మైండ్ గేమ్!

మైండ్ గేమ్!


సాక్షి ప్రతినిధి,కడప: ‘నవ్విపోదురుగాక నాకేటిసిగ్గు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. జెడ్పీ పీఠం కైవసం చేసుకునేందుకు అడ్డదారులు ఎంచుకుంటున్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు. నీచరాజకీయాలకు తెరలేపుతున్నారు. అధికారిక హోదాను వినియోగించుకొని ఛైర్మన్‌గిరిని సొంతం చేసుకునేందుకు కుటిలనీతిని ప్రదర్శిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ సభ్యులు తమతో సంప్రదింపులు జరుపుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

 

  జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలుండగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు 11 స్థానాల్లో, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు 39 స్థానాల్లో గెలుపొందారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జెడ్పీ ఛెర్మైన్‌గిరి ఆశించడం అత్యాశే అవుతుంది. ఒకటి, రెండు స్థానాలు తేడా ఉంటే ప్రలోభాలకు గురిచేసి సాధించుకునే ప్రయత్నం చేయడం సహజమే. కానీ టీడీపీకి ఏకంగా 15 మంది జెడ్పీటీసీల మద్దతు  అవసరం ఉంది. అందులో భాగంగా కొందరిని ప్రలోభాలకు గురిచేసినట్లు సమాచారం. అయితే చాలామంది తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రలోభాలను తిరస్కరించిన ట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమకు 11 మంది వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీల మద్దతు ఉందని మైండ్‌గేమ్ ఆడుతున్నారు.  

 

 ప్రజాక్షేత్రంలో ఓటమిపాలై..

  తెలుగుదేశం పార్టీ ప్రజాతీర్పుకు విలువ నివ్వడంలేదు. ఆ పార్టీని జెడ్పీ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారు. ప్రతి ఎన్నికల్లోనూ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి తిరస్కారమే ఎదురైంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజావిశ్వాసం పొందేందుకు కృషి చేయాల్సిన టీడీపీ చీప్ పాలి‘ట్రిక్స్’కు పాల్పడుతోంది. ఒకరంటే ఒక్కరు కూడా తాము వైఎస్సార్‌సీపీని వీడతామంటూ జెడ్పీటీసీలు ప్రకటించలేదు. అయినప్పటికీ అధినేత వద్ద మెప్పుకోసం జిల్లాలో తమకు ప్రజాబలం ఉందని చెప్పుకునేందుకు తెలుగుదేశం నేతలు తాపత్రయపడుతున్నారు. అందుకు కర్త, కర్మగా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్, పార్లమెంటుకు పోటీచేసి ఓడిపోయిన శ్రీనివాసులురెడ్డిలు వ్యవహరిస్తున్నారు. వీరికి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వంత పాడుతున్నారు. ప్రజా మద్దతు లేకపోయినా అధికారం ఆశించడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆ పార్టీ నేతలు ఏ ఒక్కరూ భావించడం లేదు. కేవలం మైండ్ గేమ్‌ను అమలుపర్చి అవకాశం వస్తే జెడ్పీపీఠం దక్కించుకుందామనే ఎత్తుగడలో ఉన్నట్లు తెలుస్తోంది.

 

 వారి ఆశలు అడియాసలే....

 వైఎస్సార్‌సీపీ ప్రజాప్రతినిధుల విశ్వాసం ముందు తెలుగుదేశం పార్టీ ఆశలు అడియాసలు కాకతప్పదని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అత్మాభిమానం ముందు టీడీపీ ప్రలోభాలు దిగదుడుపేనని, వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీలు ఒక్కరు కూడా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడరనే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అలాంటి వారు ఉంటే ప్రజల కోసం గడిచిన నాలుగు సంవత్సరాలుగా పోరాటం చేసేవారే కాదని, నాయకుల మధ్య అపోహలు సృష్టించేందుకే టీడీపీ నేతల ప్రకటనలు పరిమితమని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పేర్కొంటున్నారు. టీడీపీ కుయుక్తులు ఏమాత్రం చెల్లవని జెడ్పీ పీఠంపై వైఎస్సార్‌సీపీ విజయకేతనం ఎగురవే సి తీరుతుందనే విశ్వాసాన్ని ఆ పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top