హడావుడి.. గందరగోళం!

Mass Cpying In Tenth Exams - Sakshi

లోలోపల సైలెంట్‌గా మాస్‌ కాపీయింగ్, చూచిరాతలు

ఇన్విజిలేటర్ల జాబితా ముందురోజే వాట్సాప్‌లో హల్‌చల్‌

ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు చేతివాటం ప్రదర్శించినట్లు ఆరోపణలు

అర్హత లేని వారికి స్క్వాడ్‌ విధులు కేటాయించినట్లు చర్చలు

పలుచోట్లు ఇన్విజిలేటర్లు, చీఫ్‌లతోపాటు డిపార్టుమెంట్‌ అధికారుల సస్పెన్షన్‌

ఇదీ పది పరీక్షల తీరు

కడప ఎడ్యుకేషన్‌: పదో తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తాం. ఎక్కడా ఆరోపణలకు తావివ్వం. కాపీయింగ్‌ జరగకుండా అరికడతాం. పరీక్షల పారదర్శకత కోసమే ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ విధానంలో నియమిస్తున్నాం. ఎక్కడైనా కాపీయింగ్‌కు పాల్పడితే యాక్టు 25ను అమలు చేస్తామని విద్యాశాఖాధికారుల డీంబకాలు తప్ప ఎక్కడా అమలు జరిగిన దాఖలాలు కనిపించలేదు. పరీక్షల్లో అంతా హడావుడి ఆర్భాటం చేశారే  తప్ప కొత్తగా సాధించిందేమీ లేదు. అటు పిల్లలను, ఇటు ఇన్విజిలేటర్లను భయాందోళనకు గురి చేసి  బయటనుంచి కాపీలను రాకుండా కొంతమేర అరికట్టారేమోకానీ కొన్ని పరీక్షా కేంద్రాల్లో మాత్రం  మాస్‌కాపీయింగ్, చూచిరాతలు జోరుగా సాగాయి. దీంతోపాటు చాలా  చోట్ల కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల యాజామాన్యం డబ్బులను ఎరవేసి  తమకు అనుకూలమైన చీఫ్, డిపార్టుమెంట్‌ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లను నియమించుకుని తమ పనిని చక్కబెట్టుకున్నారని జోరుగా ఆరోపణలు వచ్చాయి. 

ప్రొద్దుటూరు డిప్యూటీ డీఈఓ ఇటీవలే కొత్తగా బాధ్యతలను తీసుకోవడం.. ఆ డివిజన్‌పై సరైన అవగాహన లేకపోవడం తదితర కారణాలతో ప్రొద్దుటూరులో కూడా జోరుగా మాస్‌ కాపీయింగ్‌ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇ  రాయచోటి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇక్కడ చాలామంది చీఫ్, డిపార్టుమెంట్‌ అధికారులతోపాటు ఇన్విజిలేటర్లు ప్రైవేటు స్కూల్స్‌  యాజమాన్యాలు ఇచ్చే కాసులకు కక్కుర్తిపడి లోలోపల జోరుగా కాపీయింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఈ ఏడాది అర్హత లేని వారిని కూడా స్క్వాడ్‌ వి«ధుల్లో నియమించారని ఉపాధ్యాయ సంఘాలు ఆరోపించాయి. పులివెందుల,వీఎన్‌పల్లి, ఎర్రగుంట్ల, ఖాజీపేట, మఠం, రాజంపేటలో కూడా కాపీయింగ్‌ ఆరోపణలున్నాయి. 

పకడ్బందీగా నిర్వహించాం:పది పరీక్షలను ఈ ఏడాది  చాలా పకడ్బందీగా నిర్వహించాం. ఆరోపణలు వచ్చిన ప్రతిచోట గట్టి నిఘాను ఉంచి పరీక్షలను ప్రశాంతంగా నడిపించాం. కాపీయింగ్‌ను అరికట్టాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని పరీక్ష విధుల నుంచి కూడా తొలగించాం. పరీక్షలు ప్రశాతంగా ముగిశాయి.  – పొన్నతోట శైలజ,  డీఈఓ   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top