బంటుమిల్లి టీడీపీలో ముసలం


  • ఎంపీపీ పదవికోసం పోటీ

  •  బరిలో ముగ్గురు అభ్యర్థులు

  •  పెడన, న్యూస్‌లైన్ : బంటుమిల్లి టీడీపీలో ముసలం పుట్టింది. ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీపీ పదవి కోసం ముగ్గురు నాయకులు పోటీ పడుతున్నారు. పెడన నియోజకవర్గంలో బంటుమిల్లికి ప్రత్యేక స్థానం ఉంది. మల్లేశ్వరం నియోజకవర్గం ఉన్నప్పుడు అందరు నాయకులు బంటుమిల్లి కేంద్రంగా రాజకీయాలు నడిపేవారు.



    టీడీపీ ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సొంత మండలం ఇదే. ఎంపీటీసీ ఎన్నికల్లో 14 స్థానాలకు టీడీపీ 13 స్థానాలను కైవసం చేసుకుంది. మూడు చోట్ల ఎస్పీ మహిళలు గెలి చారు. దీంతో వారు ముగ్గురు ఎంపీపీ పదవి కోసం పోటీపడుతున్నారు. ఎస్సీ మహిళకు కేటాయించిన కంచండం నుంచి ఎద్దు జోస్పిన్, ములపర్రు నుంచి పల్లెకొండ వెంకటలక్ష్మి, జనరల్‌కు కేటాయించిన పెదతుమ్మిడి  నుంచి ఎస్సీ వర్గానికి చెందిన పాలడుగుల వనలమ్మగెలుపొందారు.

     

    ఎంపీపీ పదవి ఎవరికో..



    ఎంపీపీ పదవిని ఎస్సీ మహిళకు కేటాయించడంతో తొలుత టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో ఎంపీపీని చేస్తామంటూ ఓ ఉపాధ్యాయుడి సతీమణి పల్లెకొండ వెంకటలక్ష్మిని ములపర్రు నుంచి టీడీపీ నాయకులు పోటీలో నిలిపారు. ఎంపీపీ పదవి తమ గ్రామానికే రావాలన్న ఉద్దేశంతో గతంలో సర్పంచి, ఎంపీటీసీ పదవుల కోసం పోటీచేసి ఓడిపోయిన పాలడుగుల వెంకటేశ్వరరావు తన తల్లి వనలమ్మను రంగంలోకి దించారు.



    పెద తుమ్మిడి టీడీపీ నాయకులు కష్టపడి ఆమెను గెలిపించారు. ఈ నేపథ్యంలో పల్లెకొండ వెంకటలక్ష్మితోపాటు ఎంపీటీసీలుగా గెలిచిన ఎద్దు జోస్పిన్, వనలమ్మ ఎంపీపీ పదవి తనకంటే తనకంటూ పోటీ పడుతూ రచ్చకెక్కారు. ఆ ముగ్గురు తనకే పదవి ఇవ్వాలంటూ పదే పదే కాగితను కలిసి డిమాండ్ చేస్తున్నారు. దీంతో సొంత మండలంలో కాగితకు ఎంపీపీ పదవి తలనొప్పిగా మారింది. ఎద్దు జోస్ఫిన్‌కు కాపు సామాజిక వర్గం నాయకులు, వనలమ్మకు కాగిత సామాజిక వర్గం వారు మద్దతు పలుకుతున్నారు.



    ముందు నుంచి పల్లెకొండ వెంకటలక్ష్మికి మద్దతుగా ఉన్నవారు ఇప్పుడు దూరమయ్యారు. ఆమె భర్త ఉద్యోగం బాధ్యతలే చూసుకుంటారా, ఎంపీపీ వ్యవహారాలు నెరవేరుస్తారా అన్న చర్చను మిగిలిన అభ్యర్థులు తెరపైకి తెచ్చారు. తమకే మద్దతు పలకాలంటూ ఆ ముగ్గురు అభ్యర్థులు తోటి ఎంపీటీసీ సభ్యుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తమకే మద్దతు పలకాలని జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచిన దాసరి జ్యోతితో ప్రమాణాలు చేయించుకున్నారని తెలిసింది. ఈ పరిణామాలతో విసుగుచెందిన కాగిత వెంకట్రావ్ తాను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చూద్దామంటూ దాటవేశారని తెలిసింది.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top