ఈ అన్నం, పులిహోర ఎవరైనా తింటారా!

Meka Venkata Appa Rao Visit Girls Hostel In Krishna - Sakshi

ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు ఆగ్రహం

కృష్ణా, నూజివీడు:‘పులిహోర...అన్నం తినలేకపోతున్నాం.. సుద్దలాగా అవుతోంది.. ఐదు రోజులుగా భోజనం సరిగా తినడం లేదు...’’అంటూ పట్టణంలోని సాంఘికసంక్షేమశాఖ ఆధ్వర్యంలోని కళాశాల బాలికల వసతిగృహం విద్యార్థినిలు ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్‌ అప్పారావు వద్ద ఆవేదన వ్యక్తంచేశారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌ సీపీ చేపట్టిన బంద్‌లో భాగంగా మంగళవారం పట్టణంలోని మడుపల్లి తాతయ్య ప్రభుత్వ జూనియర్‌ కళాశాల వద్దకు ఎమ్మెల్యే ప్రతాప్‌తోపాటు వైఎస్సార్‌సీపీ నాయకులు వెళ్లారు. విద్యార్థినులు బయటకు వచ్చి తమ బాక్స్‌లను తెరిచి అన్నం, పులిహోర ఎమ్మెల్యేకి చూపించారు. బంద్‌ నిర్వహిస్తున్నామని, ఒక గంటలో నేను హాస్టల్‌కు వస్తానని చెప్పి ఎమ్మెల్యే వెళ్లారు. ఆ తర్వాత హాస్టల్‌కు వెళ్లి ఆహారం పరిశీలించారు. ఈ అన్నం, పులిహోర మనుషులు ఎవరైనా తింటారా అంటూ మ్యాట్రిన్‌ నిర్మలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు అక్కడి చేరుకుని విద్యార్థినులతో హాస్టల్‌ బయట ధర్నాకు దిగారు. తహసీల్దార్‌ గుడిశే విక్టర్‌బాబు, ఏఎస్‌డబ్ల్యూవో వినుకొండమ్మ, సాంఘిక సంక్షేమశాఖ జిల్లా జేడీ ప్రసాద్‌లు హాస్టల్‌ వద్దకు చేరుకున్నారు. హాస్టల్‌లోని పరిస్థితులను ఎమ్మెల్యే ప్రతా ప్‌ వారి దృష్టికి తీసుకువచ్చారు. మరుగుదొడ్ల విషయం ఈనెలలో జరిగిన జెడ్పీ సమావేశంలో ప్రస్తావించామని, వాటిని వెంటనే పూర్తిచేయమని కలెక్టర్‌ చెప్పినా ఇంతవరకు పూర్తిచేయలేదన్నారు.

మెనూ అమలుచేయకపోతే ఫోన్‌ చేయండి
వసతిగృహంలో మెనూ అమలుచేయకపోతే వెంటనే తనకు ఫోన్‌ చేసి చెప్పాలని ఎమ్మెల్యే ప్రతాప్‌ అప్పారావు బాలికలకు సూచించారు. దాదాపు 300మంది ఉన్నందున రెండో హాస్టల్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపుతానన్నారు. హాస్టల్‌లో ఈరోజు సాయంత్రం నుంచే టీవీని ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. పర్మినెంట్‌ కుక్‌లు లేనందున పట్టణంలోని ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌లో ఉన్న వారిలో ఇద్దరిని పంపుతున్నట్లు జేడీ తెలిపారు. తహసీల్దారు గుడిశే విక్టర్‌బాబు, వైఎస్సార్‌ సీపీ పట్టణ అధ్యక్షుడు పగడాల సత్యనారాయణలు చెరొక బియ్యం బస్తాలను, కూరగాయలు తెప్పించి విద్యార్థినులకు భోజనం వండించి పెట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు బసవా భాస్కరరావు, రామిశెట్టి మురళీకృష్ణ, కౌన్సిలర్‌లు కంచర్ల లవకుమార్, శీలం రాము, వైఎస్సార్‌సీపీ నూజివీడు మండల అధ్యక్షులు మందాడ నాగేశ్వరరావు, సీపీఎం నాయకులు జీ రాజు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు లెనిన్, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top