‘ఏవోభీ’తావహం | Maoists movements within the boundaries of | Sakshi
Sakshi News home page

‘ఏవోభీ’తావహం

Aug 29 2013 4:26 AM | Updated on Oct 9 2018 2:51 PM

ఒడిశా,ఛత్తీస్‌గఢ్ సంఘటనలతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఈస్ట్‌డివిజన్ అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు అంతటా పోలీసు బలగాలు మోహరించాయి.

గూడెంకొత్తవీధి/పాడేరు,న్యూస్‌లైన్: ఒడిశా,ఛత్తీస్‌గఢ్ సంఘటనలతో ఆంధ్ర-ఒడిశా సరిహద్దు(ఏవోబీ)లోని ఈస్ట్‌డివిజన్ అంతటా యుద్ధ వాతావరణం నెలకొంది. సరిహద్దు అంతటా పోలీసు బలగాలు మోహరించాయి. ఎప్పుడే సంఘటన చోటుచేసుకుంటుందోనన్న ఆందోళనతో మారుమూల తండాల్లోని గిరిజనులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇటీవల మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మాధవ్ అలియాస్ గొల్లూరి రాములు ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లలో మంగళవారం బీఎస్‌ఎ్‌ఫ్ జవాన్‌లపై ప్రతీకార దాడులకు తెగబడ్డారు.

దీంతో సరిహద్దు ప్రాంతాల తోపాటు విశాఖ ఏజెన్సీలోని జీకే వీధి, చింతపల్లి, కొయ్యూరు, ముంచంగిపుట్టు, పెదబయలు మండలాల్లో పోలీసు యంత్రాం గం అప్రమత్తమైంది. మన్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. పట్టున్న జీకే వీధి, కొయ్యూరు, చింతపల్లి ప్రాంతాలకు మావోయిస్టులు చేరుకుంటారనే అనుమానంతో భద్రత సిబ్బంది అడవిని జల్లెడపడుతున్నారు. పెద్ద ఎత్తున బలగాలను ఏజెన్సీకి తరలిస్తున్నారు. ఒకవైపు గాలింపు, మరోవైపు ముమ్మర తనిఖీలు చేపడుతూనే ప్రభుత్వ కార్యాలయాలపై నిఘా పెట్టారు. ఇరువర్గాల ప్రతీకార దాడుల ప్రభావం ఈస్ట్ డివిజన్‌పై పడింది.  
 
‘తూర్పు’ పోలీసుల ముమ్మర గాలింపు

 కొయ్యూరు: తూర్పు గోదావరి పోలీసులు విశాఖ సరిహద్దుల్లో కూంబింగ్‌ను ఉధృతంగా నిర్వహిస్తున్నారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలు పెరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. వారం రోజులుగా ‘తూర్పు’ పోలీసులు కొయ్యూరు మండలంలో అనేక గ్రామాలను జల్లెడ పడుతున్నారు. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలుగా గుర్తింపు పొందిన పలకజీడి దాటి లోతట్టు  ప్రాంతాలైన మర్రిపాకలు, నీలవరం, గంగవరం, ఈదులబంద తదితర గ్రామాలలో కూంబింగ్ జోరు పెంచారు. జీకేవీధి మండలానికి అనుకుని ఉన్న పుట్టకోట,పెదలకం, మండపల్లి వరకు కూంబింగ్ నిర్వహించారు.

ఈ నెల 14న సుమారు 150 మంది వరకు మావోయిస్టులు, మిలీషియా సభ్యులు పలకజీడి  సమీపంలోకి వచ్చారు. వారిలో 25 మంది పాఠశాల వద్దకు వచ్చి నల్లజెండాలు పాతి స్వాతంత్య్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని పిలుపునిచ్చారు. మిగిలిన దళసభ్యులు సమీపంలో టేకు ప్లాంటేషన్ వద్ద కాపు కాశారు. మావోయిస్టులు అక్కడ  పాఠశాల గురించి ఆరా తీసి, అక్కడే ఉద్యోగం చేస్తున్న అటవీ శాఖ గార్డు రమణను హెచ్చరించి ఉద్యోగం మానేయాలని కొట్టినట్టుగా తెలిసింది. విషయం తెలిసిన తూర్పుగోదావరి పోలీసులు  వెంటనే పలకజీడి నుంచి కూంబింగ్‌ను ఉధృతం చేశారు. ఆ ప్రాంతంలో దాదాపు 50 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉన్న అడవిని జల్లెడ పట్టారు.
 
గుత్తికోయల జాడలు?

 పలకజీడి వచ్చిన మిలీషియా సభ్యుల్లో ఎక్కువ మంది గుత్తి కోయలున్నట్టు తెలుస్తోంది. వారు మాట్లాడిన తీరు, చంపేస్తామని భయపెట్టిన విధానం చూస్తుంటే ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వారు కూడా అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈస్టు డివిజన్ పరిధిలోకి తూర్పుగోదావరి  కూడా వస్తుంది. గతంలో నాగులకొండ, యల్లవరం దళాలు ఎక్కువగా తూర్పు మన్యంలో తిరిగేవి. 2001లో ఏరియా కమిటీలు ఏర్పాటు చేసిన తరువాత కోనలోవ పేరిట ఒకదానిని ఏర్పాటు చేసినా అది  పూర్తి స్థాయిలో పనిచేయడం లేదు. మావోయిస్టుల కదలికలు విశాఖ మన్యంలోనే అధికం అయ్యాయి. ఇప్పుడు మావోయిస్టులు తూర్పుగోదావరి సరిహద్దుల వరకు రావడంతో పోలీసులు అక్కడ గాలింపు చేపట్టారు.
 
రంపచోడవరం ఏఎస్పీ ఆరా

 తూర్పుగోదావరి మన్యంలో మావోయిస్టుల కదలికలపై రంపచోడవరం ఏఎస్పీ ఆరా తీస్తున్నారు. పలకజీడిలో  చోటు చేసుకున్న సంఘటన గురించి ఆయన వివరాలు తెలుసుకున్నారు. అటవీ శాఖ ఉద్యోగి రమణను కూడా ఆయన విచారించినట్టు తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement