మంత్రిగారి రాజ్యం.. బంధువులకే పట్టం

Minister Ganta Srinivasa rao family Rolling in Bhimili

ప్రారంభోత్సవాలన్నీ వారి చేతుల మీదే ..

పార్టీలో సీనియర్ల కినుక

మంత్రి గారి కుమారుడంట.. వేయండి ఓ పూలహారం.. ఆ బిల్డింగ్‌ ప్రారంభోత్సవం వీరితో చేయించండి.. మంత్రిగారు మెచ్చుకుంటారు..ఈయన మంత్రి గారి స్నేహితుడు.. ఈయనకీ ఓ దండ వేసేయండి మరి.. అలాగే ఆ భూమిపూజలవీ  చేయించండి.. ఆయన మంత్రి గారి మేనల్లుడు.. అవునా..   అక్క డ ప్రారంభోత్సవం ఉందన్నారుగా.. ఈయనతో చేయించండి..మంత్రిగారు గుర్తు పెట్టుకుంటారు..ఇదీ భీమిలి నియోజకవర్గంలో మూడేళ్లుగా జరుగుతున్న తంతు.. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మంత్రిగారి బంధుగణం చేతులమీదే ప్రారంభం అవుతున్నాయి. పార్టీ కోసం కష్టపడిన వారిని విస్మరించి బంధువులు అంతా తామై ప్రారంభోత్సవాలు చేయించడాన్ని  జీర్ణించుకోలేకపోతున్నారు సీనియర్‌ నాయకులు.

తగరపువలస(భీమిలి) : మొన్న మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు రవితేజ మధురవాడలో, నిన్న మంత్రి స్నేహితుడు పరుచూరి భాస్కరరావు భీమిలిలో, నేడు మంత్రి మేనల్లుడు విజయసాయి తగరపువలసలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూనే ఉన్నారు. ఏ అధికారంతో వీరు ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు భూమిపూజలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారో భీమిలికి చెందిన టీడీపీ నాయకులకే కాదు అధికారులకు కూడా అంతుచిక్కడంలేదు.

భీమిలిలోని అభివృద్ధి కార్యక్రమాలన్నీ మంత్రి గారి బంధువుల చేతుల మీదుగానే ప్రారంభమవుతున్నాయి. మాజీ మంత్రి, వివిధ హోదాలలో పార్టీ పదవులు చేపట్టిన సీనియర్‌ నాయకులను కాదని, అయిన వారి చేత కార్యక్రమాలు చేయించడాన్ని అటు అధికారులు, ఇటు టీడీపీ తమ్ముళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. అడ్డు చెప్పి మంత్రిగారి ఆగ్రహానికి గురయ్యే బదులు జీ హుజూర్‌ అంటూ వంతపాడితే పోయేదేమీ లేదని ఒకవర్గం సర్దుకుపోతున్నారు. దిగువశ్రేణి నాయకులు మాత్రం అంగీకరించలేకపోతున్నారు.

సీనియర్లకు గుర్తింపేదీ?

2004 నుంచి భీమిలిలో స్థానికేతరులు ఎమ్మెల్యేలుగా ఎంపిక కావడంతో దాదాపు ఇక్కడ అన్నిపార్టీల నాయకులకు ప్రాధాన్యం తగ్గిపోయింది. కనీసం అభివృద్ధి పనుల విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు తీరిక లేకపోతే సీనియర్‌ నాయకులు, కార్యకర్తలకు అవకాశం ఇవ్వాలి గాని ప్రజాప్రతినిధుల బంధువులకు ఎలా అప్పగిస్తారంటూ తెలుగు తమ్ముళ్లే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భీమిలి భూవివాదాలపై సిట్‌ దర్యాప్తు ప్రారంభమైన తరువాత టీడీపీ భీమిలి కన్వీనర్‌గా ఉన్న పరుచూరి భాస్కరరావు తన మకాం బెంగుళూరుకు మార్చేశారు.

ఇటీవల ప్రారంభమైన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమం ద్వారా ప్రత్యక్షమైన విజయ్‌ మంత్రి గంటా మేనల్లుడని ప్రచారం జరిగింది. కానీ అభివృద్ధి పనులలో ఆయన ప్రత్యక్షంగా చేయిపెడితే సహించలేకపోతున్నామని భీమిలికే చెందిన టీడీపీ సీనియర్‌ నాయకుడొకరు వ్యాఖ్యానించారు. పార్టీ ఆవిర్భావం నుంచి జెండాలు మోసిన నాయకులు ఇంకా బతికే ఉన్నారని మంత్రి గ్రహించాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top