
రాచమల్లుకు తప్పిన ప్రమాదం
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి రెప్పపాటులో ప్రమాదం తప్పింది.
- ఎమ్మెల్యే కారును ఢీ కొన్న లారీ
- ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు మరో నలుగురు
ప్రొద్దుటూరు: వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి రెప్పపాటులో ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యేతోపాటు ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, మరో నలుగురు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఎమ్మెల్యే తన ఇన్నోవా కారు ఏపీ 04 బీపీ 1089లో శనివారం ఉదయాన్నే ప్రొద్దుటూరులో ఇంటి నుంచి బెంగళూరుకు బయల్దేరారు. కారు పులివెందుల దాటి కదిరి మార్గంలో ఘాట్‌లో వెళుతుండగా ఉదయం 6.30 ప్రాంతంలో ఎదురుగా 100 కిలోమీటర్ల వేగంతో లారీ వచ్చింది. ఈ విషయాన్ని కారు డ్రైవర్ హరి గమనించి అప్రమత్తమయ్యాడు.
అదే సమయంలో ముందు వైపున ట్రక్కు ఉండటంతో కారు పక్కకు తప్పుకోవడానికి వీలు లేకుండాపోయింది. ఆ లోగా ఎదురుగా వస్తున్న లారీ ఎమ్మెల్యే కారును రాసుకుంటూ వెళ్లింది. డ్రైవర్ కారును మరింత పక్కకు తిప్పడంతో వెనుకభాగంలో లారీ గట్టిగా డీకొట్టింది. దీంతో కారు వెనుకభాగం దెబ్బతింది. ఎమ్మెల్యేతోపాటు కారులో ఉన్న ఆయన సోదరుడు కిరణ్‌కుమార్‌రెడ్డి, వ్యక్తిగత పీఏ పెంచలయ్య, ఎమ్మెల్యే అనుచరుడు ఈశ్వర్‌రెడ్డి, గన్‌మన్, కారు డ్రైవర్‌తో సహా మొత్తం ఆరుగురు సురక్షితంగా బయటపడ్డారు. కాగా ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే గతంలో ఓ మారు రాచమల్లుపై హత్యాయత్నం జరిగింది. ఇప్పుడు అక్కడే ప్రమాదం జరగడం పలు అనుమానాలకు తావిస్తోంది.