అక్రమ మైనింగ్‌లో పేలుడు పదార్థాల వినియోగం | Mining Mafia In Guntur District | Sakshi
Sakshi News home page

అక్రమ మైనింగ్‌లో పేలుడు పదార్థాల వినియోగం

Sep 7 2019 10:12 AM | Updated on Sep 7 2019 10:12 AM

Mining Mafia In Guntur District - Sakshi

నడికుడిలో అక్రమ మైనింగ్‌ జరిగిన ప్రాంతం

సాక్షి,దాచేపల్లి/గుంటూరు: గత టీడీపీ ప్రభుత్వ హయాంలో మండలంలోని కేసానుపల్లి, నడికుడి, పిడుగురాళ్ల మండలం కోనంకి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్‌ కోసం టీడీపీ నాయకులు భారీగా పేలుడు పదార్ధాలను సరఫరా చేశారు. ఎటువంటి అనుమతులు, లైసెన్స్‌ లేకుండా పేలుడు పదార్ధాలను తరలించారనేది జగమెరిగిన సత్యం. టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి గురజాల శాసనసభ్యుడు యరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన అక్రమమైనింగ్‌లో సున్నపురాయిని వెలికితీయటం కోసం భారీగా పేలుడు పదార్ధాలను ఉపయోగించారు. టీడీపీ నేత బత్తుల రాంబాబుతో పాటుగా మరికొంతమంది నాయకులు పేలుడు పదార్ధాలను అక్రమ మైనింగ్‌ పనులకు తరలించి కోట్లకు పడగలెత్తారు.

యరపతినేని సహకారంతో రాంబాబు అడ్డూఅదుపులేకుండా మైనింగ్‌లో పేలుళ్లకు ఉపయోగించే అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్, ఓడీ(ఆర్డినరీ డిటోనేటర్లు) తదితర పదార్ధాలను తరలించారు. దీనిపై అప్పట్లో పనిచేసిన పోలీస్‌ అధికారులు కూడా చర్యలు తీసుకోకపోవటంతో టీడీపీ నేతల ఆగడాలకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకు అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై దృష్టి పెట్టిన అధికారులు సున్నపురాయి వెలికితీసేందుకు ఉపయోగించిన పేలుడు పదార్ధాలు, వీటిని సరఫరా చేసిన వ్యక్తులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. 2009 నవంబర్‌ 16వ తేదీన నారాయణపురంలో ఓ వ్యక్తి ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన పేలుడు పదార్ధాలు పేలి 15 మంది మృతిచెందగా మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ఇంత భారీస్థాయిలో పేలుడు పదార్ధాలు సరఫరా చేసినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవటం చర్చనీయాంశమైంది.

యథేచ్ఛగా పేలుడు పదార్ధాల సరఫరా
టీడీపీలో బడా నేతగా చెలామణి అవుతున్న బత్తుల రాంబాబు మాట గత టీడీపీ ప్రభుత్వంలో వేదవాక్కు. రాంబాబు తండ్రి నరసింహారావు అక్రమ మైనింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నడికుడి, కేసానుపల్లి, కోనంకి గ్రామాల్లో గత టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి అనుమతులు లేకుండా ఐదేళ్లపాటు నిరంతరాయంగా జరిగిన అక్రమ మైనింగ్‌ ద్వారా సుమారుగా 96 లక్షల టన్నుల సున్నపురాయిని తవ్వి తీశారు. దీనిపై ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ, పెనాల్టీ చెల్లించకుండా రూ.536 కోట్ల దోపిడీ చేశారు. అక్రమ మైనింగ్‌ వ్యవహరంపై మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయటంతో విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అక్రమమైనింగ్‌ ద్వారా తవ్వి తీసిన 96 లక్షల టన్నుల సున్నపురాయిని ఎలా తీశారనే దానిపై విచారణ పూర్తి స్థాయిలో జరగలేదు. ఎన్ని టన్నుల రాయిని తీశారు.

సున్నపురాయిని వెలికి తీయటం కోసం ఎన్ని టన్నుల అమోనియం నైట్రేట్, డిటోనేటర్లు, ఫీజు వైర్లతో పాటుగా ఇతర పేలుడు పదార్ధాలను ఉపయోగించారనే దానిపై విచారణ జరగలేదు. టీడీపీ నేత రాంబాబుతో పాటుగా మరికొంతమంది టీడీపీ నాయకులు అక్రమంగా క్వారీల్లో సున్నపురాయిని బయటకు తీయటం కోసం బ్లాస్టింగ్‌ చేసేందుకు ఉపయోగించే అమోనియం, డిటోనేటర్లు, సేఫ్టీ ఫ్యూజు, జిలెటిన్‌ స్టిక్స్‌లను నడికుడితో పాటుగా ఇతర గ్రామాల్లో జరిగే క్వారీ పనులకు తరలించారు. పట్టపగలే ఎటువంటి అభ్యంతరాలు లేకుండా పేలుడు పదార్ధాలను తీసుకువచ్చి క్వారీల్లో బ్లాస్టింగ్‌ జరిపించేవారు.

క్వారీల్లో సున్నపురాయి వెలికితీయటం కోసం సుమారుగా 8వేల టన్నుల అమోనియం నైట్రెట్‌ వాడినట్లు సమాచారం. ఇవికాక భారీస్థాయిలో డిటోనేటర్లు, జిలెటిన్‌ స్టిక్స్, ఫ్యూజ్‌ వైర్లు కూడా భారీగానే ఉపయోగించారు. లైసెన్స్‌ కలిగిన బ్లాస్టర్, శిక్షణ పొందిన మేట్‌ లేకుండానే బ్లాస్టింగ్‌ చేశారు. క్వారీల్లో రోజువారీగా పనిచేసే కూలీలతోనే భారీ బ్లాస్టింగ్‌లు చేయించారు. భారీ బ్లాస్టింగ్‌ ప్రభావంతో సమీప నివాస గృహాలు దెబ్బతిన్నాయి. కొంతమంది కూలీలు కూడా బ్లాస్టింగ్‌ సమయంలో గాయపడినా ఆ విషయాలు బయటకు రాకుండా చేశారు.

అధికారుల చర్యలు శూన్యం
టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అక్రమమైనింగ్‌ వ్యవహారంలో సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. మార్కెట్‌లో, నివాస గృహాల్లో కొద్దిమొత్తంలో అమోనియం నైట్రేట్, జిలెటిన్‌ స్టిక్స్, ఫ్యూజ్‌ వైర్లు దొరికితే హడావుడి చేసి కేసులు పెట్టే పోలీసులు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను తరలిస్తున్నప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పేలుడు పదార్ధాలను సరఫరా చేసే టీడీపీ నేతలను కనీసం పిలిచి హెచ్చరించక పోగా వారికి రాచమర్యాదలు చేశారు.

రాష్ట్రంలో వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో తాజాగా అక్రమ మైనింగ్‌ వ్యవహరంపై హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం, రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు అంగీకారం తెలపటం సంచలనం కలిగించింది. అక్రమ మైనింగ్‌ చేసిన వ్యక్తులతో పాటుగా పేలుడు పదార్ధాలను సరఫరా చేసిన వ్యక్తులపై కూడా చర్యలు ఉంటాయనే చర్చ జరుగుతోంది. ఇప్పటికైనా అక్రమమైనింగ్‌ , పేలుడు పదార్ధాల సరఫరా వ్యవహారంలో నిష్పక్షపాతంగా విచారణ చేయాలని ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement