యువకులే అధికం.. | Sakshi
Sakshi News home page

యువకులే అధికం..

Published Mon, Apr 13 2020 8:58 PM

Most Of The coronavirus Infected People In Kurnool District Are Young - Sakshi

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో ఇప్పటిదాకా 84 కోవిడ్‌ (కరోనా) పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ విషయంలో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ కేసులు వెలుగు చూస్తున్నాయి. అయితే..బాధితుల్లో ఎక్కువమంది యువకులే ఉంటున్నారు. శనివారం దాకా నమోదైన 82 కేసుల్లో 40 ఏళ్లలోపు వారు 47 మంది ఉండడం ఇందుకు బలం చేకూర్చుతోంది.  

కోలుకునే చాన్స్‌ ఎక్కువే 
జిల్లాలో గత నెల సంజామల మండలం నొస్సంలో ఉండే రాజస్థాన్‌కు చెందిన  యువకుడి(23)కి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో ఇదే మొదటి కేసు. ఇతనితో పాటు ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారిలో ఎక్కువమంది యువకులే ఉన్నారు. యువకుల్లో వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల వారు త్వరగానే కోలుకుంటారని వైద్యవర్గాలు చెబుతుండడం ఊరట కల్గించే అంశం. 

ఐదుగురు మహిళలకూ... 
కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.  కర్నూలు నగరంలోని గనిగల్లి వీధికి చెందిన 45 ఏళ్ల మహిళ, ఆత్మకూరు మున్సిపాలిటీలోని కొత్తపేటలో ఒకరు, పాణ్యం బీసీ కాలనీలో ఒకరు, ఇదే పట్టణంలోని రాచగడ్డ వీధిలో ఒకరు, నంద్యాల మండలం చాబోలులో ఒక మహిళ వైరస్‌ బారినపడ్డారు. ఇంట్లో వీరితో పాటు ఒక పురుషుడు కూడా కరోనా పాజిటివ్‌గా ఉండటం గమనార్హం. పురుషుల ద్వారానే వీరికి కరోనా సోకి ఉంటుందని వైద్యులు భావిస్తున్నారు.

 

తాజాగా ఇద్దరికి.. 
కరోనా విషయంలో జిల్లా అధికార యంత్రాంగం అందరికంటే ముందుగానే అప్రమత్తమైంది. మొదటి కేసు వెలుగు చూడగానే వైరస్‌ నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టారు. అయినప్పటికీ గత నెల 28న ఒక కేసుతో ప్రారంభమైన కరోనా పాజిటివ్‌ బాధితుల సంఖ్య  రెండు వారాల్లోనే 84కు చేరుకుంది.  శనివారం వరకు 82 కేసులు ఉండగా.. ఆదివారం కర్నూలులో ఒకటి, చాగలమర్రిలో ఒక కేసు నమోదయ్యాయి. మొత్తం 84 కేసుల్లో 83 ఢిల్లీకి వెళ్లొచ్చిన వారు, వారితో కలిసి తిరగడం వల్ల, ఇంట్లో ఉండటం వల్ల నమోదైనవే కావడం గమనార్హం. కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అధికారులు లాక్‌డౌన్‌ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. 

త్వరగానే కోలుకుంటారు 
యువకుల్లో వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల కరోనా నుంచి త్వరగానే కోలుకుంటారు. షుగర్, బీపీ, కిడ్నీ, గుండెజబ్బులు వంటి ఇతరత్రా వ్యాధులు ఉంటే తప్ప యువకులకు కరోనా వల్ల పెద్దగా ప్రమాదమేమీ ఉండదు. రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్న వారిలో యువకులే ఉండడం ఇక్కడ ప్రస్తావించదగ్గ విషయం. మన దగ్గర కూడా నొస్సం యువకుడు కోలుకున్నాడు. త్వరలోనే అతన్ని డిశ్చార్జ్‌ చేస్తాం. 
–డాక్టర్‌ కె.నరసింహులు, జనరల్‌ మెడిసిన్‌ హెచ్‌వోడీ, నోడల్‌ అధికారి, కర్నూలు  సర్వజన వైద్యశాల


 

Advertisement

తప్పక చదవండి

Advertisement