayam Posts In Andhra Pradesh - Sakshi

వార్డు సచివాలయాల్లో నియామకం

ప్రభుత్వానికి మున్సిపల్‌శాఖ ప్రతిపాదనలు 

సూత్రప్రాయంగా ప్రభుత్వ ఆమోదం

వారంలో నోటిఫికేషన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వ పథకాలు సకాలంలో, పారదర్శకంగా అందజేయడానికి మున్సిపల్‌శాఖ 4 వేల సచివాలయాలను ఏర్పాటు చేయనుంది.  దీంతో కొత్తగా మరో 40 వేల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. వార్డు సచివాలయం ఏర్పాటుకు కనిష్టంగా 4 వేలు.. గరిష్టంగా 6 వేల జనాభా ఉండనుంది. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ప్రజల సమస్యలు పరిష్కరించడానికి, ప్రభుత్వ పథకాలు అందుబాటులోకి తీసుకు రావడానికి  పెద్ద సంఖ్యలో ఉద్యోగులను నియమించాల్సి ఉందని మున్సిపల్‌ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. బుధవారం మున్సిపల్‌ డైరెక్టర్‌ జి.విజయకుమార్‌ వార్డు సచివాలయాల పరిస్థితి, వాటి ప్రాధాన్యత,  ఉద్యోగుల విద్యార్హతలు తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, మున్సిపల్‌శాఖ కార్యదర్శి శ్యామలరావు తదితరులకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు.

కొత్తగా నియమించనున్న ఉద్యోగులకు ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండేలా  విద్యార్హతలు నిర్ణయించనున్నట్టు చెప్పారు. వీరి ద్వారా ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌ మోహన్‌రెడ్డి ఆశించిన రీతిలో సమస్యలు సత్వరమే పరిష్కరించే అవకాశం ఉందని చెప్పారు. కాగా, వీరి నియామకంపై ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. వారం రోజులలోపు నోటిఫికేషన్‌ జారీ చేయనుందని విశ్వసనీయ సమాచారం.

 110 మున్సిపాల్టీల్లో కొత్తగా 1.25 లక్షల ఉద్యోగాలు..
రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీల్లో దాదాపు 81 వేల వలంటీర్లను నియమించనున్నారు. అలాగే కొత్తగా ఏర్పాటు కానున్న 4 వేల వార్డు సచివాలయాల్లో 40 వేల ఉద్యోగాలు రానున్నాయి. ఒక్కో సచివాలయంలో 10మంది సిబ్బందిని నియమిస్తారు. మొత్తం కొత్తగా 1.25 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top